source: X
పాకిస్తాన్‌తో జరుగనున్న రెండు టెస్టుల సిరీస్‌కు ముందు శ్రీలంక జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో స్టార్ బ్యాటర్ పతుమ్ నిస్సాంక ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. అతడి స్థానంలో వికెట్ కీపర్ బ్యాటర్ లహిరు ఉదారకు జట్టులో చోటు కల్పించారు.
ఫిట్‌నెస్ సాధిస్తేనే ఆడతాడనే షరతుతో నిస్సాంకను తొలుత జట్టుకు ఎంపిక చేశారు. అయితే, గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో అతడు పాకిస్తాన్ పర్యటనకు దూరమయ్యాడు. ఇటీవల పాకిస్తాన్‌తో జరిగిన టీ20 సిరీస్‌తో పాటు ఇంగ్లండ్, పాకిస్తాన్‌లతో జరుగుతున్న వన్డే ట్రై సిరీస్‌లోనూ నిస్సాంక ఆడలేదు.
నిస్సాంక స్థానంలో ఎంపికైన లహిరు ఉదార గతంలో శ్రీలంక తరఫున టెస్టులు, టీ20లు ఆడాడు. 2026లో వెస్టిండీస్‌తో జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ సిరీస్‌లో 188 పరుగులు చేసి తన కెరీర్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు.
కాగా, శ్రీలంక ప్రస్తుతం పాక్‌లో జరుగుతున్న ట్రై సిరీస్‌లో ఫైనల్‌కు చేరింది. ఇవాళ పాక్‌ను చిత్తుగా ఓడించి, అదే జట్టుతో తుది పోరుకు సిద్దమైంది. ఈ సిరీస్‌లో పాల్గొన్న ఇంగ్లండ్ ఒక్క గెలుపు కూడా లేకుండా నిష్క్రమించింది.
ట్రై సిరీస్ అనంతరం నవంబర్ 9 నుంచి రావల్పిండి వేదికగా పాక్‌తో తొలి టెస్టు ప్రారంభం కానుంది. రెండో టెస్టు నవంబర్ 17 నుంచి లాహోర్‌లో జరగనుంది. ఈ సిరీస్ ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా నిర్వహించనున్నారు.
శ్రీలంక టెస్టు జట్టు: కుశాల్ మెండిస్ (కెప్టెన్), అంజల బండారా, దినేశ్ చండీమల్, ధనంజయ డి సిల్వా, సోనాల్ దినూష, అసిత ఫెర్నాండో, ప్రభాత్ జయసూర్య, లహిరు కుమార, దిల్షాన్ మదుశంక, ఈషాన్ మలింగ, కమిందు మెండిస్, కేశర నవంత, మిలన్ రత్నాయకే, పసిందు సూరియబండార, లహిరు ఉదార.
ఇదీ చదవండి: పాక్‌ను చిత్తుగా ఓడించిన శ్రీలంక


