source: X
టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ టీ20 క్రికెట్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఆ రికార్డు, ఈ రికార్డు అన్న తేడా లేకుండా అన్ని బ్యాటింగ్ రికార్డులను తిరగరాసేస్తున్నాడు. ఈ క్రమంలో అతడు తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో 35 బంతుల శతకం బాదాడు.
టీ20ల్లో అతడికి ఇది 11వ శతకం. ఈ సెంచరీతో అతడు పురుషుల క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకాడు. ఈ క్రమంలో టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లి (10)ని అధిగమించాడు. అలాగే పురుషుల టీ20 క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన భారత బ్యాటర్‌గా అవతరించాడు.
అంతర్జాతీయ టీ20ల విషయానికొస్తే.. ఈ సెంచరీ అభిషేక్‌కు నాలుగవది. ఈ సెంచరీతో అతడు అంతర్జాతీయ పురుషుల టీ20 క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు బాదిన ఆటగాళ్ల జాబితాలో ఆరో స్థానానికి చేరాడు.
ఈ క్రమంలో తన మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ఫిల్ సాల్ట్, కరణ్‌బీర్ సింగ్ సరసన చేరాడు. వీరంతా తలో 4 సెంచరీలు బాదారు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సెంచరీల రికార్డు టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, ఆసీస్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ పేరిట ఉంది. వీరిద్దరు తలో 5 సెంచరీలు బాదారు.
ఇదిలా ఉంటే, అభిషేక్ వీర ఉతుకుడు దెబ్బకు మూడో టీ20లో భారత్ న్యూజిలాండ్‌పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే 3-0 కైవసం చేసుకుంది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేయగా.. భారత్ 13.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఆడుతూపాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. అభిషేక్ శర్మ (38 బంతుల్లో 113; 9 ఫోర్లు, 11 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో భారత్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు.
ఇదీ చదవండి: అభిషేక్ మహోగ్రరూపం.. సరికొత్త రికార్డులు నెలకొల్పిన టీమిండియా


