source: X
వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ మహోగ్రరూపం దాల్చాడు. న్యూజిలాండ్ నిర్దేశించిన 199 పరుగుల లక్ష్య ఛేదనలో కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. హాఫ్ సెంచరీ తర్వాత కూడా అభిషేక్ విధ్వంసం కొనసాగుతోంది.
అతడికి చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ కూడా జతకలవడంతో భారత్ సుడిగాలి వేగంతో పరుగులు సాధిస్తుంది. ఈ క్రమంలో 2.2 ఓవర్లలోనే 50 పరుగులు, 5 ఓవర్లలోనే 100 పరుగులు పూర్తి చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా 50, 100 పరుగులు పూర్తి చేసిన జట్టుగా భారత్ రికార్డు నెలకొల్పింది.
ఫాస్టెస్ట్ 50 రికార్డును భారత్ రొమేనియా (2.2 ఓవర్లు), పపువా న్యూగినియా (2.2)తో షేర్ చేసుకోగా.. ఫాస్టెస్ట్ హండ్రెడ్‌ను మాత్రం భారత్ సోలోగా చేజిక్కించుకుంది.
6.3 ఓవర్ల అనంతరం భారత్ స్కోర్ 130-0గా ఉండగా.. అభిషేక్ 23 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 79 పరుగులు, వైభవ్ 17 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 44 పరుగులు చేసి క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో భారత్ గెలుపుకు చేరువలో ఉంది. మరో 80 బంతుల్లో 68 పరుగులు చేస్తే మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను కూడా కైవసం చేసుకుంటుంది.
అంతకుముందు డారిల్ మిచెల్ (52 బంతుల్లో 89 నాటౌట్), ఫిన్ అలెన్ (25 బంతుల్లో 40), ఆఖర్లో బేవాన్ జేకబ్స్ (23 బంతుల్లో 39 నాటౌట్) సత్తా చాటడంతో న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్, నితీశ్ కుమార్ రెడ్డి తలా ఒక వికెట్ పడగొట్టారు.
ఇదీ చదవండి: చరిత్ర సృష్టించిన కివీస్ ఓపెనర్.. అభిషేక్ రికార్డు బ్రేక్


