జెన్ జీ ఉద్యమాల దారెటు? | The reasons for the youth taking to the streets in discontent are not the same across Europe | Sakshi
Sakshi News home page

జెన్ జీ ఉద్యమాల దారెటు?

Oct 30 2026 3:49 AM | Updated on Oct 30 2026 3:49 AM

The reasons for the youth taking to the streets in discontent are not the same across Europe

ఐరోపా వ్యాప్తంగా యువత నాయకత్వంలో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిరసనలు, అల్లర్లు, విధ్వంసాలు– ఇది ప్రస్తుతం పతాక శీర్షికలో ఉన్న వార్త. భారత్‌లో కూడా ఇటువంటి వాతావర ణమే ఉంది. మొత్తం మీద ప్రపంచ రాజ కీయ వ్యవస్థల దృష్టంతా యువత మీదకు మరలక తప్పలేదనేది నిర్వివాదాంశం. గత రెండు నెలల్లో ఫ్రాన్స్, స్పెయిన్, పోర్చుగల్, బెల్జియం, ఇటలీ, అల్బేనియా, జర్మనీ, ఆస్ట్రియాలలో యువత నిరసనలు ఆకాశాన్నంటుతున్నాయి. సెర్బియాలో యువత సూచించిన అభ్యర్థులు ప్రజాస్వామ్యయుతంగా ప్రభుత్వాన్ని కూల గొట్టటం యూరప్‌ని నివ్వెరపరిచింది. యువత అసంతృప్తితో రోడ్డెక్కటానికి కారణాలు యూరప్‌ అంతటా ఒకే రకంగా లేవు. వీధి ఉద్యమాల స్వభావం, నైజాలలో కూడా వ్యత్యాసాలున్నాయి. 

కారణాలు అనేకం
పాఠశాలల స్థితిగతులు, ఉపాధ్యాయుల కొరత వంటి అంశా లలో తీవ్ర అసంతృప్తి ఫ్రాన్స్‌ యువతను నిరసనలకు ప్రేరేపించింది. స్పెయిన్ లో ఆకాశాన్నంటుతున్న ఇంటి అద్దెలు, పోర్చుగల్‌లో పెరిగే ఇంటి అద్దెలతో బాటుగా తరుగుతున్న వేతనాలూ కారణాలు. బెల్జియంలో ప్రభుత్వం పొదుపు చర్యలలో భాగంగా విద్యార్థుల ట్యూషన్  ఫీజులను 835 యూరోల నుండి 1,200 యూరోలకుపెంచటంతో విద్యార్థులు రోడ్డెక్కారు. ఆస్ట్రియాలో యూనివర్సిటీ లకు ప్రభుత్వ నిధులలో ఒక బిలియన్  డాలర్ల కోత ఆగ్రహానికి కారణమయింది.

అల్బేనియా, జర్మనీలలో యువత నిరసనలకు కారణాలు వేరుగా ఉన్నాయి. అల్బేనియాలో ప్రభుత్వ అవినీతి ఉద్యమ జ్వాలలను రేపింది. సెర్బియాలో రైల్వేస్టేషన్  ప్లాట్‌ఫారమ్‌ కూలి ఇరవై ఐదు మందికి పైగా మృతి చెందటంతో యువత ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. జర్మనీలో యువత ఆగ్రహానికి ఆర్థిక, విద్యారంగ సమస్యలు కారణం కాదు. అవసరమైతే, పద్దెని మిదేళ్లు నిండిన యువకులందరూ తప్పనిసరిగా సైన్యంలో పని చేయాలనే కొత్త చట్టాన్ని జర్మనీ ప్రభుత్వం జనవరి 2026లో తీసుకురావటంతో విద్యార్థి లోకంలో అసంతృప్తికి బీజం పడింది.

