Photo Credit: BCCI Twitter
న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో ఓపెనర్ అభిషేక్ శర్మ రికార్డు సెంచరీతో చెలరేగడంతో టీమిండియా మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకుంది. 35 బంతుల్లోనే సెంచరీ మార్క్ సాధించిన అభిషేక్ ఓవరాల్‌గా 38 బంతుల్లో 9 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 113 పరుగులు చేసి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా ఎంపికయ్యాడు.
అవార్డు అందుకున్న అనంతరం వ్యాఖ్యాత సైమన్ డౌల్‌తో అభిషేక్ శర్మ మాట్లాడుతూ..‘‘ఫీల్డింగ్ సమయంలో పిచ్ ఎలా స్పందిస్తుందో చూశాం. చిన్న బౌండరీలను లక్ష్యంగా చేసుకొని, పవర్‌ప్లేలో పేస్ బౌలర్ల వేగాన్ని కూడా ఉపయోగించు కోవాలనేదే వ్యూహం. అది బాగా పని చేసింది. ఇలాంటి షాట్లు ఆడటం కనిపించినంత సులువేం కాదు. ఎంతో సాధన అవసరం.
యువీ భయ్యా రికార్డు బ్రేక్ చేస్తా..
(12 బంతుల్లో అర్ధ సెంచరీ చేయలేకపోయావంటూ యువరాజ్ చేసిన సరదా వ్యాఖ్యపై) ఆయన అప్పుడు ఎలా ఆడగలిగారో తెలీదు కానీ అలాంటివి అనుకుంటే జరగవు. అలాంటి అద్భుతాలు ఎప్పుడో ఒకసారి మాత్రమే సాధ్యమవుతాయి. వాటి గురించి ఆలోచించడంకంటే జట్టును గెలిపించడంపైనే నా దృష్టి ఉంటుంది. నా గురువు యువరాజ్ 12 బంతుల ఫిఫ్టీ రికార్డును మాత్రం ఏదో ఒకరోజు బద్దలుకొట్టడానికి ప్రయత్నిస్తా’ అని నవ్వుతూ పేర్కొన్నాడు.
‘నాతో పాటు జట్టులో ఉన్న ప్రతీ ఆటగాడు వ్యక్తిగత రికార్డులకన్నా జట్టును గెలిపించడంపైనే దృష్టి సారిస్తాడు. దానికి తగ్గట్లుగా ప్రణాళిక రచించుకుంటాము. ఈ సిరీస్ అంతటా కూడా మేము దానినే కొనసాగించాలనుకుంటున్నాం. ’’ అని ముగించాడు.
80 బంతుల్లోనే టార్గెట్ హాంఫట్
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. మిచెల్ (52 బంతుల్లో 89 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) దూకుడుగా ఆడగా... ఫిన్ అలెన్ (25 బంతుల్లో 40; 5 సిక్స్‌లు), బెవాన్ జాకబ్స్ (23 బంతుల్లో 39; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు.
అనంతరం భారత్ 13.2 ఓవర్లలో 4 వికెట్లకు 199 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అభిషేక్ శర్మ (38 బంతుల్లో 113; 9 ఫోర్లు, 11 సిక్స్‌లు) మెరుపు సెంచరీతో సత్తా చాటగా... వైభవ్ సూర్యవంశీ (19 బంతుల్లో 45; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) కూడా చెలరేగాడు. ఇరుజట్ల మధ్య నాలుగో టీ20 శుక్రవారం ఆక్లాండ్ వేదికగా జరగనుంది.
Abhishek Sharma on Yuvraj's playful jibe of not getting a 12-ball fifty: “I don't know what cricket Yuvi pa was playing at the time. If anyone wants to go out and bat like that, it is not easy. It is not easy to get a fifty in 12 balls, but we do not think about that, we want to just win the match for our team”. https://t.co/YEDRt45y8c
— Rakesh Sharma (@iamrkRakesh) October 27, 2026
ఇదీ చదవండి: న్యూజిలాండ్‌పై ‘విధ్వంసాభిషేకం’


