ఇషాన్‌కు గాయం నిజ‌మేనా? అడ్డంగా దొరికిన బీసీసీఐ! | Ishan Kishan Really Injured Or Sidelined To Give Vaibhav Suryavanshi A Chance? Batting Practice Photos Spark Debate Ahead Of 3rd T20I | Sakshi
Sakshi News home page

ఇషాన్‌కు గాయం నిజ‌మేనా? అడ్డంగా దొరికిన బీసీసీఐ!

Oct 27 2026 10:50 AM | Updated on Oct 27 2026 11:41 AM

Ishan Kishan-Really-Injured-Or-Sidelined-Give-Chances-For-Vaibhav

Photo Credit: Twitter

న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న టీ20 సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు నెగ్గి సిరీస్‌లో ఆధిక్యంలో ఉన్న టీమిండియా మ‌రో రెండు గంట‌ల్లో మూడో టీ20 మ్యాచ్ ఆడ‌నుంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను కైవ‌సం చేసుకోవాల‌ని భార‌త్ భావిస్తోంది. ఈ విష‌యం ప‌క్క‌న‌బెడితే, ఇషాన్ కిష‌న్‌కు సంబంధించిన ఒక వార్త ప్ర‌స్తుతం సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారింది. 

గ‌జ్జ‌ల్లో గాయం కార‌ణంగా రెండో టీ20కి దూర‌మైన ఇషాన్ ఇంకా కోలుకుంటుండ‌డంతో నేటి మ్యాచ్‌కు కూడా అందుబాటులో ఉండ‌డం లేద‌ని బీసీసీఐ సోమ‌వారం అధికారిక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. అతను ఇంకా పూర్తిస్థాయి ఫిట్‌నెస్ సాధించ‌క‌పోవ‌డంతో రేపు వెల్లింగ్‌టన్‌లో జరగనున్న మూడవ టీ20ఐకి దూరమయ్యాడ‌ని, బీసీసీఐ వైద్య బృందం ఇషాన్ పురోగతిని పర్యవేక్షిస్తోంద‌ని చెప్పుకొచ్చింది.

క‌ట్‌చేస్తే.. మంగ‌ళ‌వారం ఉద‌యం సోష‌ల్ మీడియాలో ఇషాన్ కిష‌న్ ఎలాంటి ఇబ్బంది లేకుండా మైదానంలో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలు బ‌య‌టికి వ‌చ్చాయి. ఫొటోల్లో ఇషాన్‌ను గ‌మ‌నిస్తే.. అస‌లు అత‌డికి నిజంగానే గాయ‌మైందా అనే అనుమానం వ‌స్తోంది. అంతేకాదు రెండో టీ20కి దూరంగా ఉన్న ఇషాన్‌.. తిల‌క్‌, నితీశ్ వీరోచిత పోరాటంతో టీమిండియాను గెలిపించిన స‌మ‌యంలో డగౌట్‌లో ఇషాన్ ఎలాంటి ఇబ్బంది లేకుండా సామ్స‌న్‌ను ఎత్తుకోవ‌డం క‌నిపించింది. 

గాయ‌మైతే మంచిగా రెస్ట్ తీసుకోవాలి కానీ, సామ్స‌న్‌ను ఎత్తుకోవ‌డం, మైదానంలో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయ‌డం లాంటివి చూసుకుంటే, అసలు ఇషాన్‌కు నిజంగా గాయ‌మైందా? లేదంటే వైభ‌వ్‌ను ఆడించ‌డం కోసం అత‌డికి గాయ‌మైన‌ట్లు నాట‌కం ఆడుతున్నారా అంటూ క్రికెట్ అభిమానులు సోష‌ల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఇషాన్‌ ప్రాక్టీస్‌ చేస్తున్న ఫొటోలను బీసీసీఐ తన ‘ఎక్స్‌’లో స్వయంగా పంచుకోవడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరినట్లయింది. 

ఇషాన్‌కు నిజంగానే గాయ‌మైతే పర్వాలేదు, కానీ వైభ‌వ్ సూర్య‌వంశీకి అవ‌కాశ‌మివ్వ‌డం కోస‌మే ఇషాన్‌ను ప‌క్క‌న‌బెడితే మాత్రం అది మేనేజ్‌మెంట్ మూర్క‌త్వ‌మే అవుతుంద‌ని విమ‌ర్శించారు. ఎందుకంటే ప్ర‌స్తుతం టీ20ల్లో నంబ‌ర్‌వ‌న్ బ్యాట‌ర్‌గా ఉన్న ఇషాన్ కిష‌న్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. 

రీఎంట్రీ త‌ర్వాత అద్భుత ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తున్న ఇషాన్‌ను ఇలా వైభ‌వ్ కోసం ప‌క్క‌న‌బెట్ట‌డం ఎంత‌మాత్రం స‌రికాద‌ని వాపోతున్నారు. పోనీ వైభ‌వ్ ఏమైనా ఆడుతున్నాడా అంటే అదీ లేదు. ఇషాన్ దూరమ‌వ్వ‌డంతో రెండో టీ20లో వైభ‌వ్‌కు అవ‌కాశ‌మిచ్చిన‌ప్ప‌టికీ, తాను నిరూపించుకోలేక‌పోయాడు. ఓపెనింగ్‌కు బదులు వ‌న్‌డౌన్‌లో వ‌చ్చిన సూర్య‌వంశీ 8 బంతుల్లో 4 ప‌రుగులు మాత్ర‌మే చేసి నిరాశ‌ప‌రిచాడు.

ఇక మూడో టీ20కి కూడా ఇషాన్ కిష‌న్ దూరంగా ఉండ‌డంతో, వైభ‌వ్ మ్యాచ్‌లో ఆడ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఎందుకంటే ఇప్ప‌టికే కోచ్ గంభీర్‌తో పాటు కెప్టెన్ అయ్య‌ర్ ఎలాంటి మార్పు లేకుండానే టీమిండియా బ‌రిలోకి దిగుతుంద‌ని క్లారిటీ ఇచ్చారు. అయితే వైభ‌వ్ ఓపెన‌ర్‌గా వ‌స్తాడా లేదా మ‌రోసారి వ‌న్‌డౌన్‌కే ప‌రిమిత‌మ‌వుతాడా అన్న‌ది మ్యాచ్ ప్రారంభ‌మైన త‌ర్వాతే తెలుస్తుంది.

ఇదీ చదవండి: 'అదేంటో అతనొక్కడే నాకు ఇద్దరిలా కనిపిస్తున్నాడు'

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement