Photo Credit: Twitter
సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో భాగంగా 2018లో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు బాల్ టాంపరింగ్‌కు పాల్పడడం క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసింది. దీనినే అందరూ ‘సాండ్ పేపర్ గేట్’ వివాదంగా పిలుస్తుంటారు. ఇది జరిగి ఎనిమిదేళ్లు కావొస్తున్నా ఇప్పటికీ ‘సాండ్ పేపర్ గేట్’ వివాదం ఆసీస్ క్రికెట్‌లో మాయని మచ్చుతునకగా మిగిలిపోయింది. తాజాగా ఆ జట్టు మాజీ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా 2018 బాల్ టాంపరింగ్ వివాదాన్ని తన ఆత్మకథ (Sabr)లో ప్రస్తావిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
సాండ్‌పేపర్ వాడకం గురించి కేవలం ముగ్గురికే (స్మిత్, వార్నర్, బాంక్రాఫ్ట్) తెలుసన్న క్రికెట్ ఆస్ట్రేలియా వాదన అబద్ధమని, ఆ సిరీస్‌లోని ఆస్ట్రేలియా జట్టు మొత్తానికి సాండ్‌పేపర్ వాడుతున్న విషయం ముందే తెలుసని ఖవాజా తన పుస్తకంలో పేర్కొన్నాడు. ఆ ముగ్గురు ఆటగాళ్లను జట్టు మొత్తాన్ని కాపాడడం కోసం 'బలిపశువులను' చేశారంటూ బాంబు పేల్చాడు. దీంతో సాండ్ పేపర్ గేట్ ఉదంతం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
ఈ నేపథ్యంలో బాల్ టాంపరింగ్ వివాదంలో భాగమైన మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఎనిమిదేళ్ల తర్వాత మౌనం వీడాడు. ఖవాజా చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో విడుదల చేశాడు. "ఖవాజా చెప్పిన విషయాలు 100 శాతం నిజం, ఇప్పుడు అందరికీ నిజం తెలిసింది. అప్పట్లో క్రికెట్ ఆస్ట్రేలియా జరిపిన దర్యాప్తు లోపభూయిష్టంగా జరిగింది.
ఆ సమయంలో డ్రెస్సింగ్ రూమ్‌లోనే ఉన్న ఖవాజాను కనీసం ప్రశ్నించలేదు. నిజాలు దాచిపెట్టేందుకు కొందరిని మాత్రమే టార్గెట్ చేసి వారిని బలిపశువులను చేశారు. ఇన్నాళ్లు మౌనంగా ఉండడానికి నాకు వేరే కారణాలున్నాయి. కనీసం ఖవాజా ఆత్మకథ ద్వారానైనా ప్రజలు నిజం తెలుసుకున్నారు.
నా కుటుంబంలో కూడా రెండు రోజులుగా ఇదే విషయాల గురించి చర్చ జరుగుతుంది. మేం (నేను, స్టీవ్ స్మిత్) కోల్పోవాల్సింది కోల్పోయాం. చేతులు కాలాకా ఆకులు పట్టుకొని ప్రయోజనం లేదు. ఇప్పటికైనా నిజం బయటకొచ్చింది. దానిని బయటపెట్టిన ఉజ్జీ (ఉస్మాన్ ఖవాజా)కు నేను మద్దతు ఇస్తున్నాను’ ’అని వార్నర్ చెప్పుకొచ్చాడు.
ఏమిటీ బాల్ టాంపరింగ్ వివాదం?
మార్చి, 2018లో కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆటగాడు కామెరూన్ బెన్‌క్రాఫ్ట్ సాండ్‌పేపర్ (ఉప్పు కాగితం) సహాయంతో బంతి రూపాన్ని మార్చడానికి (బాల్ ట్యాంపరింగ్) ప్రయత్నిస్తూ టీవీ కెమెరాలకు చిక్కాడు. అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కు ఈ విషయం ముందే తెలిసినప్పటికీ దీనిని ఆపలేదని ఆరోపణలు వచ్చాయి.
అంతేకాదు అప్పటి జట్టు వైస్ కెప్టెన్‌గా ఉన్న డేవిడ్ వార్నర్ ఈ ప్రణాళికను రూపొందించి, బెన్‌క్రాఫ్ట్‌ను అలా చేయమని ప్రోత్సహించినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా (CA) దర్యాప్తులో తేలింది. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన క్రికెట్ ఆస్ట్రేలియా.. డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్‌లపై ఏడాది పాటు, కామెరున్ బెన్‌క్రాఫ్ట్‌పై 9 నెలల పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడకుండా నిషేధం విధించింది. అలాగే, వార్నర్‌పై జీవితకాల కెప్టెన్సీ నిషేధాన్ని విధించినప్పటికీ, అక్టోబర్ 2024లో వార్నర్‌పై ఉన్న ఈ జీవితకాల కెప్టెన్సీ నిషేధాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా ఎత్తివేయడం గమనార్హం.
ఇదీ చదవండి: ఫ్లాట్ వికెట్లకు అలవాటుపడ్డారు.. వీళ్లేం బౌలింగ్ చేస్తారనుకున్నా!


