‘మా ముగ్గురికి మాత్రమే కాదు’ | Bancrofts comments on the sandpaper incident | Sakshi
Sakshi News home page

‘మా ముగ్గురికి మాత్రమే కాదు’

Nov 19 2026 4:05 AM | Updated on Nov 19 2026 4:05 AM

Bancrofts comments on the sandpaper incident

ఆస్ట్రేలియా జట్టులో సభ్యులందరికీ తెలుసు 

‘స్యాండ్‌పేపర్‌’ ఉదంతంపై బాన్‌క్రాఫ్ట్‌ వ్యాఖ్య

మెల్‌బోర్న్‌: ఎనిమిదేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌లో తీవ్ర వివాదం రేపిన ‘స్యాండ్‌పేపర్‌’ ఉదంతంపై మాజీ ఆటగాడు ఉస్మాన్‌ ఖ్వాజా కదిపిన తేనెతుట్టె ఇప్పుడు అన్ని వైపులకు విస్తరించింది. బంతిని టాంపరింగ్‌ చేయడం నిషేధానికి గురైన ముగ్గురు ఆటగాళ్లు స్టీవ్‌ స్మిత్, డేవిడ్‌ వార్నర్, కామెరాన్‌ బాన్‌క్రాఫ్ట్‌లకు మాత్రమే కాకుండా జట్టు సభ్యులందరికీ తెలుసని ఇటీవలే ఖ్వాజా తన పుస్తకం ‘సబ్ర్‌’లో వెల్లడించారు. అతని ఓపెనింగ్‌ సహచరుడు డేవిడ్‌ వార్నర్‌ కూడా ఇది వాస్తవమంటూ మద్దతు పలకగా, ఇప్పుడు బాన్‌క్రాఫ్ట్‌ కూడా తనదీ అదే మాట అంటూ శృతి కలిపాడు. 

2018లో కేప్‌టౌన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో ‘స్యాండ్‌పేపర్‌’ను వాడి బంతి ఆకారాన్ని దెబ్బ తీసేందుకు ప్రయత్నించడంతో స్మిత్, వార్నర్, బాన్‌క్రాఫ్ట్‌లపై ఆస్ట్రేలియా బోర్డు (సీఏ) క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. స్మిత్, వార్నర్‌లపై ఏడాది నిషేధం పడగా, బాన్‌క్రాఫ్ట్‌పై తొమ్మిది నెలల నిషేధం విధించారు. బాన్‌క్రాఫ్ట్‌ జేబులోనే స్యాండ్‌పేపర్‌ బయటపడింది. ఒక ఆ్రస్టేలియన్‌ పత్రికకు రాసిన వ్యాసంలో అతను నాటి ఘటనకు సంబంధించి కొన్ని కీలకాంశాలు చెప్పాడు.  

‘నేను ఆ పని చేయగలనా అని నన్ను అడిగారు. ముందుగా కొంత అసౌకర్యంగా భావించినా చివరకు రాజీ పడ్డాను. అది తప్పని, నిబంధనలు ఉల్లంఘించి మోసం చేయడమని కూడా తెలుసు. అయితే జట్టు కోసం నేను కూడా ఏదైనా చేయగలను అని భావించాను. సరిగ్గా చెప్పాలంటే నేను కేవలం ఎనిమిదో టెస్టు ఆడుతున్న యువ ఆటగాడిని. ఆ సమయంలో చేత్తో గోడ బద్దలు కొట్టమని అడిగినా సిద్ధపడేవాడినేమో. పరుగులు, క్యాచ్‌లతో మాత్రమే కాకుండా జట్టు సహచరులంతా నన్ను తమలో ఒకడిగా అనుకోవాలనే భావనతో ఉండటంతో ఇది సరైన అవకాశంలా అనిపించింది. 

కొత్త ఆటగాడినే అయినా వారంతా నాపై నమ్మకం ఉంచేలా కనిపించాలనే తపనతో నేను విచక్షణ కోల్పోయాను. అందుకే వెంటనే అంగీకరించాను. ఎనిమిదేళ్లుగా జట్టు కోసం ఆ భారమంతా నేను మోస్తూ వచ్చాను. 2018లో విచారణ సందర్భంగా నేను పూర్తి నిజాలు చెప్పలేదు. నా కెరీర్‌ ఇప్పటికే నాశనమైంది కాబట్టి నిజాలు చెప్పదల్చుకున్నా. నిజానికి కేప్‌టౌన్‌కు ముందు పోర్ట్‌ ఎలిజబెత్‌లో జరిగిన రెండో టెస్టులోనే స్యాండ్‌పేపర్‌ను నేను వాడా. తనపై కెమెరాల దృష్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ బాధ్యత నాకు అప్పగించినట్లు వార్నర్‌ చెప్పాడు. పేస్‌ బౌలింగ్‌ కోచ్‌ డేవిడ్‌ సాకర్‌కు కూడా ఇందులో పాత్ర ఉంది. 

మ్యాచ్‌ జరిగే సమయంలో బంతి ఎలా స్పందిస్తోందని, రివర్స్‌ స్వింగ్‌ అవుతుందా అని ప్రధాన పేసర్లు స్టార్క్, కమిన్స్, హాజల్‌వుడ్, మార్ష్, కీపర్‌ పెయిన్‌లను కూడా అడుగుతా వచ్చా. ఒక్క సెషన్‌లోనే మేం 28 పరుగులకు 4 వికెట్లు తీశాం. జట్టు సహచరులంతా చాలా బాగా పని చేస్తున్నావు అంటూ నన్ను అభినందిస్తూనే జాగ్రత్తలు కూడా చెబుతూ వచ్చారు. అయితే ఇంత మోసం చేసినా డివిలియర్స్‌ అద్భుత ఇన్నింగ్స్‌తో మేం టెస్టు ఓడిపోయాం. కేప్‌టౌన్‌లో పిచ్, వాతావరణం కారణంగా స్యాండ్‌పేపర్‌ వాడినా రివర్స్‌ స్వింగ్‌ ప్రభావం చూపించలేదు. 

నేను సరిగా పని చేయడం లేదని కూడా సహచరులు నాతో అన్నారు. అయితే చివరకు కెమెరాల కంటికి నేను చిక్కాను. నన్ను వెంటనే మైదానంనుంచి తప్పించి హ్యాండ్స్‌కోంబ్‌ను కోచ్‌ లీమన్‌ లోపలికి పంపించాడు. అతనికి అన్నీ తెలుసు కాబట్టే అలా చేశాడు కదా. ఇలా అందరి భాగస్వామ్యం ఉన్నా నేను బలిపశువును అయ్యాను. చివరకు కీలక సమయంలో తమకు ఏమీ తెలీదంటూ ప్రధాన బౌలర్లంతా ప్రకటించి తప్పుకోవడం నన్ను మరింత బాధించింది’ అని బాన్‌క్రాఫ్ట్‌ పూర్తిగా వివరించాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement