హాంగ్‌కాంగ్ సిక్సెస్-2026 టోర్నీని ఇండియా సిక్సెస్ జట్టు ఓటమితో ఆరంభించింది. శుక్రవారం మోంగ్ కాక్‌లోని మిషన్ రోడ్ గ్రౌండ్ వేదికగా పాకిస్తాన్ సిక్సెస్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో టీమిండియా పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ అబ్బాస్ అఫ్రిది భారత్‌ను తొలుత బ్యాటింగ్‌కు అహ్హనించాడు.
ఈ క్రమంలో మొదటి బ్యాటింగ్‌కు దిగిన కృనాల్ పాండ్యా బృందం 6 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేయగలిగింది. భారత బ్యాటర్లలో శశాంక్ సింగ్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 11 బంతుల్లో 5 సిక్సర్లు, 2 ఫోర్లతో 40 పరుగులు చేశాడు.
అయితే ఓపెనర్లు నితీష్ రాణా(14 బంతుల్లో 19), రాహుల్ త్రిపాఠీ(5 బంతుల్లో 9) తీవ్ర నిరాశపరిచారు. కెప్టెన్ కృనాల్ పాండ్యా సైతం డకౌటయ్యాడు. పాక్ బౌలర్లలో అబ్దుల్ సమద్ రెండు, అహ్మద్ దనియల్,షెహాజాద్ తలా వికెట్ తీశారు.
అనంతరం 89 పరుగుల లక్ష్యాన్ని పాకిస్తాన్ సిక్సెస్ కేవలం 3.5 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. పాక్ ఇన్నింగ్స్ మొదటి ఓవర్ వేసిన భారత కెప్టెన్ కృనాల్ పాండ్యా బౌలింగ్‌ను ప్రత్యర్థి కెప్టెన్ అబ్బాస్ అఫ్రిది ఆటాడుకున్నాడు.
వరుసగా 5 సిక్సర్లు బాదడంతో ఆ ఓవర్‌లోనే ఏకంగా 31 పరుగులు వచ్చాయి. అబ్బాస్ అఫ్రిది 8 బంతుల్లో 35 పరుగులు సాధించి ఔటయ్యాడు. అతడితో పాటు మరో ఓపెనర్ ఖవాజా నాఫే కేవలం 12 బంతుల్లో 5 సిక్సర్లు, 2 ఫోర్లతో 41 పరుగులు చేశాడు.
భారత బౌలర్లలో శశాంక్ సింగ్, తెవాటియా తలా వికెట్ సాధించారు. స్టార్ పేసర్ టి. నటరాజన్ సైతం దారుణంగా విఫలమయ్యాడు. కేవలం ఒక్క ఓవర్ మాత్రమే బౌలింగ్ చేసిన నటరాజన్ ఏకంగా 28 పరుగులు సమర్పించుకున్నాడు. భారత్ తమ తదుపరి మ్యాచ్‌లో శనివారం (అక్టోబర్ 31) యూఏఈ సిక్సెస్‌తో తలపడనుంది.


