చరిత్ర సృష్టించిన కివీస్‌ ఓపెనర్‌.. అభిషేక్‌ రికార్డు బ్రేక్‌ | Finn Allen Breaks Abhishek Sharma Record Fastest To 400 Sixes List | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన కివీస్‌ ఓపెనర్‌.. అభిషేక్‌ రికార్డు బ్రేక్‌

Oct 27 2026 2:29 PM | Updated on Oct 27 2026 2:37 PM

Finn Allen Breaks Abhishek Sharma Record Fastest To 400 Sixes List

PC: Blackcaps

న్యూజిలాండ్‌ ఓపెనర్‌ ఫిన్‌ అలెన్‌ చరిత్ర సృష్టించాడు. టీ20 ఫార్మాట్లో అత్యంత వేగంగా 400 సిక్సర్ల మైలురాయిని చేరుకున్న తొలి న్యూజిలాండ్‌ క్రికెటర్‌గా నిలిచాడు. 

అభిషేక్‌ శర్మ రికార్డు బ్రేక్‌
అదే విధంగా.. టీ20 ఫాస్టెస్ట్‌ 400 సిక్సర్ల ఓవరాల్‌ జాబితాలో టీమిండియా విధ్వంసకర ఓపెనర్‌ అభిషేక్‌ శర్మను ఫిన్‌ అలెన్‌ అధిగమించాడు. టీమిండియాతో మంగళవారం నాటి మూడో టీ20 సందర్భంగా ఈ ఘనత అందుకున్నాడు.

ఐదు సిక్సర్ల సాయంతో
వెల్లింగ్‌టన్‌ వేదికగా టాస్‌ గెలిచిన టీమిండియా.. న్యూజిలాండ్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. కివీస్‌ ఓపెనర్లలో టిమ్‌ సీఫర్ట్‌ (2) విఫలం కాగా.. ఫిన్‌ అలెన్‌ మెరుగ్గా రాణించాడు. మొత్తంగా 25 బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. ఐదు సిక్సర్ల సాయంతో 40 పరుగులు సాధించాడు.

తద్వారా తన టీ20 కెరీర్‌లో కేవలం 3502 బంతుల్లోనే 400 సిక్సర్ల మైలురాయిని చేరుకున్నాడు ఫిన్‌ అలెన్‌. అయితే, నితీశ్‌ కుమార్‌ రెడ్డి బౌలింగ్‌లో నమన్‌ ధీర్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో అతడి ఇన్నింగ్స్‌కు తెరపడింది.

మూడు వికెట్ల నష్టానికి 198 పరుగులు
మరోవైపు.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ డారిల్‌ మిచెల్‌ మెరుపు అర్ధ శతకం (52 బంతుల్లో 89 నాటౌట్‌) సాధించగా.. ఆఖర్లో బేవాన్‌ జేకబ్స్‌ (23 బంతుల్లో 39 నాటౌట్‌) ఓ మోస్తరుగా రాణించాడు.

ఫలితంగా న్యూజిలాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో అర్ష్‌దీప్‌ సింగ్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, అక్షర్‌ పటేల్‌ తలా ఒక వికెట్‌ దక్కించుకున్నారు.

టీ20 ఫార్మాట్లో అత్యంత వేగంగా 400 సిక్సర్ల మైలురాయి చేరుకున్న క్రికెటర్లు (బంతుల పరంగా)
🏏ఆండ్రీ రసెల్‌ (వెస్టిండీస్‌)- 3027 బంతుల్లో 400 సిక్సర్లు
🏏ఫిన్‌ అలెన్‌ (న్యూజిలాండ్‌)- 3502 బంతుల్లో 400 సిక్సర్లు
🏏అభిషేక్‌ శర్మ (ఇండియా)- 3513 బంతుల్లో 400 సిక్సర్లు.

చదవండి: ప‌రుగు తేడాతో ఓట‌మి.. బీసీసీఐకి ఫిర్యాదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement