మనీషా పసిడి పట్టు | Gold for Manisha Bhanwala at the World Senior Womens Wrestling Championship | Sakshi
Sakshi News home page

మనీషా పసిడి పట్టు

Oct 31 2026 12:45 AM | Updated on Oct 31 2026 12:45 AM

Gold for Manisha Bhanwala at the World Senior Womens Wrestling Championship

ప్రపంచ సీనియర్‌ మహిళల రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం 

ఈ ఘనత సాధించిన భారత తొలి మహిళా రెజ్లర్‌గా రికార్డు 

అస్తానా: సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ప్రతిష్టాత్మక ప్రపంచ మహిళల రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు తొలి పసిడి పతకం దక్కింది. కజకిస్తాన్‌ వేదికగా జరుగుతున్న ఈ మెగా టోర్నీ మహిళల ఫ్రీస్టయిల్‌ విభాగంలో మనీషా భన్వాలా (59 కేజీలు) స్వర్ణం కైవసం చేసుకుంది. శుక్రవారం జరిగిన ఫైనల్లో 29 ఏళ్ల మనీషా 8–6 పాయింట్ల తేడాతో పాన్‌ అమెరికా చాంపియన్‌ అబిగైల్‌ ఎలిజబెత్‌ (అమెరికా)పై విజయం సాధించింది. 

తద్వారా వరల్డ్‌ సీనియర్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకం గెలిచిన తొలి భారత రెజ్లర్‌గా మనీషా చరిత్ర సృష్టించింది. వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో అన్షుమాలిక్‌ (2021; 57 కేజీలు), కాజల్‌ ధోచక్‌ (2026; 76 కేజీలు), నీలమ్‌ సిరోహి (2026; 50 కేజీలు)  ఫైనల్‌కు చేరి రజతాలు దక్కించుకోగా... ఇప్పుడు తొలి పసిడి భారత్‌ వశమైంది. పురుషుల విభాగంలో 2010లో సుశీల్‌ కుమార్‌ (66 కేజీలు) భారత్‌ తరఫున ఏకైక స్వర్ణం నెగ్గాడు. 

0–6 నుంచి కోలుకొని... 
తుదిపోరులో ఒక దశలో ఆరు పాయింట్లు వెనుకబడి ఉన్న మనీషా ఆ తర్వాత పట్టు వదలని పోరాటంతో విజృంభించింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగి విజయం సాధించింది. నైపుణ్యానికి అతిపెద్ద పరీక్షలా సాగిన తుదిపోరులో మనీషా కట్టిపడేసింది. తొలి రౌండ్‌లో అమెరికా రెజ్లర్‌ పూర్తి దూకుడు కనబర్చగా... మనీషా రక్షణాత్మక ధోరణికి పరిమితమై సమయం కోసం వేచిచూసింది. మనీషాను మ్యాట్‌ నుంచి బయటకు నెట్టిన అబిగైల్‌ నాలుగు పాయింట్లు ఖాతాలో వేసుకుంది. 

అదే ఊపులో మరో రెండు పాయింట్లు సాధించిన అమెరికా మల్లయోధురాలు ఒక దశలో 6–0తో సంపూర్ణ ఆధిపత్యం కనబర్చింది. అయితే రెండో రౌండ్‌లో తన వ్యూహాలకు పదును పెట్టిన మనీషా ఉడుంపట్టుతో కట్టిపడేసింది. వరుస పాయింట్లతో ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇవ్వకుండా ముందుకు సాగింది. కెరీర్‌లో అత్యంత కీలకమైన పోరులో ఎలాంటి ఉదాసీనతకు చోటు ఇవ్వని మనీషా... ఎందరో దిగ్గజ రెజ్లర్‌లకు సాధ్యంకాని ఘనతను ఖాతాలో వేసుకొని మహిళల విభాగంలో భారత్‌ నుంచి తొలి ప్రపంచ చాంపియన్‌గా రికార్డుల్లోకెక్కింది.  

ఒకేసారి నాలుగు పతకాలు.. 
హర్యానాలోని రోహ్‌టక్‌కు చెందిన మనీషా ఎట్టకేలకు 15 ఏళ్ల భారత నిరీక్షణకు తెరదింపిందని... గత రెండు మూడేళ్లుగా ఆమె పడ్డ కష్టానికి ఇది ప్రతిఫలమని కోచ్‌ వీరేంద్ర దహియా అన్నారు. ఒక ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ముగ్గురు భారత మహిళా రెజ్లర్లు ఫైనల్‌కు చేరడం ఇదేతొలిసారి. తాజా వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో మనీషాతో పాటు ఫైనల్‌ చేరిన కాజల్, నీలమ్‌ రజతాలు సాధించగా... తనూ శర్మ కాంస్యం నెగ్గింది. అంతకుముందు బబిత కుమారి (2012లో), వినేశ్‌ ఫొగాట్‌ (2019, 2022లో), అంతిమ్‌ పంఘాల్‌ (2025లో), గీతా ఫొగాట్‌ (2012లో), పూజా ధండా (2018లో), అల్కా తోమర్‌ (2006లో), సరితా మోర్‌ (2021లో), మాన్సి అహ్లావత్‌ (2024లో) వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాలు సాధించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement