సోమదేవుని అమృత సందేశాలు | Sakshi Guest Column On President of Brazil Lula da Silva | Sakshi
Sakshi News home page

సోమదేవుని అమృత సందేశాలు

Oct 28 2026 12:36 AM | Updated on Oct 28 2026 12:36 AM

Sakshi Guest Column On President of Brazil Lula da Silva

మళ్లీ లూలా: బ్రెజిల్‌ అధ్యక్ష ఎన్నికల్లో తిరిగి గెలిచిన లూలా డ సిల్వా

సందర్భం

ఈ ఆదివారం అర్ధరాత్రి గడిచి సోమవారంలోకి ప్రవేశించిన తర్వాత 1.36 గంటలకు మొదటి వార్త: బ్రెజిల్‌ ఎన్నికలలో లూలా ఆధిక్యత. ఆ వెనుక 5.28కి రెండవ వార్త: సెర్బియా అధ్యక్షుడు అలెగ్జాండర్‌ వూచిచ్‌  తాను ఎన్నికలలో ఓడినట్లు అంగీకారం. 6.05 గంటలకు మూడవ వార్త: లూలా గెలిచినట్లు ఎన్నికల సంఘం ప్రకటన. ఇవి సోమదేవుని తొలి అమృత కిరణాలు. ప్రపంచం కొద్ది వారాలుగా నాలుగు కీలకమైన ఎన్నికల ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నది. అవి బ్రెజిల్, సెర్బియాలతో పాటు ఇజ్రాయెల్‌ పార్లమెంట్, అమెరికా మధ్యంతరం. వీటిలో, అమెరికన్‌ సెనేట్‌లో ప్రస్తుతం రిపబ్లికన్లకు గల ఆధిక్యతను నిలబెట్టుకోనట్లయితే అధ్యక్షుడు ట్రంప్‌ చాలా చిక్కులు ఎదుర్కొంటారు. 

ఇజ్రాయెల్‌లో నెతన్యాహూ తిరిగి ప్రధాని కాకపోయినా అమెరికా ప్రయోజనాలు యథాతథంగా కొనసాగుతాయిగానీ, నెతన్యాహూకు ట్రంప్‌ బహిరంగంగా మద్దతు ప్రకటించటం వివాదాస్పదంగా మారింది. ఇది, బ్రెజిల్‌లో ఫ్లావియో బోల్సొనారోకు, సెర్బియాలో వూచిచ్‌కు మద్దతు ప్రకటించటం వంటిది. ఈ ముగ్గురూ ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌ ఫొటోలను జత చేశారు. ఇజ్రాయెల్‌ ఎన్నికలు ఈ నెల 27న జరిగి ఫలితాలు నవంబర్‌ 4న వెలువడతాయి. అమెరికా మధ్యంతరం తేదీ నవంబర్‌ 3. ఆ రెండు ఫలితాల మధ్య కొన్ని గంటల తేడా. బ్రెజిల్, సెర్బియా ఫలితాలు సృష్టించిన ‘సోమదేవుని అమృత’ వాతావరణంలో ప్రపంచం ఈ రెండు ఫలితాల కోసం ఆశావహంగా చూస్తుంది. 

ఓడినా గెలిచినా మారేదేమిటి?
ఇజ్రాయెల్‌లో నెతన్యాహూ తిరిగి ప్రధాని అయినా, కాక పోయినా తేడా ఉండదు. గాజా మారణకాండ, వెస్ట్‌ బ్యాంక్‌ ఆక్ర మణ, గ్రేటర్‌ ఇజ్రాయెల్‌ లక్ష్యం, స్వతంత్ర పాలస్తీనా విషయాలలో తనకు, ప్రతిపక్ష కూటమికి మధ్య ఆవగింజంత తేడా అయినా లేదు. కాకపోతే, ఇప్పటికే 19 ఏళ్లపాటు పాలించిన తన అధికారాన్ని పొడిగించుకునేందుకు ప్రజలలో మితవాదాన్ని పెంచే ఉద్దేశంతో ఆయన పాలస్తీనా పట్ల, ఇరాన్‌ పట్ల ఇంత తీవ్రంగా వ్యవహరిస్తున్నారు. యావత్‌ ప్రపంచం విమర్శిస్తున్నా గాజాలో మారణకాండను సాగిస్తూ, వెస్ట్‌ బ్యాంక్‌లో సెటిల్‌మెంట్లు పెంచటం, సిరియా, లెబనాన్‌లపై దాడుల వంటివి చేస్తున్నారు. 

అంతర్జాతీయ న్యాయ స్థానం, అంతర్జాతీయ నేర న్యాయస్థానం తనను దోషిగా ప్రకటించగా, ఆ న్యాయమూర్తులనే బెదిరించటం, వారిపై అమెరికా ద్వారా ఆంక్షలు ప్రకటింపచేయటం వంటివి చేసేందుకు సైతం వెరవటం లేదు. ఈ ధోరణి ఎంతవరకు పోయిందంటే, గతంలో తమను బలపరిచిన యూరోపియన్‌ దేశాలు ఇటీవల స్వతంత్ర పాలస్తీనాను గుర్తిస్తుండటంతో వారిపై ఎదురుదాడులు జరుపుతున్నారు. ప్రస్తుత ఎన్నికలకు ముందు ఆయన చివరి ప్రకటన, ఇజ్రాయెల్‌ ఆర్థికంగా ఏకాకి కావచ్చుననీ, అందుకు ప్రజలు సిద్ధపడాలనీ.

మరొకవైపు నెతన్యాహూ తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ, వాటి నుంచి కాపాడుకునేందుకు కూడా తిరిగి ప్రధాని కావాలన్న ఒత్తిడిలో ఉన్నారు. ఇంత జరుగుతున్నా ట్రంప్‌ ఆయనను బలపరచటమే గాక, అవినీతి కేసుల నుంచి క్షమాభిక్ష ప్రసాదించ వలసిందిగా ఇజ్రాయెల్‌ అధ్యక్షుడిని కోరారు. నెతన్యాహూ తిరిగి ప్రధాని కాలేకపోతే ఇటువంటి విషయాలలో తేడా రావచ్చుగానీ, పైన చెప్పుకున్నట్లు ఎవరి ప్రభుత్వం ఏర్పడినా విధానాలలో మార్పుండదు. అయితే, నెతన్యాహూ ఇంతగా బలపరుస్తున్నందున ట్రంప్‌కు నైతికంగా, ప్రతిష్ఠ రీత్యా ఎదురుదెబ్బ అవుతుందన్నది గమనించదగ్గ విషయం. ఒకవేళ మధ్యంతరం కూడా పోతే అక్టోబర్‌ 26 నుంచి 10 రోజులలో 4 పరాజయాలవుతాయి.

మద్దతుదారులూ మద్దతివ్వక...
అమెరికా సెనేట్‌ స్థానాలు 100లో ప్రస్తుతం రిపబ్లికన్లవి 53 కాగా, డెమోక్రాట్లవి 47. ఎన్నికలు జరుగుతున్నది 35కు. ఇందులో 7 చోట్ల హోరాహోరీ పోటీ ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. ట్రంప్‌ పట్ల జనాదరణ కొన్ని మాసాలుగా తగ్గుతున్నట్లు ప్రతి ఒక్క సర్వే చూపుతూ వస్తున్నది. దానితో ఇటీవల కొన్ని ఎన్నికలలో ఓడారు కూడా. అందుకే డెమోక్రాట్లతో పాటు, బయటి నుంచి వచ్చి ఓటర్లుగా మారిన వారిపై ఆగ్రహం చూపుతున్నారు.

