ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ భార‌త స్టార్ అథ్లెట్‌! | 3-Times-Para-Asian Games-Gold-Medalist-Neeraj-Yadav-Demise-Own House | Sakshi
Sakshi News home page

ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ భార‌త స్టార్ అథ్లెట్‌!

Oct 28 2026 12:59 PM | Updated on Oct 28 2026 1:15 PM

3-Times-Para-Asian Games-Gold-Medalist-Neeraj-Yadav-Demise-Own House

Photo Credit: Twitter

మూడుసార్లు పారా ఆసియా గేమ్స్ స్వ‌ర్ణ ప‌త‌క విజేత‌, భార‌త స్టార్ అథ్లెట్ నీర‌జ్ యాద‌వ్ ఢిల్లీలోని త‌న నివాసంలో మంగళవారం రాత్రి ఆత్మ‌హత్యకు పాల్ప‌డ్డాడు. ఈ విషాద‌కర వార్త‌ను భార‌త పారా అథ్లెటిక్స్ కోచ్ ఎస్‌. స‌త్య‌నారాయ‌ణ బుధ‌వారం ఉద‌యం మీడియాకు ధ్రువీక‌రించారు. బుధవారం ఢిల్లీలోని జీటీబీ ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం అనంత‌రం నీర‌జ్ యాద‌వ్ భౌతికకాయాన్ని.. పారా ఒలింపియ‌న్‌ సుమిత్ అంటిల్, తోటి పారా అథ్లెట్ విపిన్ కసానాలు అత‌డి నివాసానికి త‌ర‌లించారు. 

నీరజ్ మరణవార్త విని తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని సత్యనారాయణ తెలిపారు. కాగా నీర‌జ్ యాద‌వ్ మృతికి స్ప‌ష్ట‌మైన‌ కార‌ణాలు ఇంకా తెలియ‌రాలేదు. అయితే ఇటీవ‌లే డోపింగ్‌లో ప‌ట్టుబ‌డ‌డంతో నీర‌జ్ యాద‌వ్ జ‌పాన్‌లోని న‌గోయా వేదిక‌గా ముగిసిన 2026-పారా ఆసియా గేమ్స్‌లో పాల్గొన‌కుండా నిషేధం విధించారు. ఈ క్రీడ‌ల‌కు దూర‌మ‌య్యాన‌న్న కార‌ణంతో మాన‌సిక ఒత్తిడికి గురైన నీర‌జ్ యాద‌వ్ ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డి ఉంటార‌ని పోలీసులు భావిస్తున్నారు.

ఏడేళ్ల వ‌య‌సులో పోలియో బారిన..
ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌కు చెందిన నీర‌జ్ యాద‌వ్‌కు ఏడేళ్ల వయసులో పోస్ట్-పోలియో రెసిడ్యువల్ పక్షవాతంతో బాధపడుతున్నట్లు నిర్ధారణ అయింది. దీంతో పారా అథ్లెట్‌గా అవ‌తారం ఎత్తిన నీర‌జ్ యాద‌వ్‌ F55 కేటగిరీలో పారా జావెలిన్, డిస్కస్ త్రోలో పోటీపడ్డాడు. 2018 జకార్తా ఆసియన్ పారా గేమ్స్, 2022 హాంగ్జౌ పారా ఆసియన్ పారా గేమ్స్‌లో జావెలిన్ త్రోలో స్వ‌ర్ణాల‌తో పాటు డిస్క‌స్ త్రోలోనూ  స్వ‌ర్ణ ప‌త‌కం ద‌క్కించుకున్నాడు. అయితే పారా అథ్లెట్‌గా మార‌క‌ముందు నీర‌జ్ యాద‌వ్ 2005 నుంచి 2012 వ‌ర‌కు వీల్‌చైర్ టెన్నిస్ ఆడాడు.

డోపింగ్‌లో ప‌ట్టుబ‌డి
అక్టోబర్ 2023లో, బెంగళూరులోని SAI సెంటర్‌లో జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (NADA) సేకరించిన పోటీయేతర నమూనాలో నీరజ్ యాదవ్‌కు స్టానోజోలోల్ అనే అనాబాలిక్ స్టెరాయిడ్ ఉన్నట్లు పరీక్షలో తేలింది. దీంతో నవంబర్ 2023లో యాంటీ-డోపింగ్ నియమ ఉల్లంఘన (ADRV) ఆరోపణపై అతనిపై కేసు నమోదయ్యింది. 

2024లో అతడిపై నాడా తాత్కాలిక సస్పెన్షన్ విధించింది. దీంతో హాంగ్జౌ ఆసియా గేమ్స్‌లో నీర‌జ్ యాద‌వ్ సాధించిన రెండు స్వ‌ర్ణ ప‌త‌కాలు చెల్ల‌వ‌ని నాడా తెలిపింది. ఫ‌లితంగా స్వర్ణ పతకాల సంఖ్య 29 నుండి 27కి తగ్గడంతో పాటు పతకాల సంఖ్య 111 నుంచి 108కి పడిపోయింది. 

అయితే విచార‌ణ స‌మ‌యంలో నీర‌జ్ తాను ఎలాంటి నిషేదిత ఉత్ప్రేర‌కం తీసుకోలేద‌ని, న‌మూనా క‌లుషితమ‌యి ఉండొచ్చు లేదా ప‌రీక్షా ప్ర‌క్రియ‌లో పొరపాటు జ‌రిగి ఉండొచ్చ‌ని వాదించారు. అవ‌స‌ర‌మైతే త‌న ప్రామాణిక‌త‌ను ధృవీక‌రించ‌డానికి డీఎన్ఏ ప‌రీక్ష కూడా చేయాల‌ని డిమాండ్ చేయ‌డం గ‌మ‌నార్హం.


 

ఇదీ చదవండి: 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement