‘అలా కొడుతుంటే చూస్తూ ఉండిపోవడం తప్ప ఏం చేయగలం’ | NZ Captain Mitchell Santner Reacts After 3rd T20I Defeat Against India, Says We Have To Find A Way To Slow Them Down | Sakshi
Sakshi News home page

‘అలా కొడుతుంటే చూస్తూ ఉండిపోవడం తప్ప ఏం చేయగలం’

Oct 28 2026 9:35 AM | Updated on Oct 28 2026 10:51 AM

NZ Captain-Mitchell Santner-Comments-After Match Lost-Vs-IND-3rd T20I

Photo Credit: Twitter

వెల్లింగ్ట‌న్ వేదిక‌గా టీమిండియాతో జ‌రిగిన‌ మూడో టీ20లో ఓట‌మి అనంత‌రం న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్న‌ర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. తమ బౌల‌ర్లు మంచి లైన్ అండ్ లెంగ్త్‌తో బంతులు వేసిన‌ప్ప‌టికీ, అభిషేక్ శ‌ర్మ విధ్వంసం ముందు నిల‌బ‌డ‌లేక‌పోయాయ‌ని తెలిపాడు. అతడు అలా కొడుతుంటే చూస్తూ ఉండిపోవ‌డ‌మే త‌ప్ప ఇంకేమి చేయ‌గ‌లమ‌ని పెద‌వి విరిచాడు. 

మంచు ప్ర‌భావం కూడా త‌మ‌ను విజ‌యానికి దూరం చేసింద‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు. టీమిండియా ఓపెన‌ర్లు అభిషేక్‌, వైభ‌వ్ విజృంభించిన తీరు చూసి వాళ్ల‌ను ఆప‌డం చాలా క‌ష్ట‌మ‌నిపించిద‌న్నాడు. టాస్ ఓడిపోవ‌డం కూడా మ్యాచ్‌లో త‌మ‌కు క‌లిసి రాలేద‌న్నాడు. డారిల్ మిచెల్‌, బెవాన్ జాక‌బ్స్ అద్భుతంగా బ్యాటింగ్ ఆడార‌ని, వారి భాగ‌స్వామ్యం తాము భారీ స్కోరు చేసేందుకు దోహ‌ద ప‌డింద‌ని సాంట్న‌ర్ తెలిపాడు. 

నిజానికి 200 ప‌రుగులు అనేది ఈ పిచ్‌పై మంచి టార్గెట్ అయిన‌ప్పటికీ, మంచు ప్ర‌భావం త‌మ ఆట‌ను దెబ్బ‌తీసింద‌ని తెలిపాడు. ముఖ్యంగా అభిషేక్‌, వైభ‌వ్‌లు ప‌వ‌ర్ ప్లేలో ఎలా బ్యాటింగ్ చేయాలో చూపించార‌ని, ఇక్క‌డే త‌మ ఓట‌మి ఖాయ‌మైపోయింద‌ని చెప్పుకొచ్చాడు. 

ఒక ద‌శ‌లో వాళ్ల‌ను ఆపేందుకు మార్గాలను అన్వేషించిన‌ప్ప‌టికీ లాభం లేక‌పోయిందన్నాడు. త‌ర్వాతి మ్యాచ్ జ‌ర‌గ‌నున్న ఈడెన్‌పార్క్ ఇంకా చిన్న మైదానం కావ‌డంతో, అక్క‌డ టీమిండియాను క‌ట్ట‌డి చేసేందుకు ప‌దునైన మార్గాలు అన్వేషించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని వెల్ల‌డించాడు.

మ్యాచ్ విష‌యానికొస్తే.. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. మిచెల్‌ (52 బంతుల్లో 89 నాటౌట్‌; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) దూకుడుగా ఆడగా... ఫిన్‌ అలెన్‌ (25 బంతుల్లో 40; 5 సిక్స్‌లు), బెవాన్‌ జాకబ్స్‌ (23 బంతుల్లో 39; 4 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు.

అనంతరం భారత్‌ 13.2 ఓవర్లలో 4 వికెట్లకు 199 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అభిషేక్‌ శర్మ (38 బంతుల్లో 113; 9 ఫోర్లు, 11 సిక్స్‌లు) మెరుపు సెంచరీతో సత్తా చాటగా... వైభవ్‌ సూర్యవంశీ (19 బంతుల్లో 45; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) కూడా చెలరేగాడు. ఇరుజట్ల మధ్య నాలుగో టీ20 శుక్రవారం ఆక్లాండ్‌ వేదికగా జరగనుంది. 

ఇదీ చదవండి: 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement