Photo Credit: Twitter
వెల్లింగ్టన్ వేదికగా జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్‌పై డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో 4 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత్ 2-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మ్యాచ్ ముగిసిన అనంతరం పోస్ట్ ప్రజంటేషన్ కార్యక్రమంలో టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ మాట్లాడాడు. మ్యాచ్ ఏ పరిస్థితుల్లో ముగిసినా, చివరికి విజయం ఎవరికి దక్కిందన్నది అత్యంత ముఖ్యమైన విషయమని స్పష్టం చేశాడు.
గిల్ మాట్లాడుతూ.. "వెల్లింగ్టన్ పిచ్‌పై ఛేజింగ్ అంత సులువు కాదు. న్యూజిలాండ్‌ను 134 పరుగులకే ఆలౌట్ చేసిన తర్వాత ఈ లక్ష్యాన్ని సులువుగానే ఛేదించవచ్చని భావించాము. కానీ అంచనాలకు భిన్నంగా మా బ్యాటింగ్ సాగింది. దీంతో ఇక్కడి పిచ్‌పై బ్యాటింగ్ చేయడం అంత సులభం కాదని అర్థమైపోయింది. అయినప్పటికీ జట్టు విజయం సాధించడం కాస్త సంతోషాన్ని ఇచ్చింది.
ఈ మ్యాచ్‌లో మా బౌలర్లందరూ మంచి ప్రదర్శన కనబరిచారు. ముఖ్యంగా గుర్నూర్ బ్రార్ అంచనాలకు అనుగుణంగా రాణిస్తున్నాడు. తొలి వన్డేలో కూడా మంచి బౌలింగ్ ప్రదర్శించిన గుర్నూర్.. రెండో వన్డేలో కెరీర్ బెస్ట్ ఫిగర్స్ నమోదు చేశాడు. మంచి లైన్ అండ్ లెంగ్త్‌తో బంతులు వేస్తున్న గుర్నూర్ ఇలాగే స్థిరత్వాన్ని ప్రదర్శిస్తే మ్యాచ్‌లు ఆడుతున్న కొద్ది మరింత అనుభవాన్ని గడిస్తాడనిపిస్తుంది.
అతడు తన అద్భుత ప్రదర్శనతో విజయానికి కారణమయ్యాడు. కోచ్ గౌతమ్ గంభీర్ యువ బౌలర్లకు ఇచ్చిన సందేశాన్ని ఇక్కడ ప్రస్తావించాలనుకుంటున్నా. ప్రస్తుతం భారత జట్టుకు కావాల్సిన నైపుణ్యాలన్నీ ప్రస్తుత జట్టులో ఉన్న యువ బౌలర్లలో ఉన్నాయి. బ్యాటింగ్‌లో మెరుగవ్వాల్సిన అవసరముంది.
మా ఇన్నింగ్స్ సమయంలో వర్షం వస్తుందని ఊహించాం. ఒకవేళ ఈ మ్యాచ్‌ను డీఆర్‌ఎస్ పద్దతిలో నాలుగు లేదా ఐదు పరుగుల తేడాతో ఓడిపోయుంటే, మాకు ఘోర ఓటమి కిందే లెక్క. ఈ పిచ్‌పై ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేయాలంటే ప్రారంభంలోనే వికెట్లు తీయడం ఒక్కటే మార్గం. మన బౌలర్లు ప్రతి స్పెల్‌లోనూ పట్టుదలతో బౌలింగ్ చేస్తూ వికెట్లు పడగొట్టడం నాకు సంతోషాన్ని ఇచ్చింది." అని చెప్పుకొచ్చాడు.
ఇదీ చదవండి: ‘ప్రయోగాలు ఆపండి.. ఆ స్థానంలో అతడు అన్‌ఫిట్’