స్థూలంగా పరిశీలిస్తే, ఐరోపాలో యువత నిరసనలకు మూడు కారణాలు కన్పిస్తాయి. 1. హార్మూజ్‌ జలసంధి దిగ్బంధనం, ఉక్రెయిన్  యుద్ధం వలన చమురు గ్యాస్‌ ధరలు పెరిగి ద్రవ్యోల్బణం పెరగటం. 2. ట్రంప్‌ ఒత్తిడి వలన రక్షణ బడ్జెట్‌ పెంచక తప్పని పరిస్థితి ఏర్పడటంతో పొదుపు చర్యలలో భాగంగా విద్యారంగం, సంక్షేమ రంగాలలో నిధులకు కోత పెట్టటం. 3. హౌసింగ్‌ సమస్యలు, ప్రభుత్వాల అవినీతి.

వామపక్షాల ఎగదోత?
ఫ్రాన్స్‌లో ప్రస్తుత అధ్యక్షుడు మెక్రాన్  పట్ల తీవ్ర వ్యతిరేకత ఉన్నది. ఫ్రాన్స్‌లోని వామపక్ష, రాడికల్‌ పక్షాలు ఎల్లో వెస్ట్‌ గ్రూప్, విద్యార్థులకు మద్దతు పలకటంతో ఉద్యమం ఉగ్రరూపం దాల్చింది. ఉద్యమంలో హింస, లూటీలు, విధ్వంసానికి వామపక్ష, రాడికల్‌ పక్షాలు కారణమని ప్రభుత్వం నిందిస్తున్నది. రైట్‌వింగ్‌ రిసెంబుల్‌ మెంట్‌ నేషనల్‌ పార్టీ కూడా విద్యార్థులకు మద్దతు ప్రకటించినప్ప టికీ, హింసను ఖండించి శాంతిభద్రతల చర్యలను సమర్థిస్తున్నది. ఇటలీలో రైట్‌వింగ్‌ మెలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న యువత నిరసనలను ప్రతిపక్ష పార్టీలు, ట్రేడ్‌ యూనియన్‌లు దగ్గ రుండి నడిపిస్తున్నాయి. 

మెలోని ప్రభుత్వం నిరసనల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నది. జర్మనీ, బెల్జియంలలో కూడా వామపక్ష పార్టీలు యువత అసంతృప్తిని ఒక అవకాశంగా వాడుకుంటున్నాయి. టిక్‌ టాక్, ఇన్‌స్టాగ్రామ్, డిస్కార్డ్, టెలిగ్రామ్, వాట్సాప్‌ వంటి సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లను జనసమీకరణకు, నిరసనల డిజైనింగ్‌కు వినియోగిస్తున్నారు. అక్టోబర్‌ 25న సెర్బియాలో జరిగిన ఎన్నికల ఫలితాలు యువత (జెన్ జీ) ఉద్యమాలకు మంచి ఊపునిస్తాయి. విద్యార్థి ఉద్యమం నిలబెట్టిన స్టూడెంట్‌ లిస్ట్‌ అభ్యర్థులు మెజార్టీ సీట్లను గెల్చుకున్నారు. 2024లో రైల్వే ఫ్లాట్‌ఫారమ్‌ దుర్ఘటనతో ప్రారంభమైన ఉద్యమం రెండేళ్లలో బలీయమైన వూచిచ్‌ ప్రభు త్వాన్ని కూలదోయటం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది.

అయితే సెర్బియాలో ఉద్యమానికీ, ఇతర దేశాలలో ఉద్యమా లకూ వ్యత్యాసాన్ని గమనించాలి. సెర్బియాలో ప్రభుత్వ అవినీతి, చైనాతో ఒప్పందాలపై వ్యతిరేకత ఆధారంగా ఉద్యమం నడిచింది. ఈ ఉద్యమంలో కాలేజీ, యూనివర్సిటీ విద్యార్థులు ప్రధాన పాత్ర పోషించారు. విద్యార్థి నాయకులెవరూ రాజకీయ రంగు పులుము కోలేదు. స్టూడెంట్‌ లిస్ట్‌ పేరుతో పార్లమెంట్‌లోని సీట్లకు నిలబడే అభ్యర్థులను కాలేజీ కమిటీలు, యూనివర్సిటీ కమిటీ సమావేశా లలో చర్చలు, సమావేశాల అనంతరం నిర్ణయించారు. 

