భర్త ముఖాన్ని జల్లెడలో చూస్తారు.. ఈ పండుగ గురించి తెలుసా? | Karwa Chauth 2026, Know About The Significance, Fasting Rituals, Moonrise Traditions And The Mahabharata Story Of Draupadi | Sakshi
Sakshi News home page

Karwa Chauth Story: భర్త ముఖాన్ని జల్లెడలో చూస్తారు.. ఈ పండుగ గురించి తెలుసా?

Oct 29 2026 11:16 AM | Updated on Oct 29 2026 12:43 PM

Karwa Chauth Festival Rituals And Story

సన్నిధి

సౌభాగ్య... సంపదల కోసం కర్వాచౌత్‌

వివాహిత స్త్రీలు తమ భర్త ఆయురారోగ్యాల కోసం ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకునే పండుగలలో ఒకటి కర్వాచౌత్‌. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఈ పండుగను బాగా జరుపుకుంటారు. ఆశ్వయుజ మాసంలో వచ్చే చతుర్థి తిథి నాడు ఈ పండుగ జరుపుకుంటారు. ముత్తయిదువలు రోజంతా చుక్క నీరు కూడా తాగకుండా ఉపవాసం ఉండి, రాత్రి చంద్రుడిని చూశాకే భోజనం చేయడం ఈ పండుగ ఆచారాలలో ప్రధానమైనది. ఒకరకంగా చె΄్పాలంటే మన తెలుగు రాష్ట్రాల్లో జరుపుకునే ‘అట్ల తదియ’ లాంటిదే ఈ పండుగ కూడా. నేడు కర్వాచౌత్‌ సందర్భంగా ఈ పండుగ విశేషాలు, జరుపుకునే పద్ధతిని తెలుసుకుందాం.

‘కర్వా’ అంటే మట్టి పాత్ర, ‘చౌత్‌’ అంటే నాలుగో రోజు (చతుర్థి). ఈ పూజలో మట్టి కుండకు చాలా ్రపాధాన్యత ఉంటుంది. పూర్వకాలంలో యుద్ధాలకు వెళ్లే భర్తల రక్షణ కోసం భార్యలు ఈ వ్రతం చేయడం మొదలుపెట్టారని అంటారు. ఈ రోజు శివ పార్వతులను, వారి తనయుడు వినాయకుడిని పూజిస్తారు. ఈ వ్రతం చేయడం వల్ల కాపురం సంతోషంగా సాగుతుందని, దంపతుల బంధం గట్టిపడుతుందని నమ్ముతారు.

ఎలా జరుపుకుంటారు?
సర్‌గీ (ఉదయం ఆచారం): పండుగ రోజు తెల్లవారుజామున సూర్యుడు రాకముందే అత్తగారు కోడలికి ‘సర్‌గీ’ ఇస్తారు. ఇందులో పండ్లు, స్వీట్లు, ఎండుపండ్లు, కొత్త బట్టలు ఉంటాయి. కోడలు వీటిని తిని ఉపవాసం ఆరంభిస్తుంది. పొద్దున మొదలైన ఈ ఉపవాసం రాత్రి చంద్రుడు వచ్చేవరకు సాగుతుంది. అంతసేపూ అసలు నీళ్లు కూడా తాగరు. నవ వధువులా: ఈ రోజు మహిళలు కొత్త పెళ్లికూతురిలా తయారవుతారు. చేతులకు మెహందీ పెట్టుకుంటారు. ఎరుపు లేదా గులాబీ రంగు చీరలు, నగలు ధరిస్తారు.

సాయంత్రం పూజ 
సాయంత్రం స్త్రీలంతా ఒకచోట కూర్చుని పూజ చేస్తారు. మట్టి పాత్రను పూజలో పెట్టి, కర్వా చౌత్‌ కథ వింటారు. ఒకరికొకరు పూజ తాలిని మార్చుకుంటారు. చంద్రుడిని దర్శించుకోవటం: రాత్రి చందమామ రాగానే.. జల్లెడలోంచి మొదట చంద్రుడిని చూసి చందమామకు అర్ఘ్యం సమర్పిస్తారు. ఆ తర్వాత అదే జల్లెడలోంచి భర్త ముఖాన్ని చూస్తారు. భర్త చేతుల మీదుగా నీళ్లు తాగి, తీపి పదార్థాలను తినడంతో ఉపవాసం ముగుస్తుంది.

ప్రస్తుత కాలంలో..
ఇప్పుడు కాలం మారుతోంది. కేవలం భార్యలే కాదు.. చాలా మంది భర్తలు కూడా తమ భార్యల కోసం ఈ రోజు ఉపవాసం ఉంటున్నారు. ఒకరినొకరు గౌరవించుకుంటూ ప్రేమను చాటుకోవడానికి ఈ పండుగ ఒక మంచి వేదికగా నిలుస్తోంది.

మహాభారతంలోని కర్వా చౌత్‌ కథ 
పాండవులు వనవాసం చేస్తున్న సమయంలో ఒకసారి అర్జునుడు తపస్సు కోసం నీలగిరి పర్వతాలకు వెళ్తాడు. చాలా కాలమైనా అర్జునుడు తిరిగి రాకపోవడంతో ద్రౌపదికి ఎంతో ఆందోళన కలుగుతుంది. మిగిలిన నలుగురు అన్నదమ్ములూ అర్జునుడు లేకపోవడంతో నిరాశలో మునిగిపోతారు. అడవిలో తమకు ఎదురవుతున్న కష్టాల నుండి ఎలా బయటపడాలో తెలియక, భర్త క్షేమం కోసం ద్రౌపది తీవ్రమైన ఆవేదనకు లోనవుతుంది.

సరిగ్గా అదే సమయంలో వారిని పరామర్శించడానికి శ్రీ కృష్ణుడు పాండవుల ఆశ్రమానికి వస్తాడు. కృష్ణుడిని చూడగానే ద్రౌపది తన బాధనంతా చెప్పుకుంటుంది. ‘కృష్ణా! నా భర్తలు ఎన్నో కష్టాలు పడుతున్నారు. అర్జునుడు ఇంకా తిరిగి రాలేదు. మా కష్టాలన్నీ తీరి, నా భర్తలు ఆయురారోగ్యాలతో, విజయాలతో తిరిగి రావడానికి ఏదైనా మార్గం ఉంటే చెప్పవా’ అని వేడుకుంటుంది.

అప్పుడు శ్రీ కృష్ణుడు చిరునవ్వుతో.. ‘ద్రౌపదీ! ఆశ్వయుజ మాసంలో వచ్చే కృష్ణ పక్ష చతుర్థి నాడు నువ్వు కూడా ఏమీ తినకుండా, నీరు కూడా తాగకుండా కఠినమైన నిర్జల ఉపవాసం ఉండు. సాయంత్రం శివపార్వతులను పూజించి, రాత్రి చంద్రుడిని చూసిన తర్వాత ఉపవాసం విరమించు. ఈ వ్రతానికి ఉన్న శక్తి వల్ల నీ భర్తలకు వచ్చే ఎలాంటి ఆపదలైనా తొలగిపోతాయి. వారి ఆయుష్షు పెరుగుతుంది. మీ కష్టాలన్నీ తీరిపోయి, మీ రాజ్యం మీకు తిరిగి దక్కుతుంది.‘ అని ఉపదేశించాడు.

శ్రీకృష్ణుడు చెప్పిన మాటలపై పూర్తి నమ్మకంతో ద్రౌపది ఆశ్వయుజ చతుర్థి రోజున భక్తిశ్రద్ధలతో కర్వా చౌత్‌ వ్రతాన్ని ఆచరిస్తుంది. వ్రతం ముగిసిన కొద్ది రోజులకే అర్జునుడు తన తపస్సు ముగించుకుని సురక్షితంగా, విజయవంతంగా ఆశ్రమానికి తిరిగి వస్తాడు. ఆ తర్వాత పాండవులకు ఉన్న కష్టాలన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోతాయి.

మహాభారతంలోని ఈ కథ వల్లే.. కర్వా చౌత్‌ వ్రతం కేవలం భర్త ఆయుష్షు కోసమే కాకుండా, కుటుంబానికి వచ్చే పెద్ద పెద్ద కష్టాలను, ఆపదలను దూరం చేయడానికి కూడా ఎంతో శక్తివంతమైనదని మహిళలు నమ్ముతారు.

నిర్వహణ : డి.వి.ఆర్‌. భాస్కర్‌

ఇదీ చదవండి: 'సదా నామస్మరణం..' పెద్దలు చెప్పిన అద్భుతమైన నీతి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement