న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఫలితంగా ఆతిథ్య కివీస్ జట్టు కేవలం 134 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ క్రమంలో భారత్‌తో మ్యాచ్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా తేలిపోయి.. చెత్త రికార్డు మూటగట్టుకుంది.
ఆది నుంచే భారత పేసర్లు నిప్పులు చెరుగుతూ
ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా వెల్లింగ్‌టన్ వేదికగా రెండో వన్డేకు వర్షం అంతరాయం కలిగిచింది. దీంతో టాస్ ఆలస్యం కాగా.. మ్యాచ్‌ను 47 ఓవర్లకు కుదించారు. హెన్రీ స్టేడియంలో టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా కివీస్ బ్యాటింగ్‌కు దిగింది.
అయితే, ఆది నుంచే భారత పేసర్లు నిప్పులు చెరుగుతూ కివీస్ టాపార్డర్‌ను కకావికలం చేశారు. ఓపెనర్లలో టిమ్ సీఫర్ట్‌ను డకౌట్ చేసిన ఆకిబ్ నబీ.. విల్ యంగ్‌ను ఆరు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌కు పంపాడు. ఇక వన్‌డౌన్ బ్యాటర్ హెన్రీ నికోల్స్‌ను అన్షుల్ కాంబోజ్ బౌల్డ్ చేశాడు.
డారిల్ మిచెల్ ఫిఫ్టీ
టామ్ లాథమ్ (7), గ్లెన్ ఫిలిప్స్ (0), కెప్టెన్ మిచెల్ సాంట్నర్ (31), నాథన్ స్మిత్ (3)లను అవుట్ చేసి గుర్నూర్ బ్రార్ సత్తా చాటాడు. ఇక శుబ్‌మన్ గిల్ క్యాచ్ వదిలేయడంతో లైఫ్ పొందిన అర్ధ శతక వీరుడు డారిల్ మిచెల్ (55)ను అవుట్ చేసిన అక్షర్ పటేల్.. కైలీ జెమీషన్ (7) వికెట్‌ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఆఖర్లో పదో వికెట్‌గా బ్లెయిర్ టిక్నర్ (2)ను అన్షుల్ వెనక్కి పంపాడు.
కివీస్‌తో రెండో వన్డేలో ఆకిబ్ నబీ, అన్షుల్ కాంబోజ్, అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లు తీయగా.. గుర్నూర్ నాలుగు వికెట్లతో చెలరేగాడు. అయితే, అర్ష్‌దీప్ సింగ్ పొదుపుగా బౌలింగ్ చేసినప్పటికీ వికెట్ తీయలేకపోయాడు. ఏడు ఓవర్ల బౌలింగ్‌లో అర్ష్ కేవలం 16 పరుగులే ఇచ్చాడు.
ఇక భారత బౌలర్ల ధాటికి 134 పరుగులకే కుప్పకూలిన సాంట్నర్ బృందం చెత్త రికార్డు నమోదు చేసింది. సొంతగడ్డపై భారత్‌తో వన్డేల్లో తొలిసారి అత్యల్ప స్కోరుకు అవుటైన న్యూజిలాండ్ జట్టుగా నిలిచింది.
సొంతగడ్డపై భారత్‌తో వన్డేల్లో న్యూజిలాండ్‌కు అత్యల్ప స్కోర్లు ఇవే
👉2026లో వెల్లింగ్‌టన్ వేదికగా 134 ఆలౌట్
👉1994లో ఆక్లాండ్ వేదికగా 142 ఆలౌట్ (ఏడు వికెట్ల తేడాతో ఓటమి)
👉2019లో నేపియర్ వేదికగా 157 ఆలౌట్ (ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమి)
👉2003లో వెల్లింగ్‌టన్ వేదికగా 168 ఆలౌట్ (రెండు వికెట్ల తేడాతో ఓటమి)
👉2026లో ఆక్లాండ్ వేదికగా 185 ఆలౌట్ (ఐదు వికెట్ల తేడాతో ఓటమి).
ఇవీ చదవండి: IND vs NZ: భారత జట్టుకు భారీ షాక్!
IND vs NZ: ‘అదరగొడుతున్నాడు.. వన్డే వరల్డ్‌కప్ జట్టులో అతడికి చోటు ఖాయం’


