‘అతడి విషయంలో తొండి చేశారు.. మా శాపం ఫలించింది’ | Naman-Dhir-Catch Controversy-Sparks Debate-Social Media-2nd ODI | Sakshi
Sakshi News home page

‘అతడి విషయంలో తొండి చేశారు.. మా శాపం ఫలించింది’

Nov 7 2026 5:40 PM | Updated on Nov 7 2026 5:47 PM

Naman-Dhir-Catch Controversy-Sparks Debate-Social Media-2nd ODI

Photo Credit: Twitter

వెల్లింగ్టన్ వేదికగా భారత్,న్యూజిలాండ్ మధ్య రెండో వన్డే మ్యాచ్‌లో భారత ఆల్ రౌండర్ నమన్ ధీర్ ఔటైన తీరు వివాదంగా నిలిచింది. భారత ఇన్నింగ్స్ 25వ ఓవర్లో నమన్ ధీర్ కొట్టిన షాట్‌ను బౌండరీ లైన్ వద్ద ఉన్న టిమ్‌ సీఫెర్ట్ అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద అంపైర్ థర్డ్ అంపైర్‌ను ఆశ్రయించాడు. 

చాలా రిప్లేలతో పాటు సీఫెర్ట్ అందుకున్న క్యాచ్‌ను వివిధ యాంగిల్స్‌లో పరిశీలించిన తర్వాత క్యాచ్ అందుకోవడంలో ఎలాంటి పొరపాటు జరగలేదని తేలడంతో నమన్ ధీర్ ఔట్ అని అంపైర్‌ ప్రకటించాడు. అయితే దీనిపై సోషల్ మీడియాలో మాత్రం వివాదం చెలరేగింది. రీప్లేలలో సీఫర్ట్ క్యాచ్ పట్టుకునే సమయంలో అతని కాళ్లు బౌండరీ రోప్‌కు చాలా దగ్గరగా ఉన్నాయని, అలాగే బౌండరీ కుషన్స్ కూడా వెనక్కి జరిగాయని సోషల్ మీడియాలో అభిమానులు అనుమానం వ్యక్తం చేశారు.

థర్డ్ అంపైర్ క్షుణ్ణంగా పరిశీలించకుండానే, స్పష్టమైన ఆధారం లేకుండానే నమన్  ఔటైనట్లు ప్రకటించడంపై కేఎల్ రాహుల్ కూడా అసంతృప్తి వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది. కొందరు అభిమానులు మాత్రం ‘నమన్ ధీర్ ఔట్ విషయంలో కివీస్ తొండి చేసింది. బౌండరీ రోప్‌ను వెనక్కి జరిపి  మరీ సీఫెర్ట్ క్యాచ్ తీసుకున్నాడు’.. ‘దేవుడు మనవైపే ఉన్నాడు.. మా శాపం ఫలించింది.. అందుకే వర్షం వచ్చినా విజయం మనల్నే వరించింది’ అని కామెంట్లు పెట్టారు.

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన కివీస్‌.. 41 ఓవర్లలో కేవలం 134 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్ల దెబ్బకు టాపార్డర్‌ కుదేలు కాగా.. నాలుగో స్థానంలో వచ్చిన డారిల్‌ మిచెల్‌ అర్ధ శతకం (104 బంతుల్లో 55)తో జట్టును ఆదుకున్నాడు. అతడికి తోడుగా కెప్టెన్‌ మిచెల్‌ సాంట్నర్‌ 31 పరుగులతో రాణించాడు.

టీమిండియా బౌలర్లలో గుర్నూర్‌ బ్రార్‌ నాలుగు వికెట్లతో చెలరేగగా.. ఆకిబ్‌ నబీ, అన్షుల్‌ కాంబోజ్‌, అక్షర్‌ పటేల్‌ తలా రెండు వికెట్లు కూల్చారు. అనంతరం టీమిండియా 26 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 113 పరుగుల వద్ద ఉన్న వేళ వర్షం ఆటకు అంతరాయం కలిగించింది.

భారత్‌ విజయానికి 22 పరుగులు అవసరమైన వేళ వాన మొదలైంది. అప్పటికే డక్‌వర్త్ లూయిస్‌ పద్ధతి ప్రకారం టీమిండియా నిర్ణీత లక్ష్యం (109) కంటే నాలుగు పరుగులు ముందంజలో ఉండడంతో విజయం సాధించినట్లు అంపైర్లు ప్రకటించారు. శ్రేయస్ అయ్యర్ (30), కేఎల్ రాహుల్ (26 నాటౌట్‌) రాణించారు. ఇరుజట్ల మధ్య మూడో వన్డే మంగళవారం జరగనుంది.

 

ఇదీ చదవండి: 'చేజింగ్ అంత సులువు కాదు.. అతడి వల్లే విజయం'

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement