IND vs NZ: ఉత్కంఠ పోరు.. కివీస్‌ను చిత్తు చేసిన టీమిండియా | IND vs NZ 2nd ODI 2026: India Beat New Zealand In Thriller | Sakshi
Sakshi News home page

IND vs NZ: రెండో వన్డేలో న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన టీమిండియా

Nov 7 2026 3:36 PM | Updated on Nov 7 2026 3:49 PM

IND vs NZ 2nd ODI 2026: India Beat New Zealand In Thriller

శ్రేయస్‌ అయ్యర్‌ (PC: BCCI X)

న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో టీమిండియా జోరు కొనసాగిస్తోంది. వెల్లింగ్‌టన్‌ వేదికగా ఉత్కంఠగా సాగిన లో స్కోరింగ్‌ మ్యాచ్‌లో భారత్‌ గెలుపొందింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో నిలిచింది. హెన్రీ స్టేడియంలో శనివారం వర్షం అంతరాయం వల్ల టాస్‌ ఆలస్యమైంది. దీంతో మ్యాచ్‌ను 47 ఓవర్లకు కుదించగా.. టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.

134 పరుగులకే
ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌.. 41 ఓవర్లలో కేవలం 134 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్ల దెబ్బకు టాపార్డర్‌ కుదేలు కాగా.. నాలుగో స్థానంలో వచ్చిన డారిల్‌ మిచెల్‌ అర్ధ శతకం (104 బంతుల్లో 55)తో జట్టును ఆదుకున్నాడు. అతడికి తోడుగా కెప్టెన్‌ మిచెల్‌ సాంట్నర్‌ 31 పరుగులతో రాణించాడు.

ఫలితంగా న్యూజిలాండ్‌ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. టీమిండియా బౌలర్లలో గుర్నూర్‌ బ్రార్‌ నాలుగు వికెట్లతో చెలరేగగా.. ఆకిబ్‌ నబీ, అన్షుల్‌ కాంబోజ్‌, అక్షర్‌ పటేల్‌ తలా రెండు వికెట్లు కూల్చారు. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ ఆరంభంలో తడబడింది.

గిల్‌, కోహ్లి విఫలమైనా
ఓపెనర్‌, కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ వన్డే కెరీర్‌లో తొలిసారి గోల్డెన్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. జేకబ్‌ డఫీ బౌలింగ్‌లో ఎదుర్కొన్న తొలి బంతికే నికోల్స్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. ఇక వన్‌డౌన్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి ఏడు పరుగులకే నిష్క్రమించాడు.

రాణించిన శ్రేయస్‌
ఇలాంటి తరుణంలో మరో ఓపెనర్‌ రోహిత్‌ శర్మ, వైస్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌, ​‍కేఎల్‌ రాహుల్‌ కాస్త ఓపికగా ఆడారు. అయితే, రోహిత్‌ 28 బంతుల్లో 23 పరుగులు చేసి కైలీ జెమీషన్‌​ బౌలింగ్‌లో అవుటయ్యాడు. శ్రేయస్‌ 46 బంతులు ఎదుర్కొని నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 30 పరుగులు చేశాడు.

 

రోహిత్‌- శ్రేయస్‌ కలిసి మూడో వికెట్‌కు 30 బంతుల్లో 22 పరుగులు జోడించగా.. రాహుల్‌- శ్రేయస్‌ ఈ మ్యాచ్‌లో అత్యధికంగా 39 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. మిగిలిన వారిలో స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్లు అక్షర్‌ పటేల్‌ (7), నమన్‌ ధీర్‌ (12) నిరాశపరచగా.. అన్షుల్‌ ఒక్క పరుగు చేసి అవుటయ్యాడు. 

113 పరుగుల వద్ద ఉన్న వేళ
ఇలాంటి తరుణంలో టీమిండియా 26 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 113 పరుగుల వద్ద ఉన్న వేళ వర్షం ఆటకు అంతరాయం కలిగించింది. భారత్‌ విజయానికి 22 పరుగులు అవసరమైన వేళ వాన మొదలైంది. అప్పటికి కేఎల్‌ రాహుల్‌ 26, ఆకిబ్‌ నబీ ఒక పరుగుతో ఉన్నారు.

డీఎల్‌ఎస్‌ పద్ధతి ప్రకారం
అయితే, అప్పటికే డీఎల్‌ఎస్‌ పద్ధతి ప్రకారం టీమిండియా నిర్ణీత లక్ష్యం (109) కంటే నాలుగు పరుగులు ముందంజలో నిలిచింది. ఈ క్రమంలో కాస్త వర్షం తెరిపినివ్వగా భారత్‌ లక్ష్యాన్ని 37 ఓవర్లలో 133 పరుగులుగా నిర్దేశించారు. ఆ తర్వాత మళ్లీ జల్లులు కురిశాయి. దీంతో మ్యాచ్‌ కొనసాగే పరిస్థితి లేకపోవడంతో డీఎల్‌ఎస్‌ పద్ధతి ప్రకారం టీమిండియా నాలుగు పరుగుల తేడాతో గెలుపొందినట్లు ప్రకటన వెలువడింది.

ఇవీ చదవండి: IND VS NZ 2nd ODI: విరాట్‌ కోహ్లి వరల్డ్‌ రికార్డు
IND vs NZ: నిప్పులు చెరిగిన భారత బౌలర్లు.. న్యూజిలాండ్‌ చెత్త రికార్డు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement