మొదటిసారిగా ఇంటర్నెట్‌లో పంపిన పదం ఏంటో తెలుసా? | International Internet Day History First Message | Sakshi
Sakshi News home page

మొదటిసారిగా ఇంటర్నెట్‌లో పంపిన పదం ఏంటో తెలుసా?

Oct 29 2026 11:42 AM | Updated on Oct 29 2026 1:01 PM

International Internet Day History First Message

నేడు ఇంటర్నేషనల్‌ ఇంటర్నెట్‌ డే

ఆధునిక కాలంలో ఆవిష్కృతమైన గొప్ప సాంకేతిక పరిజ్ఞానంగా ఇంటర్నెట్‌ను చెప్పవచ్చు. 1969లో ఎలక్ట్రానిక్‌ సందేశాన్ని పంపడానికి ఇంటర్నెట్‌ను మొదటిసారి వాడిన రోజును గుర్తుచేసుకుంటూ ‘అంతర్జాతీయ ఇంటర్నెట్‌ డే’ను 2005 నుండి జరుపుకొంటున్నారు.

1969లో ఇంటర్నెట్‌ను ఆర్పానెట్‌ (అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌ ప్రాజెక్ట్స్‌ ఏజెన్సీ నెట్వర్క్‌)గా పిలిచేవారు. లాస్‌ ఏంజెల్స్‌లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో విద్యార్థి ప్రోగ్రామర్‌గా ఉన్న చార్లీ క్లైన్‌ 1969 అక్టోబర్‌ 29న మొదటిసారిగా తమ విశ్వవిద్యాలయంలోని ఒక కంప్యూటర్‌ నుండి స్టాన్‌ఫోర్డ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఉన్న మరో కంప్యూటర్‌కు ఆంగ్లపదం ‘లాగిన్‌’ పంపే ప్రయత్నం చేశాడు. 

ముందుగా ‘ఎల్‌’ అక్షరాన్నీ, తరువాత ‘ఒ’ అక్షరాన్నీ విజయవంతంగా పంపాడు. మూడవ అక్షరం ‘జి’ని పంపే లోపు సిస్టం క్రాష్‌ అయ్యింది. తరువాత సాంకేతిక లోపాలను సవరించి మిగతా అక్షరాలను కూడా పంపగలిగారు. బ్రిటిష్‌ కంప్యూటర్‌ శాస్త్రవేత్త టిమ్‌ బెర్నర్స్‌ లీ 1989–90లో స్విట్జర్లాండ్‌లో చేసిన పరిశోధనల ఫలితంగా వరల్డ్‌ వైడ్‌ వెబ్‌ ఏర్పడింది. ఇది హైపర్‌ టెక్స్ట్‌ పత్రాలను సమాచార వ్యవస్థ లోకి అనుసంధానిస్తుంది. ఇవి నెట్‌వర్కులోని ఏ నోడ్‌కైనా అందుబాటులో ఉంటాయి.

1990ల మధ్య నుండి ఇంటర్నెట్‌ వాణిజ్యం పైన, సాంకేతిక పరిజ్ఞానంపైన విప్లవాత్మక ప్రభావాన్ని చూపింది. ఎలక్ట్రానిక్‌ మెయిల్, తక్షణ సందేశం, వాయిస్‌ ఓవర్‌ ఇంటర్నెట్‌ ప్రోటోకాల్, టెలిఫోన్‌ కాల్స్, వీడియో చాట్, వరల్డ్‌ వైడ్‌ వెబ్‌– దాని చర్చా వేదికలు, బ్లాగులు, సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సేవలు, ఆన్‌లైన్‌ షాపింగ్‌ సైట్‌లు వంటివి ఈ విప్లవంలో భాగం అయ్యాయి.

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 615 కోట్ల మంది ఇంటర్నెట్‌ను ఉపయో గిస్తున్నారు. ఇది ప్రపంచ జనాభాలో సుమారు 73.9 శాతం. ఇప్పటికీ ప్రపంచంలో దాదాపు 217 కోట్ల మందికి ఇంటర్నెట్‌ సదుపాయం లేదు. వీరిలో ఎక్కువ మంది దక్షిణాసియా, ఆఫ్రికా ఖండాల్లో ఉన్నారు. ప్రపంచంలో అత్యధిక ఇంటర్నెట్‌ వినియోగదారులు ఉన్న దేశాల జాబితాలో చైనా, భారతదేశం మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి.
– ఎం. రాం ప్రదీప్‌ ‘ జేవీవీ సభ్యుడు, తిరువూరు

ఇదీ చదవండి: భర్త ముఖాన్ని జల్లెడలో చూస్తారు.. ఈ పండుగ గురించి తెలుసా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement