Photo Credit: BCCI Twitter
వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో 38 బంతుల్లోనే 113 పరుగులు బాదిన అభిషేక్ శర్మ.. టీ20ల్లో తానెంతో ప్రమాదకర బ్యాటర్ అనేది మరోసారి చెప్పకనే చెప్పాడు. గత 10 ఇన్నింగ్స్‌ల్లో రెండు అర్థసెంచరీలు మాత్రమే సాధించిన అభిషేక్.. తాజాగా 35 బంతుల్లోనే శతకం సాధించి తనపై వచ్చిన విమర్శలకు చెక్ పెట్టాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అభిషేక్ శర్మపై ప్రసంశల వర్షం కురిపించాడు.
‘ఒక్క మంచి ఇన్నింగ్స్ ఆడకపోయినా, పొరపాట్లు చేసినా అభిషేక్‌ను జట్టు నుంచి తొలగించాలనే డిమాండ్లు ఎక్కువగా వినిపించేవి. కానీ ఈ ఎడమచేతి బ్యాటర్ మాత్రం తనపై వస్తున్న విమర్శలకు ఒకే ఒక్క సెంచరీతో ఘాటుగా బదులిచ్చాడు. అయితే ఇక్కడ నేను జట్టు మేనేజ్‌మెంట్ లేదా సెలెక్టర్లను నిందించడం లేదు.
ఎందుకంటే అభిషేక్ లాంటి ఆటగాడు అవకాశం వచ్చినప్పుడు ఎలా రాణిస్తాడనేది వారికి బాగా తెలుసు. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యుత్తమ, భయంలేని హిట్టర్‌గా అభిషేక్ పేరు పొందాడు. అతను ఆఫ్ సైడ్‌లో కొట్టే విధానం నమ్మశక్యం కానిది. మీరు అతనికి ఒకే లైన్‌లో బౌలింగ్ చేస్తూ, ఆఫ్ సైడ్‌లో ఆడటానికి అవకాశం ఇస్తే, అతను మిమ్మల్ని వదిలిపెట్టడు.
అందుకే అతనికి బౌలింగ్ చేయడం చాలా కష్టం. పిచ్ నెమ్మదిగా లేకపోయినా, లేదా పదేపదే మీ లైన్‌లను మార్చకపోయినా, క్రీజులో నిలదొక్కుకోవడం కష్టం. న్యూజిలాండ్ గడ్డపై ఒక భారత ఆటగాడు సెంచరీ చేయడం నిజంగా అసాధారణ విషయం’ అని పఠాన్ చెప్పుకొచ్చాడు.
అభిషేక్ శర్మ చాలాకాలం పాటు పురుషుల టీ20ఐ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో నెంబర్‌వన్ స్థానంలో కొనసాగాడు. అయితే తన సహచర ఆటగాడు ఇషాన్ కిషన్ ఆ స్థానాన్ని అధిగమించడంతో అభిషేక్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో 30 బంతుల్లోనే సెంచరీ బాది ప్రపంచ రికార్డు నెలకొల్పిన అభిషేక్.. తాజాగా కివీస్‌తో మ్యాచ్‌లో తన సొంత రికార్డును బద్దలుకొట్టేలా కనిపించాడు. కానీ చివరికి 35 బంతుల్లో సెంచరీ చేసి రెండో అత్యుత్తమం నమోదు చేశాడు.
ఇదీ చదవండి:


