PC: BCCI
న్యూజిలాండ్- ‘ఎ’ జట్టుతో మూడో అనధికారిక టెస్టుకు భారత యువ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి దూరమయ్యాడు. అనారోగ్యం కారణంగా మ్యాచ్‌కు అందుబాటులో లేకుండా పోయాడు. కాగా టీమిండియా, భారత్- ‘ఎ’ జట్లు ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే.
ఐదు టీ20ల సిరీస్‌ను 3-2తో కైవసం చేసుకున్న టీమిండియా.. ప్రస్తుతం వన్డే సిరీస్‌తో బిజీగా ఉంది. తదుపరి కివీస్‌తో రెండు టెస్టులు ఆడాల్సి ఉంది. మరోవైపు.. ఈ సిరీస్ సన్నాహకాల్లో భాగంగా న్యూజిలాండ్- భారత్ ‘ఎ’ జట్లు మూడు మ్యాచ్‌ల అనధికారిక టెస్టు సిరీస్ ఆడుతున్నాయి.
వైరల్ ఫీవర్ వల్లనే
ఇప్పటికి రెండు టెస్టులు పూర్తి కాగా.. రెండూ ‘డ్రా’గానే ముగిశాయి. ఇక శనివారం మూడో అనధికారిక టెస్టు మొదలైంది. ఇదిలా ఉంటే.. ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో నితీశ్ రెడ్డిని తొలి వన్డేకు మాత్రమే ఎంపిక చేసిన సెలక్టర్లు.. కివీస్-‘ఎ’తో మూడో అనధికారిక టెస్టుకు అందుబాటులో ఉండేలా చూసుకున్నారు.
టెస్టు సిరీస్‌కు ముందు మ్యాచ్ ప్రాక్టీస్ కోసం నితీశ్‌ను ఈ మ్యాచ్‌కు ఎంపిక చేశారు. అయితే, ఈ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కివీస్-‘ఎ’తో మూడో అనధికారిక టెస్టు తుదిజట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. ఈ విషయం గురించి అతడి మేనేజర్ ‘క్రెక్స్’తో మాట్లాడుతూ.. వైరల్ ఫీవర్ కారణంగానే జట్టుకు దూరమైనట్లు తెలిపాడు.
వర్షం వల్ల ఆటంకం
టెస్టు జట్టులో కీలకమైన నితీశ్ రెడ్డి గనుక త్వరగా కోలుకోకపోతే.. కివీస్‌తో సిరీస్‌కు ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లే!!.. కాగా నవంబరు 19- 30 మధ్య టీమిండియా- న్యూజిలాండ్ మధ్య రెండు టెస్టుల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.
ఇదిలా ఉంటే.. భారత్- న్యూజిలాండ్ ‘ఎ’ జట్ల మధ్య మూడో అనధికారిక టెస్టుకు వర్షం వల్ల ఆటంకం కలిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కివీస్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. తొలి రోజు ఆట ముగిసేసరికి భారత జట్టు రెండు వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది.
న్యూజిలాండ్ ‘ఎ’తో మూడో అనధికారిక టెస్టుకు భారత తుదిజట్టు
యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్ (కెప్టెన్, వికెట్ కీపర్), తిలక్ వర్మ, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ కృష్ణ, జస్‌ప్రీత్ బుమ్రా, ముకేశ్ కుమార్, ముకేశ్ చౌదరి.
ఇవీ చదవండి: Asia Cup: సెహ్వాగ్ ధనాధన్, లక్ష్య మెరుపులు.. బోణీ కొట్టిన భారత్
కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ.. అధికారిక ప్రకటన