సమాజంలోని వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు, మేధావులు, వివాద రహితులను అభ్యర్థులుగా నిలబెట్టారు. విద్యార్థి నాయకులు నిల బడలేదు, ప్రతిపక్షాలతో చేతులు కలపలేదు. ఉద్యమ నిబద్ధత ఏ స్థాయిలో ఉందంటే, ప్రతిపక్షాలు తమ అభ్యర్థులను ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. ఈ ఉద్యమంలో అధ్యాపకులు, ప్రొఫెసర్లు కీలకపాత్ర పోషించారు. ఎన్నికల వేళ ఉద్యమం కేవలం ప్రభు త్వాన్ని వ్యతిరేకించటమే కాకుండా ప్రత్యామ్నాయ అజెండా, మేని ఫెస్టోతో ప్రజల ముందుకు వచ్చింది.

భారత్‌ నిరసనలపై ప్రభావం
భారత్‌లో కూడా సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లను విరివిగా వినియోగిస్తూ యువతను ఆకర్షించే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఉద్యమ అజెండాతో యువత, విద్యార్థులు ప్రేరేపితమయినప్పుడే ఉద్యమం విజయవంతం అవుతుంది. నీట్‌ పరీక్ష నిర్వహణలో జరిగిన అవకతవకల అజెండాతో ప్రారంభమై నప్పుడు ఉద్యమంలో స్పష్టత కనపడింది. విద్యార్థులు, యువత కూడా చెప్పుకోదగిన స్థాయిలో స్పందించారు. తరువాత దశలో ఉద్యమం చీఫ్‌ ఎలక్షన్  కమిషనర్‌ రాజీనామా డిమాండ్‌కు మారటంతో అజెండాలో స్పష్టత లోపించింది. ఈ అంశంలో రెండు విష యాలను గమనించాలి. ఇదే అంశాన్ని ప్రధాన ప్రతిపక్షం ఇప్పటికే ఓట్‌చోరీ, ఈవీఎంల పేర్లతో రాజకీయ ఆయుధంగా వాడుకుంటున్న సంగతి మొదటిది. 

రెండవది, ఈ అంశానికి, యువత విద్యా ర్థుల సమస్యలకు సంబంధం లేదు. పాఠశాలలు, కాలేజీలు, యూని వర్సిటీల విద్యార్థులు, అధ్యాపకులు, సమాజంలోని నిరుద్యోగ యువత ప్రతిస్పందించే సమస్యలు, ప్రభుత్వ తప్పిదాలు, పాలనా విధానాలు, వైఫల్యాలను అజెండాగా చేసుకుంటే తప్ప జెన్‌ జీ ఉద్య మానికి విస్తృత మద్దతు లభించే అవకాశాలు తక్కువ. వామపక్ష పార్టీలు, ప్రధాన ప్రతిపక్షంతో కలిసి రాజకీయ అంశాల ఆధారంగా ఉద్యమం కొనసాగితే సామాన్య ప్రజానీకం దానిని వారి వారి రాజకీయ భావజాలం, రాజకీయ మొగ్గు పరంగానే చూస్తారు.

సెర్బియాలో ఉద్యమానికీ, ఇతర దేశాలలో ఉద్యమాలకూ వ్యత్యాసాన్ని గమనించాలి. విద్యార్థుల ఉద్యమ నిబద్ధత ఏ స్థాయిలో ఉందంటే, ప్రతిపక్షాలు తమ అభ్యర్థులను ఉపసంహరించుకోవాల్సి వచ్చింది.


- వ్యాసకర్త అడిషనల్‌ రిజిస్ట్రార్‌ (రిటైర్డ్‌); సివిల్స్, గ్రూప్‌–1 పోటీ పరీక్షల నిపుణులు
- గురజాల శ్రీనివాసరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement