టీమిండియా (PC: BCCI X)
న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో టీమిండియా జైత్రయాత్రకు బ్రేక్ పడింది. హ్యాట్రిక్ విజయాలతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత జట్టు.. నాలుగో టీ20లో మాత్రం పేలవ ప్రదర్శనతో డీలా పడింది.
ఆతిథ్య కివీస్ చేతిలో ఏకంగా 87 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. క్రైస్ట్‌చర్చ్ వేదికగా మొదటి, రెండో టీ20లో నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందిన శ్రేయస్ సేన.. వెల్లింగ్‌టన్‌లో మూడో టీ20లో ఆరు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.
259 పరుగులు
ఈ క్రమంలో క్లీన్‌స్వీప్ లక్ష్యంగా ముందుకు సాగిన టీమిండియాకు నాలుగో టీ20లో కివీస్ బ్రేక్ వేసింది. ఆక్లాండ్‌లో శుక్రవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి ఏకంగా 259 పరుగులు సాధించింది.
గ్లెన్ ఫిలిప్స్ ఆకాశమే హద్దుగా
టాపార్డర్‌లో ఓపెనర్ టిమ్ సీఫర్ట్ (3) మరోసారి విఫలం కాగా.. ఫిన్ అలెన్ 17 బంతుల్లో 31 పరుగులు రాబట్టాడు. వన్‌డౌన్‌లో వచ్చిన డారిల్ మిచెల్ మెరుపు (9 బంతుల్లో 24) ఇన్నింగ్స్ ఆడాడు. ఇక గ్లెన్ ఫిలిప్స్ ఆకాశమే హద్దుగా చెలరేగి శతక్కొట్టాడు.
మొత్తంగా 49 బంతుల్లో ఆరు ఫోర్లు, పది సిక్సర్లు బాదిన గ్లెన్.. 107 పరుగులు సాధించాడు. మిగిలిన వారిలో మైకేల్ బ్రేస్‌వెల్ ధనాధన్ దంచికొట్టి హాఫ్ సెంచరీ (25 బంతుల్లో 65) బాదాడు. భారత బౌలర్లలో మయాంక్ యాదవ్ మూడు వికెట్లు తీయగా.. అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
ఆది నుంచే తడ‘బ్యా’టు
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్ ఆది నుంచే తడబడింది. ఓపెనర్లలో సంజూ శాంసన్ (4) పూర్తిగా విఫలం కాగా.. అభిషేక్ శర్మ (15 బంతుల్లో 27) ఫర్వాలేదనిపించాడు. వన్‌డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ డకౌట్ కాగా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (11 బంతుల్లో 22) వేగంగా ఆడే క్రమంలో ఆడం మిల్నే బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు.
అక్షర్ పటేల్ 7 పరుగులకే పరిమితం కాగా.. మరో ఆల్‌రౌండర్ నమన్ ధీర్ మరోసారి మెరుపులు మెరిపించాడు. పదమూడు బంతుల్లోనే రెండు సిక్సర్లు, రెండు ఫోర్లు బాది 28 పరుగులు చేశాడు. అయితే, జేకబ్ డఫీ బౌలింగ్‌లో నమన్ బంతిని గాల్లోకి లేపగా.. నాథన్ స్మిత్ అద్భుత రీతిలో క్యాచ్ పట్టాడు.
తిలక్ వర్మ (35 బంతుల్లో 35) కాసేపు పోరాడినా అప్పటికే పరిస్థితి చేజారిపోయింది. తిలక్ తొమ్మిదో వికెట్‌గా వెనుదిరగగా.. ఆఖర్లో ప్రిన్స్ యాదవ్ 17 బంతుల్లో 18, మయాంక్ యాదవ్ 4 బంతుల్లో 3 పరుగులతో అజేయంగా నిలిచారు.
India get another lifeline as Fisher puts down a sitter! 😬 Watch the HERO VIDA India Tour of New Zealand, 4th T20I, LIVE NOW on Sony Sports Network TV channels, Sony LIV & Sony Vizha. #SonySportsNetwork #SonyLIV #SonyVizha #NZvIND https://t.co/K0AUxvV0wy
— Sony Sports Network (@SonySportsNetwk) October 30, 2026
న్యూజిలాండ్ బౌలర్లలో జేకబ్ డఫీ నాలుగు వికెట్లతో చెలరేగి.. భారత బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. మాథ్యూ ఫిషర్, కెప్టెన్ మిచెల్ సాంట్నర్ చెరో రెండు వికెట్లు తీయగా.. ఆడం మిల్నే ఒక వికెట్ దక్కించుకున్నాడు. టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 172 పరుగులకే పరిమితమైంది.


