IND vs NZ: భారత జట్టుకు ఊహించని షాక్‌! | IND A vs NZ A 1st Unofficial Test: Padikkal 199 Goes Vain Match Drawn Reason | Sakshi
Sakshi News home page

IND vs NZ: భారత జట్టుకు ఊహించని షాక్‌!

Oct 27 2026 12:38 PM | Updated on Oct 27 2026 1:24 PM

IND A vs NZ A 1st Unofficial Test: Padikkal 199 Goes Vain Match Drawn Reason

పడిక్కల్‌ (PC: Sonysports)

న్యూజిలాండ్‌- ‘ఎ’ జట్టుతో తొలి అనధికారిక టెస్టులో భారత్‌- ‘ఎ’ జట్టుకు ఊహించని విధంగా ఎదురుదెబ్బ తగిలింది. ఒక్క వికెట్‌ తీస్తే చాలు విజయం మనదే అన్న సంతోషంలో ఉన్న వేళ.. వాతావరణ మార్పు కారణంగా మ్యాచ్‌ డ్రా అయింది.

113 పరుగులకే ఆలౌట్‌
కాగా మూడు అనధికారిక టెస్టుల సిరీస్‌లో భాగంగా లిన్‌కోన్‌ వేదికగా కివీస్‌- భారత్‌ ‘ఎ’ జట్ల మధ్య మొదటి మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన.. ఆతిథ్య న్యూజిలాండ్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 113 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది.

దేవదత్‌ పడిక్కల్‌ (32), యశ్‌ రాథోడ్‌ (44) ఓ మోస్తరుగా రాణించడం వల్ల ఈ మాత్రం స్కోరు చేయగలిగింది. కివీస్‌ బౌలర్లలో సైమన్‌ కీనీ ఐదు వికెట్లతో చెలరేగి భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనాన్ని శాసించగా.. జేక్‌ గిబ్సన్‌ మూడు, ఫ్రేజర్‌ షీట్‌, క్రిస్టియన్‌ క్లార్క్‌ తలా ఒక వికెట్‌ పడగొట్టారు.

రాణించిన కివీస్‌ బ్యాటర్లు
అనంతరం న్యూజిలాండ్‌ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 317 పరుగులకు ఆలౌట్‌ అయింది. కెప్టెన్‌ రైస్‌ మరియూ (76), డీన్‌ ఫాక్స్‌క్రాఫ్ట్‌ (51) అర్ధ శతకాలతో రాణించగా.. కర్టిస్‌ హీపీ 44, క్రిస్టియన్‌ క్లార్క్‌ 42 పరుగులు చేశారు. భారత బౌలర్లలో అన్షుల్‌ కాంబోజ్‌, ఆకిబ్‌ నబీ చెరో మూడు వికెట్లు తీయగా.. ఆకాశ్‌ దీప్‌ రెండు, ముకేశ్‌ చౌదరి, వాషింగ్టన్‌ సుందర్‌ తలా ఒక వికెట్‌ పడగొట్టారు.

పడిక్కల్‌ డబుల్‌ సెంచరీ మిస్‌
అయితే, రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ అనూహ్య రీతిలో పుంజుకుంది. ఏకంగా 516 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. దేవదత్‌ పడిక్కల్‌ భారీ శతకం (199)తో అదరగొట్టగా.. సాయి సుదర్శన్‌ (91), యశ్‌ రాథోడ్‌ (66), వాషింగ్టన్‌ సుందర్‌ (52) అర్ధ శతకాలతో రాణించారు.

313 పరుగుల లక్ష్యం
ఈ క్రమంలో 312 పరుగుల ఆధిక్యం సంపాదించిన భారత్‌.. కివీస్‌ ముందు 313 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఆటకు చివరి రోజైన మంగళవారం.. కివీస్‌ ఆది నుంచే తడబడింది. ఓపెనర్లలో కెప్టెన్‌ మరియు (2).. వన్‌డౌన్‌లో వచ్చిన టిమ్‌ రాబిన్సన్‌ (0), మాథ్యూ బోయ్‌లే (4) నిరాశ పరచగా.. డీన్‌ ఫాక్స్‌క్రాఫ్ట్‌ 42 పరుగులతో రాణించాడు.

తేలిపోయిన కివీస్‌ బ్యాటర్లు
భారత బౌలర్ల ధాటికి తాళలేక మిగతా వారంతా పెవిలియన్‌కు క్యూ కట్టగా.. మరో ఓపెనర్‌ కర్టిస్‌ హీపీ 90 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో 65 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కివీస్‌ 187 పరుగుల వద్ద నిలిచింది. భారత బౌలర్లలో నబీ మూడు, పడిక్కల్‌ రెండు వికెట్లు కూల్చగా.. కాంబోజ్‌, ఆకాశ్‌, ముకేశ్‌, వాషింగ్టన్‌ తలా ఒక వికెట్‌ పడగొట్టారు.

ఆ ఒక్కడు పాతుకుపోవడంతో
ఇక ఆఖరి వికెట్‌ పడకుండా హీపీ క్రీజులో పాతుకుపోవడం.. అదే సమయంలో వెలుతురులేమి కారణంగా ఆట ముందుకు సాగకపోవడం ఆతిథ్య జట్టుకు ఉపకరించాయి. కాసేపటి తర్వాత బ్యాడ్‌లైట్‌ కారణంగా ఆటను ఇంతటితో ముగిస్తున్నట్లు అంపైర్లు ప్రకటించగా.. మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. విజయం ముంగిట నిలిచిన భారత జట్టుకు ఊహించని షాక్‌ తగిలింది.

ఇవీ చదవండి: IND vs NZ: 'అదేంటో అతనొక్కడే నాకు ఇద్దరిలా కనిపిస్తున్నాడు'
కోహ్లి కాదు!.. రొనాల్డో ఫాలో అయ్యే ఒకే ఒక్క ఇండియన్‌ అతడే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement