Photo Credit: Twitter
హాంకాంగ్ సిక్సెస్ 2026 టోర్నీలో స్కాట్లాండ్ జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. గ్రూప్-బిలో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్ 26 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ 6 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 144 పరుగుల భారీ స్కోరు చేసింది.
ఓపెనర్ మైకెల్ లీస్క్ (15 బంతుల్లో 70 నాటౌట్; 2 ఫోర్లు, 10 సిక్సర్లు) లంక బౌలర్లను ఊచకోత కోయగా, ఫిన్లే మెక్‌క్రీత్ (7 బంతుల్లో 26), జాస్పర్ డేవిడ్‌సన్ (6 బంతుల్లో 22) రాణించారు. లంక బౌలర్లలో ముదిత లక్షణ్ రెండు వికెట్లు తీయగా, రవిందు ఫెర్నాండో, సచితా జయతిలకే చెరో వికెట్ పడగొట్టారు.
అనంతరం లంక జట్టు నిర్ణీత 6 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసి ఓటమిపాలయ్యింది. విషెన్ హలంబగే (12 బంతుల్లో 30), సచితా జయతిలకే (9 బంతుల్లో 28 నాటౌట్), ముదితా లక్షన్ (5 బంతుల్లో 28 నాటౌట్) ఆఖరిదాకా క్రీజులో నిలిచినప్పటికీ, జట్టును గెలిపించలేకపోయాడు.
కెప్టెన్ సంగీత్ కూరే (9 బంతుల్లో 22) పర్వాలేదనిపించాడు. స్కాట్లాండ్ బౌలర్లలో జాస్పర్ డేవిడ్‌సన్ మూడు వికెట్లతో చెలరేగాడు. లంకపై విజయంతో స్కాట్లాండ్ గ్రూప్-బిలో టాప్ స్థానానికి చేరుకుంది.
ఒమన్‌పై ఆఫ్గన్ విజయం
మరో మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ 4 వికెట్ల తేడాతో ఒమన్‌పై విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఒమన్ జట్టు 6 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. ఉస్మాన్ అలీ అఫ్రిది (17 బంతుల్లో 71 నాటౌట్; 1 ఫోర్, 10 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడగా, సమి హసన్ (7 బంతుల్లో 21) రాణించాడు.
ఆఫ్గన్ బౌలర్లలో గుల్బదిన్ నైబ్, కరీమ్ జనత్‌లు చెరో వికెట్ తీశారు. అనంతరం అఫ్గానిస్తాన్ 5.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. సేదికుల్లా పచా (10 బంతుల్లో 45 నాటౌట్), ఫర్మానుల్లా సఫీ (11 బంతుల్లో 37 నాటౌట్) జట్టును గెలిపించారు.
ఇదీ చదవండి: జైస్వాల్ డకౌట్.. మరోసారి మెరిసిన పడిక్కల్


