పాఠ్యపుస్తకాల కోసం కోర్టుకెక్కిన విద్యావేత్త | Banda Sarojana Telugu Educationist Life Journey | Sakshi
Sakshi News home page

పాఠ్యపుస్తకాల కోసం కోర్టుకెక్కిన విద్యావేత్త

Oct 29 2026 11:51 AM | Updated on Oct 29 2026 1:01 PM

Banda Sarojana Telugu Educationist Life Journey

ప్రొ. బండ సరోజన

నివాళి

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం విద్యారంగంలో వివక్షతకు గురైందని ఉద్యమించి తెలంగాణను సాధించుకున్నాము. కానీ, ప్రత్యేక తెలంగాణ సిద్ధించిన నేపథ్యంలో పాఠ్య పుస్తకాలు, ముఖ్యంగా మాతృభాష బోధన పుస్తకాలు ఉంటా యనీ, అవి స్థానిక భాష, యాస, సంస్కృతిని ప్రతిబింబిస్తాయనీ ఆశించాం. కానీ, పాలకులు ఆదరబాదరగా, ఓ విధానమంటూ లేకుండా, మాతృభాషను నేర్చుకోవడానికి పాటించాల్సిన శాస్త్రీయ విధానాన్ని పట్టించుకోకుండా ప్రాథమిక స్థాయి తెలుగు పుస్తకాల్ని తయారు చేయించారు. 

నాటి పీవీ రంగారావు, దేవినేని వెంకట రమణ లాంటి విద్యాశాఖ మంత్రుల హయాంలో ఒంటిచేత్తో తెలుగు పాఠ్యపుస్తకాల్ని రచించిన ప్రొ‘‘ బండ సరోజన ఈ అస్తవ్యస్త పుస్తకాల్ని చూసి ఆవేదన చెందారు. భాషా వాచకాల తయారీకి ఉండే సోపానాలైన అక్షర, పద, వాక్య పద్ధతులకు భిన్నంగా... పిల్లల నిత్యజీవిత వాడుక పదాలను గుర్తించకుండా, ఆ వాడుక పదాల్ని వర్ణమాలతో అనుసంధానం చేస్తూ భాషా పుస్తకాల్ని తయారు చేయకపోవటంతో పిల్లలకు మాతృభాష కూడా భారంగా మారింది.

ఈ విషయాల్ని ఎత్తి చూపడం బాధ్యతగా భావించిన సరోజన విద్యాశాఖ దృష్టికి తీసుకెళ్లినా ప్రయో జనం లేకపోయింది. చివరికి విధిలేక పాఠ్య పుస్తకాల లోపాలను ఎత్తిచూపుతూ, పాఠ్యపుస్తక రచనకు పాటించాల్సిన విధివిధానాల్ని పొందు పరుస్తూ 2021 చివర్లో లోకాయుక్తలో కేసు వేసి రాష్ట్ర విద్యాశాఖను, ఎస్‌సీఈఆర్‌టీని పార్టీలుగా చేసి మూడు సంవత్సరాలు ఒంటరి పోరు చేయడం గమనార్హం.

చివరికి ఈ మూడు సంవత్సరాల కోర్టు అనుభవాల్ని, పుస్తకాల తయారీకి పాటించాల్సిన విధివిధానాల్ని, ప్రాధాన్యతలను, రచయితల స్థాయిని అనుభవాల్ని క్రోడీకరిస్తూ ‘వాచకాలు– మన వారసత్వ సంపద’ పేరున విలువైన పుస్తకాల్ని ప్రచురించి 30.3.2024న రవీంద్ర భారతిలో, విద్యాభిమానుల సమక్షంలో ఆవిష్క రించారామె. ఉమ్మడి రాష్ట్రంలో ఎ¯Œ టీఆర్‌ చేత, ఇతర విద్యాశాఖమాత్యుల చేత పుస్తక రచనలో శభాష్‌ అనిపించుకున్న సరోజన 1994లో 1, 2వ తరగతులకు రాసిన తెలుగు వాచకాలు 2008 దాకా కొనసాగడం గమనార్హం.

స్ఫూర్తినిచ్చే ప్రయాణం
సాధారణ కుటుంబంలో, ఆడపిల్లకు చదు వెందుకు అనే రోజుల్లో ఒకప్పటి జనగామ తాలూకాలోని లద్దనూర్‌ (రజాకార్ల గడ్డ) 1941లో జన్మించిన సరోజన ఎలిమెంటరీ టీచర్‌స్థాయి నుంచి ఉన్నత విద్యాశాఖ పరిశోధనా కేంద్రంలో ప్రొఫెసర్‌ స్థాయికి ఎదగడానికి సగటు మహిళ ఎదుర్కోవాల్సిన అడ్డంకుల్ని, అవమానాల్ని ఎదు ర్కొన్నారు. ఆమె విద్యావేత్తనే కాక, మంచి కథకురాలు, కవయిత్రి, ఆకాశవాణి ప్రవక్త. ‘సరోజం’ అనే శీర్షికన తన ఆత్మకథను 2020లో రాశారు. అందులో విద్యాశాఖలో ఉండే కులాల దొంతరలను, వివక్షతను, సాచివేత ధోరణిని ధైర్యంగా ప్రజల ముందర పెట్టారు.

అందరితో కలుపుగోలుగా ఉండే  సరోజన ఏ గ్రూపుకు దగ్గర కాకుండా అన్ని వర్గాలతో, రచయిత, రచయిత్రులతో కలసిమెలసి ఉండ టమే కాదు, తాను గుర్తించిన తప్పుల్ని నిర్మొహ మాటంగా చెప్పే నిజాయతిపరురాలు. 85 సంవ త్సరాల వయస్సులో అక్టోబర్‌ 22న తన కూతురు అపర్ణ దగ్గర అమెరికాలోని వర్జీనియాలో తుది శ్వాస విడవడం విద్యారంగానికి నష్టమే! తన దేహాన్ని వీడుతూ కూడా, తన శరీరాన్ని మెడికల్‌ సైన్స్ పరిశోధనకై అప్పగించేలా ముందు జాగ్రత్త పడటం అభినందనీయం.
– డా. గాండ్ల లచ్చయ్య, ‘రైట్‌ ఎడ్యుకేషన్‌ ఫర్‌ బెటర్‌ సొసైటీ’ అధ్యక్షులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement