అభిషేక్‌, వైభవ్‌లకు అన్యాయం చేస్తున్నారు: యువీ | Not doing justice to their talent: Yuvraj Singh On Abhishek Vaibhav ODI Chances | Sakshi
Sakshi News home page

అభిషేక్‌, వైభవ్‌లకు అన్యాయం చేసినట్లే అవుతుంది: యువీ

Oct 31 2026 11:03 AM | Updated on Oct 31 2026 11:22 AM

Not doing justice to their talent: Yuvraj Singh On Abhishek Vaibhav ODI Chances

అభిషేక్‌- వైభవ్‌ (PC: BCCI X)

భారత టీ20 జట్టులో ఓపెనర్‌గా పాతుకుపోయాడు అభిషేక్‌ శర్మ. తన విధ్వంసకర ఆట తీరుతో ఇప్పటికే ఎన్నో రికార్డులు సాధించిన ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌.. న్యూజిలాండ్‌తో తాజా టీ20 సిరీస్‌లో సత్తా చాటి మరోసారి ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరాడు.

2267 పరుగులు 
ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు తరఫున రాణించి.. 2024లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన అభిషేక్‌ శర్మ.. ఇప్పటికి 71 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు. అత్యధికంగా నాలుగు శతకాలు, 14 హాఫ్‌ సెంచరీలతో అదరగొట్టి 2267 పరుగులు సాధించాడు. ఈ పార్ట్‌టైమ్‌ స్పిన్నర్‌ ఖాతాలో పన్నెండు వికెట్లు కూడా ఉన్నాయి.

వన్డేల్లో మాత్రం నో ఛాన్స్‌
అయితే, పవర్‌ హిట్టర్‌ అభిషేక్‌ శర్మకు ఇప్పటి వరకు వన్డేల్లో మాత్రం ఆడే అవకాశం రాలేదు. దిగ్గజ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ- ప్రస్తుత సారథి శుబ్‌మన్‌ గిల్‌ వన్డేల్లో ఓపెనింగ్‌ జోడీగా కొనసాగుతున్నారు. బ్యాకప్‌ ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌ పోటీలో ఉన్నారు.

టీ20లలో వైభవ్‌ ధనాధన్‌
ఇదిలా ఉంటే.. టీమిండియా చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ సైతం టీ20లలో అదరగొడుతున్నాడు. ఇప్పటికి పది మ్యాచ్‌లు ఆడిన ఈ లెఫ్టాండర్‌ ఓపెనర్‌ 295 పరుగులు సాధించాడు. ఇక అభిషేక్‌, వైభవ్‌ల కంటే సీనియర్‌ ఇషాన్‌ కిషన్‌.. గతంలో క్రమశిక్షణారాహిత్యం వల్ల జట్టులో చోటు కోల్పోయాడు.

పడిలేచిన కెరటం ఇషాన్‌ కిషన్‌
అయితే, దేశీ క్రికెట్‌లో తనను తాను నిరూపించుకుని ఏకంగా టీ20 ప్రపంచకప్‌-2026 జట్టులో చోటు దక్కించుకున్నాడు. టీమిండియా టైటిల్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించి.. ప్రస్తుతం టీ20 జట్టులో కీలకంగా మారాడు. వన్డే జట్టులోనూ చోటు దక్కించుకుంటున్నాడు ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌.

చివరగా ఇంగ్లండ్‌ పర్యటనలో భాగంగా వన్డేల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన ఇషాన్‌ కిషన్‌.. స్వదేశంలో వెస్టిండీస్‌తో సిరీస్‌లో మాత్రం ఆడలేదు. అయితే, న్యూజిలాండ్‌తో తాజా వన్డే సిరీస్‌కు అతడు ఎంపికయ్యాడు.

అభిషేక్‌, వైభవ్‌లకు అన్యాయం చేసినట్లే
ఈ పరిణామాల నేపథ్యంలో టీమిండియా దిగ్గజ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. PTIతో మాట్లాడుతూ.. ‘‘అభిషేక్‌ శర్మను వన్డే జట్టులో చూడాలనుకుంటున్నాను. అభిషేక్‌, వైభవ్‌ సూర్యవంశీ, ఇషాన్‌ కిషన్‌ వంటి వాళ్లను యాభై ఓవర్ల క్రికెట్‌ జట్టుకు ఎంపిక చేయకపోతే.. వాళ్ల ప్రతిభకు అన్యాయం చేసినట్లే.

అయితే, వన్డే జట్టులో కొంతమంది గొప్ప ఆటగాళ్లు ఉన్నారని నాకూ తెలుసు. కాబట్టి అభిషేక్‌, వైభవ్‌ వంటి వాళ్లకు చోటివ్వడం.. ఇషాన్‌ను ఆడించడం కాస్త కష్టమేనని అర్థం చేసుకోగలను. ప్రసుతం ఈ యువ బ్యాటర్లు అద్భుతంగా ఆడుతున్నారు. అలాంటి వాళ్లకు తప్పక వన్డేల్లోనూ చోటివ్వాలి.

త్వరలోనే అభిషేక్‌ వన్డే జట్టులోకి వస్తాడని అనుకుంటున్నా. అభిషేక్‌ ఇప్పటి వరకు ఏదైనా తన కష్టం, కఠిన శ్రమతో సాధించుకున్నాడు. క్రెడిట్‌ మొత్తం అతడికి మాత్రమే దక్కుతుంది’’ అని యువరాజ్‌ సింగ్‌ పేర్కొన్నాడు. కాగా అభిషేక్‌ మెంటార్‌ యువీ అన్న సంగతి తెలిసిందే. ఈ పంజాబీ బ్యాటర్‌ను పవర్‌ హిట్టర్‌గా తీర్చిదిద్దిన ఘనత యువీదే అంటారు అభిమానులు.

ఇవీ చదవండి: ఆస్ట్రేలియా ఓపెన‌ర్ విధ్వంసం.. 9 బంతుల్లోనే హాఫ్ సెంచ‌రీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement