అభిషేక్ శర్మ 38 బంతుల్లో 9 ఫోర్లు, 11 సిక్స్‌లతో 113 పరుగులు
మూడో టి20లో కివీస్‌పై 6 వికెట్లతో టీమిండియా ఘన విజయం
3–0తో సిరీస్ భారత్ సొంతం
శుక్రవారం ఆక్లాండ్‌లో నాలుగో టి20
కభీ కభీ అభీని తక్కువగా అంచనా వేస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు కనిపించింది... గత 10 ఇన్నింగ్స్‌లలో 2 అర్ధ సెంచరీలు ఉన్నా అతడి నుంచి అందరూ ఇంకా ఏదో ఆశించారు... శుభారంభాలు చేస్తున్నా భారీ స్కోరు వరకు వెళ్లడం లేదు... ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లలో గెలుపు సామ్సన్, తిలక్ వర్మల పేరిట రాయబడింది. ఇలాంటి స్థితిలో తానే పెద్ద ఇన్నింగ్స్ బాకీ ఉన్నాడు. ఇప్పుడు దానిని తీర్చేస్తూ అభిషేక్ శర్మ చెలరేగిపోయాడు.
15 బంతుల్లో హాఫ్ సెంచరీ, 35 బంతుల్లో సెంచరీ బాదేసి ప్రత్యర్థి బౌలర్లకు మానసిక ప్రశాంతత దూరం చేసి తాను మాత్రం విజయధ్యానంలో మునిగిపోయాడు! అభీకి తోడుగా అచ్చొచ్చిన ఓపెనింగ్ స్థానంలో వైభవ్ తానూ తక్కువ కాదన్నట్లుగా మెరుపు ప్రదర్శన చేశాడు. ఫలితంగా న్యూజిలాండ్‌తో మూడో టి20లో భారత్‌కు భారీ విజయం దక్కింది.... రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే కివీస్ గడ్డపై టీమిండియా వరుసగా మూడోసారి టి20 సిరీస్‌ను సొంతం చేసుకుంది.
వెలింగ్టన్: తొలి 14 బంతుల్లో 50... 30 బంతుల్లో 100... పవర్‌ప్లే ముగిసేసరికి 118... 80 బంతుల్లో 199 పరుగుల లక్ష్య ఛేదన... అసాధారణ, రికార్డుల మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ టి20 సిరీస్‌ను 3–0తో గెలుచుకుంది. మంగళవారం జరిగిన మూడో మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో కివీస్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది.
మిచెల్ (52 బంతుల్లో 89 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) దూకుడుగా ఆడగా... ఫిన్ అలెన్ (25 బంతుల్లో 40; 5 సిక్స్‌లు), బెవాన్ జాకబ్స్ (23 బంతుల్లో 39; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. అనంతరం భారత్ 13.2 ఓవర్లలో 4 వికెట్లకు 199 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అభిషేక్ శర్మ (38 బంతుల్లో 113; 9 ఫోర్లు, 11 సిక్స్‌లు) మెరుపు సెంచరీతో సత్తా చాటగా... వైభవ్ సూర్యవంశీ (19 బంతుల్లో 45; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) కూడా చెలరేగాడు. వీరిద్దరు తొలి వికెట్‌కు 44 బంతుల్లోనే 133 పరుగులు జోడించారు. ఈ గెలుపుతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 3–0తో సొంతం చేసుకుంది. నాలుగో టి20 శుక్రవారం ఆక్లాండ్‌లో జరుగుతుంది.
రాణించిన మిచెల్...
ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే సీఫెర్ట్ (2) వెనుదిరిగినా... అలెన్, మిచెల్ భారీ షాట్లు ఆడుతూ పరుగులు రాబట్టారు. 3–8 మధ్య ఆరు ఓవర్లలో వీరిద్దరు కలిసి 8 సిక్సర్లు బాదారు. 8వ ఓవర్ ముగిసేసరికి కివీస్ స్కోరు 88/1. అయితే 9వ ఓవర్లో అలెన్‌ను నితీశ్ అవుట్ చేయడంతో ఆట మలుపు తిరిగింది. ఆ తర్వాత భారత బౌలర్లు కట్టడి చేయడంతో కివీస్ బ్యాటర్లు పరుగులు చేయడంలో ఇబ్బంది పడ్డారు. 26 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న మిచెల్ తన తర్వాతి 26 బంతుల్లో 35 రన్స్ చేశాడు. చివరి 4 ఓవర్లలో కివీస్ 42 రన్స్ రాబట్టింది.
ధనాధన్ బాదుడు...
తొలి ఓవర్లో ఏకంగా 26 పరుగులు రాబట్టి ఛేదనను మొదలు పెట్టిన భారత్ ఆ తర్వాత దూసుకుపోయింది. డఫీ వేసిన ఈ ఓవర్లో అభిషేక్ ఒక సిక్స్ కొట్టగా, వైభవ్ సిక్స్, ఫోర్ బాదాడు. మిల్నే ఓవర్లో వరుసగా 6, 6, 4 బాదిన అభిషేక్... బ్రేస్‌వెల్ ఓవర్లో వరుసగా 4, 6, 4 కొట్టాడు. తర్వాతి ఓవర్లో జేమీసన్ వంతు వచ్చింది. ఈసారి వరుసగా 6, 6, 4తో అభి సత్తా చాటాడు. మరోవైపు డఫీ వేసిన ఆరో ఓవర్లో వైభవ్ 3 ఫోర్లు, సిక్స్ కొట్టాడు. తొలి వికెట్ భాగస్వామ్యంతోనే భారత్ గెలుపు దాదాపుగా ఖాయమైన దశలో వైభవ్ వెనుదిరిగాడు. అనంతరం ఫిషర్ ఓవర్లో 2 సిక్స్‌లు కొట్టిన అభిషేక్... జేమీసన్ ఓవర్లో ఫోర్‌తో శతకం పూర్తి చేసుకున్నాడు. విజయానికి చేరువైన దశలో 17 పరుగుల వ్యవధిలో ముగ్గురు బ్యాటర్లు అవుటైనా... భారత్ 40 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్‌ను హస్తగతం చేసుకుంది.
స్కోరు వివరాలు
న్యూజిలాండ్ ఇన్నింగ్స్: సీఫెర్ట్ (సి) అక్షర్ (బి) అర్ష్ దీప్ 2; అలెన్ (సి) నమన్ (బి) నితీశ్ 40; మిచెల్ (నాటౌట్) 89; ఫిలిప్స్ (సి) అండ్ (బి) అక్షర్ 17; జాకబ్స్ (నాటౌట్) 39; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 198.
వికెట్ల పతనం: 1–4, 2–90, 3–123.
బౌలింగ్: భువనేశ్వర్ 4–0–40–0, అర్ష్ దీప్ 4–0–33–1, ప్రిన్స్ 4–0–44–0, అక్షర్ 4–0–36–1, నితీశ్ రెడ్డి 4–0–38–1.
భారత్ ఇన్నింగ్స్: వైభవ్ (సి) మిచెల్ (బి) ఫిషర్ 45; అభిషేక్ (సి) ఫిలిప్స్ (బి) జేమీసన్ 113; సామ్సన్ (బి) జేమీసన్ 18; శ్రేయస్ (సి) ఫిలిప్స్ (బి) సాంట్నర్ 5; తిలక్ (నాటౌట్) 1; నమన్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (13.2 ఓవర్లలో 4 వికెట్లకు) 199.
వికెట్ల పతనం: 1–133, 2– 178, 3–193, 4–195.
బౌలింగ్: డఫీ 2–0–44–0, మిల్నే 2–0–33–0, బ్రేస్‌వెల్ 2–0–36–0, జేమీసన్ 3.2–0–45–2, ఫిషర్ 1–0–23–1, సాంట్నర్ 3–0–17–1.
ఫీల్డింగ్ సమయంలో పిచ్ ఎలా స్పందిస్తుందో చూశాం. చిన్న బౌండరీలను లక్ష్యంగా చేసుకొని, పవర్‌ప్లేలో పేస్ బౌలర్ల వేగాన్ని కూడా ఉపయోగించు కోవాలనేదే వ్యూహం. అది బాగా పని చేసింది. ఇలాంటి షాట్లు ఆడటం కనిపించినంత సులువేం కాదు. ఎంతో సాధన అవసరం. (12 బంతుల్లో అర్ధ సెంచరీ చేయలేకపోయావంటూ యువరాజ్ చేసిన సరదా వ్యాఖ్యపై) ఆయన అప్పుడు ఎలా ఆడగలిగారో తెలీదు కానీ అలాంటివి అనుకుంటే జరగవు. ఎప్పుడో ఒకసారి సాధ్యమవుతాయి. వాటి గురించి ఆలోచించడంకంటే జట్టును గెలిపించడంపైనే నా దృష్టి ఉంటుంది.
– అభిషేక్ శర్మ


