వాళ్లకు జాగ్రత్తగా బౌలింగ్‌ చేయాలి.. లేదంటే అంతే: కివీస్‌ కెప్టెన్‌ | Have to bowl well against Them: Santner Comments After Win On Team India | Sakshi
Sakshi News home page

వాళ్లకు జాగ్రత్తగా బౌలింగ్‌ చేయాలి.. లేదంటే అంతే: కివీస్‌ కెప్టెన్‌

Oct 30 2026 6:29 PM | Updated on Oct 30 2026 6:44 PM

Have to bowl well against Them: Santner Comments After Win On Team India

కివీస్‌ జట్టు (PC: BLACKCAPS X)

టీమిండియాతో నాలుగో టీ20లో విజయంపై న్యూజిలాండ్‌ కెప్టెన్‌ మిచెల్‌ సాంట్నర్‌ స్పందించాడు. సమిష్టి ప్రదర్శన కారణంగానే తమకు విజయం సాధ్యమైందన్నాడు. కాగా సొంతగడ్డపై కివీస్‌ జట్టు భారత్‌తో ఐదు టీ20ల సిరీస్‌ ఆడుతున్న సంగతి తెలిసిందే.

ఆరంభంలో తడబడ్డా
ఇందులో భాగంగా మొదటి టీ20లు గెలిచిన టీమిండియా ఇప్పటికే సిరీస్‌ను కైవసం చేసుకుంది. అయితే, ఇరుజట్ల మధ్య శుక్రవారం నాటి నాలుగో టీ20లో మాత్రం న్యూజిలాండ్‌ ఆధిపత్యం కనబరిచింది. ఆక్లాండ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన కివీస్‌.. ఆరంభంలో తడబడ్డా అద్భుత రీతిలో పుంజుకుంది.

శతక్కొట్టిన గ్లెన్‌, బ్రేస్‌వెల్‌ మెరుపులు
గత మ్యాచ్‌లో విఫలమైన గ్లెన్‌ ఫిలిప్స్‌ ఈసారి మాత్రం దుమ్ములేపాడు. విధ్వంసకర శతకం (49 బంతుల్లో 107)తో విరుచుకుపడి భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు. అతడికి తోడుగా మైకేల్‌ బ్రేస్‌వెల్‌ మెరుపు హాఫ్‌ సెంచరీ (25 బంతుల్లో 65)తో ఆకట్టుకున్నాడు. ఫలితంగా కివీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 259 పరుగులు సాధించింది.

172 పరుగులకే పరిమితం చేసి
అనంతరం కివీస్‌ బౌలర్లు గొప్పగా రాణించి.. టీమిండియాను 172 పరుగులకే పరిమితం చేశారు. జేకబ్‌ డఫీ నాలుగు వికెట్లతో సత్తా చాటి భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌ను దెబ్బకొట్టాడు. ఈ నేపథ్యంలో విజయానంతరం మిచెల్‌ సాంట్నర్‌ జట్టు ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశాడు.

ఈ మేరకు.. ‘‘మేము మరోసారి టాస్‌ ఓడిపోయాము. అయితే, పరిస్థితిని బట్టి రాత్రి మంచు పెద్దగా ప్రభావం చూపదని అర్ధమైపోయింది. ఇక్కడ 260 పరుగుల టార్గెట్‌ కచ్చితంగా మంచి స్కోరే. అయితే, టీమిండియా ఆటగాళ్లను తక్కువగా అంచనా వేయకూడదు.

వాళ్లకు జాగ్రత్తగా బౌలింగ్‌ చేయాలి
పవర్‌ హిట్టర్లను కట్టడి చేయాలంటే గొప్పగా బౌలింగ్‌ చేయాల్సి ఉంటుంది. ఈరోజు మేము ఆ పని చేసి చూపించాము. పవర్‌ప్లేలోనే వికెట్లు కూల్చడం ద్వారా మా బౌలర్లు మ్యాచ్‌ను మావైపు తిప్పే ప్రయత్నం చేశారు.

మంచి లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో బౌలింగ్‌ చేసి భారత బ్యాటర్లను కట్టడి చేశారు. గ్లెన్‌ అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడు. అయితే, బీస్ట్‌ (బ్రేస్‌వెల్‌) కూడా సూపర్‌గా బ్యాటింగ్‌ చేసి వేగంగా పరుగులు రాబట్టాడు. ఈ గ్రౌండ్‌ ఆటగాళ్లకు కఠిన సవాలు విసురుతుంది.

అయినా సరే మా బ్యాటర్లు, బౌలర్లు అద్భుతంగా రాణించారు. కానీ ఫీల్డింగ్‌లో చాలా తప్పిదాలే చేశాము. క్యాచ్‌లు డ్రాప్‌ చేశాము. ఏదేమైనా సమిష్టి ప్రదర్శనతో విజయం సాధించాము’’ అని మిచెల్‌ సాంట్నర్‌ హర్షం వ్యక్తం చేశాడు. 

ఈ మ్యాచ్‌లో సాంట్నర్‌ నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి 24 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు కూల్చాడు. అక్షర్‌ పటేల్‌ (7), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (21) వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక భారత్‌- కివీస్‌ మధ్య ఆదివారం నాటి ఐదో టీ20కి హామిల్టన్‌ వేదిక.

చదవండి: IND vs NZ 4th T20I: చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement