ప్రజాస్వామ్య పరిరక్షణకు ఢిల్లీ మార్చ్‌కు రండి: రాహుల్ గాంధీ | Rahul Gandhi Calls For Chalo Delhi March On November 1 To Protect Democracy And The Constitution, Watch Video Goes Viral | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్య పరిరక్షణకు ఢిల్లీ మార్చ్‌కు రండి: రాహుల్ గాంధీ

Oct 29 2026 11:45 AM | Updated on Oct 29 2026 12:54 PM

Rahul Gandhi calls for Delhi march on 1st

న్యూఢిల్లీ: ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించాలనుకునే వారంతా నవంబర్ 1న ఢిల్లీలో నిర్వహించనున్న ‘చలో ఢిల్లీ రాంలీలా మార్చ్‌’లో పాల్గొనాలని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. ఓటు చోరీని అడ్డుకోవడం, ప్రజాస్వామ్యాన్ని కాపాడటం, రాజ్యాంగాన్ని పరిరక్షించడం ఈ మార్చ్‌ ప్రధాన ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. ఇది ఏ ఒక్క రాజకీయ పార్టీకి చెందిన కార్యక్రమం కాదని, దేశ ప్రజలందరికీ సంబంధించిన ఉద్యమమని పేర్కొన్నారు.

ఈ మేరకు గురువారం సామాజిక మాధ్యమం ఎక్స్‌లో విడుదల చేసిన వీడియో సందేశంలో రాహుల్ గాంధీ మాట్లాడారు. నరేంద్ర మోదీ, అమిత్ షా, జ్ఞానేశ్ కుమార్‌లపై అసంతృప్తితో ఉన్నవారు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుకునేవారు ఈ మార్చ్‌లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. దేశ రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు.

మార్చ్‌లో పాల్గొనేవారు పోలీసుల చర్యలకు, లాఠీచార్జికి భయపడాల్సిన అవసరం లేదని రాహుల్ గాంధీ అన్నారు. భయపడకుండా తమతో కలిసి నడవాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగాన్ని, భారతదేశాన్ని పరిరక్షించేందుకు అందరం కలిసికట్టుగా ముందుకు సాగుదామని పేర్కొన్నారు. ఇది దేశ ప్రజల మార్చ్‌ అని, ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములు కావాలని కోరారు.
 

 

 రాజకీయ అనుబంధాలతో సంబంధం లేకుండా విద్యార్థి సంఘాలు కూడా ఈ మార్చ్‌లో పాల్గొనాలని రాహుల్ గాంధీ విజ్ఞప్తి చేశారు. దేశంపై దాడి జరుగుతోందని, తమ భావ ప్రకటన స్వేచ్ఛ, ఆలోచనలు, అభిప్రాయాలు లక్ష్యంగా మారుతున్నాయని భావించే విద్యార్థులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దేశ ఆత్మను కాపాడే ఉద్యమంగా ఈ మార్చ్‌ను అభివర్ణించారు.

 

మరోవైపు, నవంబర్ 1న ఢిల్లీలోని రాంలీలా మైదానంలో నిర్వహించనున్న ఇండియా కూటమి ర్యాలీని భారీ స్థాయిలో నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇండియా కూటమి ఎంపీలతో సమావేశమవుతున్నారు. శుక్రవారం నిర్వహించనున్న మాక్ పార్లమెంట్‌లో ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌ను ప్రతీకాత్మకంగా అభిశంసించే కార్యక్రమాన్ని చేపట్టాలని వారు భావిస్తున్నారు. ఈ కార్యక్రమం అనంతరం నవంబర్ 1న రాంలీలా మైదానంలో ర్యాలీ నిర్వహించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement