హమాస్ జరిపిన దాడి (అక్టోబర్ 7, 2023) తర్వాత ఇజ్రాయెల్‌లో తొలిసారిగా పార్లమెంటరీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నో సవాళ్ల మధ్య ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ రాజకీయ భవిష్యత్తుకు కీలకమైన ఎన్నికల సమరానికి సిద్ధమయ్యారు. ఇవాళ (అక్టోబర్ 27) జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఆయనకు మాజీ సైనికాధిపతి గదీ ఐసెన్‌కోట్, మాజీ ప్రధాని నఫ్తాలీ బెనెట్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమి నుంచి గట్టి సవాల్ ఎదురవుతోంది. నెతన్యాహూ మరోసారి అధికారాన్ని నిలబెట్టుకుంటారా? లేక ఇజ్రాయెల్ రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలవుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.
అయితే, ఎన్నికల ఫలితాలపై స్పష్టత రావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. పోలింగ్ ముగిసిన కొన్ని గంటల్లోనే విజేత ఎవరనే దానిపై తొలి అంచనాలు వెలువడే అవకాశం ఉంది. అయితే పరిస్థితులను బట్టి స్పష్టమైన ఫలితం రావడానికి కొన్ని రోజులు లేదా వారాలు కూడా పట్టవచ్చు. పోలింగ్ ముగియగానే ఇజ్రాయెల్ టీవీ ఛానళ్లు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ప్రసారం చేస్తాయి. దీంతో ఎన్నికల ఫలితాలపై తొలి అంచనాలు వెలువడతాయి. ఆ తర్వాత అసలు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది.
ఏదైనా పార్టీ, పార్టీల కూటమికి స్పష్టమైన మెజారిటీ వస్తే ఫలితాలపై త్వరగానే స్పష్టత రావచ్చు. అలా కాకపోతే ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతుంది. తుది ఓట్ల లెక్కింపు అక్టోబర్ 30 నాటికి పూర్తవుతుందని అంచనా. అధికారిక ఎన్నికల ఫలితాలను నవంబర్ 4న ప్రకటిస్తారు. ఇజ్రాయెల్ పార్లమెంటును ‘క్నెసెట్’ అని పిలుస్తారు. ఇందులో మొత్తం 120 స్థానాలు ఉంటాయి. మెజారిటీ కోసం 61 స్థానాలు అవసరం. సాధారణంగా ప్రతి నాలుగేళ్లకోసారి ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ, అక్కడ ముందస్తు ఎన్నికలు తరచూ జరుగుతుంటాయి.
ఇజ్రాయెల్‌లో దామాషా ప్రాతినిధ్య విధానంలో ఎన్నికలు నిర్వహిస్తారు. అంటే దేశవ్యాప్తంగా ఒక పార్టీకి వచ్చిన ఓట్ల శాతాన్ని బట్టి పార్లమెంటులో ఆ పార్టీకి సీట్లు కేటాయిస్తారు. మొత్తం ఓట్లలో కనీసం 3.25 శాతం సాధించిన పార్టీలకే పార్లమెంటులో ప్రాతినిధ్యం లభిస్తుంది. దాదాపు పన్నెండు పార్టీలు ఈ కనీస ఓట్ల శాతాన్ని దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయనే తుది లెక్క తేలడానికి సమయం పట్టవచ్చు.
తుది ఫలితాలు వెలువడిన తర్వాత ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ వివిధ పార్టీల నేతలతో సంప్రదింపులు జరుపుతారు. ఎవరు ప్రధానమంత్రి కావాలని వారు కోరుకుంటున్నారో తెలుసుకుంటారు. అనంతరం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఎక్కువగా ఉన్న నేతను ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేస్తారు. ఆ అభ్యర్థికి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు గరిష్ఠంగా 42 రోజుల సమయం ఉంటుంది. ఇజ్రాయెల్‌లో ఇప్పటివరకు ఏ ఒక్క పార్టీ కూడా సొంతంగా సంపూర్ణ మెజారిటీ సాధించలేదు. అందువల్ల అక్కడ సంకీర్ణ ప్రభుత్వాలే ఏర్పడుతున్నాయి.
ప్రభుత్వ ఏర్పాటుకు వివిధ పార్టీల మధ్య చర్చలు జరపాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియకు సాధారణంగా కొన్ని వారాల సమయం పడుతుంది. పార్లమెంటులో ప్రతి ఒక్క సీటు కీలకంగా మారుతుంది. ముఖ్యంగా తక్కువ స్థానాలు గెలుచుకున్న చిన్న పార్టీలు కూడా ఏ కూటమికి మద్దతు ఇవ్వాలనే నిర్ణయంతో ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించగలవు. ఇలాంటి పార్టీలను ‘కింగ్‌మేకర్’గా పిలుస్తారు.
ఎంపికైన అభ్యర్థి నిర్ణీత గడువులోగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతే, ఇతర నేతలకు కూడా అవకాశం లభించవచ్చు. అయినప్పటికీ ఏ నేతా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని పరిస్థితి ఎదురైతే మరోసారి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అప్పటివరకు ప్రస్తుత మంత్రివర్గమే తాత్కాలిక ప్రభుత్వంగా కొనసాగుతుంది.
ఇదీ చదవండి: ఇజ్రాయెల్ ఎన్నికల ముందు నెతన్యాహు చివరిగా చెప్పిందిదే..


