పాక్‌ గడ్డ మీద శ్రీలంక బౌలర్‌ చరిత్ర.. ఆల్‌టైమ్‌ రికార్డు బ్రేక్‌ | SL vs PAK Dilshan Madushanka Breaks NZ Star 30 YO Record Vs Pakistan | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌ గడ్డ మీద శ్రీలంక బౌలర్‌ చరిత్ర.. ఆల్‌టైమ్‌ రికార్డు బ్రేక్‌

Oct 28 2026 12:49 PM | Updated on Oct 28 2026 12:58 PM

SL vs PAK Dilshan Madushanka Breaks NZ Star 30 YO Record Vs Pakistan

దిల్షాన్‌ మదుషంక (PC: SLC X)

శ్రీలంక క్రికెటర్‌ దిల్షాన్‌ మదుషంక సరికొత్త చరిత్ర సృష్టించాడు. పాకిస్తాన్‌ గడ్డ మీద పాక్‌తో మ్యాచ్‌లో అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు నమోదు చేసిన పేసర్‌గా రికార్డు సాధించాడు. కాగా పాకిస్తాన్‌- శ్రీలంక- ఇంగ్లండ్‌ జట్ల మధ్య ముక్కోణపు వన్డే సిరీస్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే.

నిలకడలేని ఆట
ఈ క్రమంలో ఆతిథ్య పాక్‌- శ్రీలంక జట్ల మధ్య మంగళవారం మ్యాచ్‌ జరిగింది. అయితే, అనిశ్చితికి మారుపేరైన పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు... ఈ ముక్కోణపు వన్డే సిరీస్‌లో తొలి ఓటమి మూటగట్టుకుంది. 

గత మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై అసమాన ఆటతీరుతో విజయం సాధించిన ఆతిథ్య పాకిస్తాన్‌... మంగళవారం శ్రీలంక చేతిలో ఎనిమిది వికెట్ల తేడాతో అనూహ్యంగా ఓటమి పాలైంది.

110 పరుగులకే ఆలౌట్‌
ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఆశలే లేని స్థితిలో అద్భుత పోరాటంతో ఆకట్టుకున్న పాకిస్తాన్‌ జట్టు... శ్రీలంకతో పోరులో మాత్రం పేలవ ఆటతీరు కనబర్చింది. లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌ 25.3 ఓవర్లలో 110 పరుగులకే ఆలౌటైంది. సొంతగడ్డపై పాకిస్తాన్‌కు ఇది రెండో అత్యల్ప వన్డే స్కోరు.

బాబర్‌ ఆజమ్‌ (29; 5 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌. లంక బౌలర్లలో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దిల్షాన్‌ మదుషంక 34 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. పాక్‌ గడ్డ మీద ఏ పేసర్‌కు అయినా ఇవే అత్యుత్తమ గణాంకాలు కావడం విశేషం. 

ఆల్‌టైమ్‌ రికార్డు బ్రేక్‌ 
ఈ క్రమంలో న్యూజిలాండ్‌ పేసర్‌ క్రిస్‌ హారిస్‌ పేరిట ఉన్న 30 ఏళ్ల రికార్డును దిల్షాన్‌ బద్దలు కొట్టాడు. కాగా ఈ మ్యాచ్‌లో దిల్షాన్‌.. పాక్‌ బ్యాటర్లు ఫఖర్ జమాన్‌ (5), సాద్‌ బేగ్‌ (5), అరాఫత్‌ మిన్హాస్‌ (10), కెప్టెన్‌ షాహీన్‌ ఆఫ్రిది (15), హ్యారిస్‌ రవూఫ్‌ (1) వికెట్లు కూల్చాడు.

ఫైనల్‌లోశ్రీలంక
ఇక పాక్‌ విధించిన స్వల్ప లక్ష్యఛేదనలో శ్రీలంక 18.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 114 పరుగులు చేసింది. కమిందు మెండిస్‌ (62 నాటౌట్‌; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ అర్ధశతకంతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. 

పాకిస్తాన్‌ జట్టుపై వరుసగా ఐదు ఓటముల తర్వాత శ్రీలంకకు ఇదే తొలి విజయం. ఇక ఈ విజయంతో  శ్రీలంక ముక్కోణపు సిరీస్‌ ఫైనల్‌కు అర్హత సాధించింది. శనివారం పాకిస్తాన్‌తో శ్రీలంక ఫైనల్‌ మ్యాచ్‌ ఆడుతుంది.

పాకిస్తాన్‌ గడ్డ మీద పాక్‌తో మ్యాచ్‌లో అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు నమోదు చేసిన పేసర్లు
👉దిల్షాన్‌ మదుషంక (శ్రీలంక)- 2026లో లాహోర్‌ వేదికగా 5-34
👉క్రిస్‌ హ్యారిస్‌ (న్యూజిలాండ్‌)- 1996లో లాహోర్‌ వేదికగా 5-42
👉క్రెయిగ్‌ మెక్‌డెర్మాట్‌ (ఆస్ట్రేలియా)- 1987లో సియోల్‌కోట్‌ వేదికగా 5-44
👉బ్లెస్సింగ్‌ ముజర్‌బానీ (జింబాబ్వే)- 2020లో లాహోర్‌ వేదికగా 5-49
👉గ్లెన్‌ మెగ్రాత్‌ (ఆస్ట్రేలియా)- 1984లో రావల్పిండి వేదికగా 5-52.

ఇవీ చదవండి: పెరట్లో ఆడినట్లుంది.. నా వల్ల కాదు! హ్యాట్సాఫ్‌ సంజూ: యువీ
భువీ కీలక నిర్ణయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement