సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2026-27లో తొలి రెండు మ్యాచ్‌లకు 17 మంది సభ్యులతో కూడిన తమ జట్టును బిహార్ క్రికెట్ అసోసియేషన్ శుక్రవారం ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్‌గా టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఎంపికయ్యాడు. అతడి డిప్యూటీగా సూరజ్ కశ్యప్‌ను నియమించారు.
గత సీజన్‌లో సకీబుల్ గని నాయకత్వంలో బరిలోకి దిగిన బిహార్ జట్టు తీవ్ర నిరాశపరిచింది. గ్రూప్-బి పాయింట్ల పట్టికలో ఒకే ఒక్క గెలుపు, ఆరు ఓటములతో ఆఖరి స్థానంలో నిలిచింది. ఈ క్రమంలోనే గనీపై వేటు వేసి వైభవ్‌కు జట్టు పగ్గాలను కట్టబెట్టారు. కేవలం 15 ఏళ్ల వయస్సులోనే ఒక రాష్ట్ర స్ధాయి జట్టుకు కెప్టెన్‌గా ఎంపికై వైభవ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు.
సూర్యవంశీ సారథ్యంలోని బీహార్ జట్టు ఇండోర్ వేదికగా నవంబర్ 14న సౌరాష్ట్రతో తమ తొలి మ్యాచ్‌ను ఆడనుంది. ఆ తర్వాత నవంబర్ 16న రైల్వేస్‌తో రెండో మ్యాచ్ ఆడనుంది. అయితే, ఈ రెండు మ్యాచ్‌లు పూర్తయిన తర్వాత వైభవ్ సూర్యవంశీ బీహార్ జట్టును వీడి ఖతార్ వేదికగా జరగనున్న '2026 మెన్స్ రైజింగ్ స్టార్స్ ఆసియా కప్' టోర్నీ కోసం ఇండియా 'ఎ' జట్టులో చేరనున్నాడు.
తొలి రెండు మ్యాచ్‌లకు బీహార్ జట్టు: వైభవ్ సూర్యవంశీ (కెప్టెన్), సూరజ్ కశ్యప్ (వైస్ కెప్టెన్), అలోక్ కుమార్, ఆయుష్ లోహరుకా (వికెట్ కీపర్), అల్తమష్ అష్రఫ్, పరమ్ కుమార్ సింగ్, అన్మోల్ కుమార్ (వికెట్ కీపర్), రిత్విక్ రాజ్, మయాంక్ కుమార్, రాఘవేంద్ర ప్రతాప్, ఆశిష్ కుమార్, వాసుదేవ్ ప్రతాప్ సింగ్, మహమ్మద్ ఇజార్, అమోద్ యాదవ్, ప్రశాంత్ సింగ్, నవాజ్ ఖాన్, హిమాన్షు సింగ్.