ట్రంప్‌ తిరిగి అధ్యక్షుడు కావటానికి ఉపయోగపడినవి ఆయన ‘మేక్‌ అమెరికా గ్రేట్‌ అగైన్‌’ (మాగా) నినాదం, ‘అమెరికా ఫస్ట్‌’ అని ప్రకటించటం, ఇతర దేశాలకు తరలిపోయిన అమెరికన్‌ కంపెనీలను తిరిగి రప్పించటం, వలసదారులను పంపివేసి స్థానికులకు ఉపాధి కల్పన, ధరలపై నియంత్రణ వంటివని తెలిసిందే. ఈ నినాదాలతో ప్రభావితమైన సాధారణ ప్రజలను ‘మాగా కానిస్టిట్యూయెన్సీ’ అని పిలిచారు. కానీ, కాలం గడిచినకొద్దీ ఇవన్నీ అరకొరగా తప్ప నెర వేరటం లేదు. అది చాలదన్నట్లు, యుద్ధాలను ఆపివేస్తానని, కొత్త యుద్ధాలు చేయబోనని ఇచ్చిన హామీకి విరుద్ధంగా వ్యవహరిస్తుండటంతో బిలియన్ల కొద్దీ డాలర్లు వృథా కావటమే గాక, చమురు ధరలు, ఇతర ధరలు పెరుగుతుండటం ఈ ‘మాగా’ వర్గాలను కూడా క్రమంగా దూరం చేస్తున్నది.

ప్రపంచానికి కొత్త ఊపు
మొత్తంమీద ఈ నాలుగు ఎన్నికల ప్రభావాలు ఆయా దేశాల పైనే గాక ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు రూపాలలో ఉండనున్నాయి. మొదట బ్రెజిల్‌ విషయం చూస్తే, వామపక్షాలు, మితవాద పార్టీల మధ్య రంగుల రాట్నం వలె తిరిగే అక్కడి దేశాలలో ట్రంప్‌ అధికారానికి వచ్చిన తర్వాత వరుసగా ఏడు దేశాలు మితవాదంవైపు మొగ్గాయి. అవిగాక వెనిజులాను ఇంచుమించు అధీనంలోకి తీసుకున్న ట్రంప్‌ క్యూబాపై దృష్టి పెట్టి, బ్రెజిల్‌పై ఆశలు పెంచు కున్నారు. బ్రెజిల్‌ వంటి చోట తన మనిషి వస్తే ఇక దక్షిణ అమెరికా అంతా రాజకీయంగా, ఆర్థికంగా స్వాధీనమైనట్లే. ఇపుడది భంగ పడగా, అక్కడి తక్కిన వామపక్షాలకు ఊపిరి తిరుగుతుంది. బ్రెజిల్‌ బ్రిక్స్‌లో కొనసాగుతుంది. డాలర్‌కు భిన్నంగా సృష్టించిన చెల్లింపుల వ్యవస్థ ‘పిక్స్‌’ నిలబడుతుంది. లూలా గెలుపు ప్రభావం ఇరాన్, గాజా, ఇజ్రాయెల్, రష్యా, చైనాలపై ఉంటుంది. 

సెర్బియా యథాతథంగా సాధారణ దేశమే అయినా, దేశ అధ్యక్ష పదవిని, ప్రధాని పదవిని కూడా చేజిక్కించుకుని పదేళ్లకు పైగా నియంత వలె పాలిస్తున్న నాయకుడు వూచిచ్‌. ఆయనకు ట్రంప్‌ మద్దతు పూర్తిగా ఉంది. కానీ అక్కడి విద్యార్థులు, యువతరం నిరుద్యోగ సమస్యతో, ప్రజలు ధరల పెరుగుదలతో రెండేళ్లుగా విరామమెరుగని ఉద్యమం సాగిస్తున్నారు. ఇప్పటి ఎన్ని కలలో ‘స్టూడెంట్‌ లిస్ట్‌ – స్టూడెంట్‌ విన్‌’ అనే కొత్త పార్టీ పెట్టి గెలిచారు. గత కొన్ని వారాలుగా యూరప్‌ అంతటా చెలరేగుతున్న విద్యార్థి యువజనులకు, ప్రజలకు ఇది పెద్ద ఊపునిస్తుందని వేరే చెప్ప నక్కర లేదు. బంగ్లాదేశ్, నేపాల్‌ తర్వాత ప్రస్తుతం భారత దేశంలో ఉద్యమిస్తున్న యువతీ యువకులకు కూడా!

టంకశాల అశోక్‌
వ్యాసకర్త సీనియర్‌ సంపాదకుడు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement