ఏఐ యుగంలో సైబర్‌ సెక్యూరిటీ సవాల్‌ | Sakshi Guest Column On Black October: Critical PHP flaws set off global security scramble | Sakshi
Sakshi News home page

ఏఐ యుగంలో సైబర్‌ సెక్యూరిటీ సవాల్‌

Oct 29 2026 1:02 AM | Updated on Oct 29 2026 1:02 AM

Sakshi Guest Column On Black October: Critical PHP flaws set off global security scramble

సైబర్‌ దాడులు అనేక దేశాల్లో ఆన్‌లైన్‌ సర్వీసులకు విఘాతం కలిగించాయి. వివిధ ఘటనల్లో బ్యాంకులు, బీమా కంపె నీలు, ప్రభుత్వ సర్వీసులు, విద్య, ఇతర ప్రజోపయోగ మార్గాలకు ఆటంకం ఏర్పడింది. ఒక జపాన్‌ ఆన్‌లైన్‌ ద్రవ్య సేవల సంస్థ తన విదేశీ మారకద్రవ్య ట్రేడింగ్‌ సర్వీసుపై జరిగిన సైబర్‌ దాడి వల్ల నష్టపోయిన కస్టమర్లకు పరిహారం కల్పించాలని నిర్ణయించింది. సిస్టంల మధ్య మరమ్మతులు చేసేందుకు అమెరికాలో పలు ప్రభుత్వ, ప్రైవేటు వెబ్‌సైట్లు తాత్కాలికంగా సేవలను విరమించాయి.

టెక్సాస్‌ కేంద్రంగా ఉన్న ఓ ప్రజోపయోగ కంపెనీ పది లక్షల మందికి పైగా పౌరుల డేటాకు గండిపడినట్లు పేర్కొంది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన సుమారు 4000 మంది ఖాతాదారుల డేటా రికార్డులు కూడా లీకయ్యాయి. పారిశ్రా మిక ఆమోదాలకు సంబంధించిన తెలంగాణ ప్రభుత్వ వెబ్‌సైట్‌ ఒకటి హ్యాక్‌ అయింది. సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు ఈ దాడుల విస్తృతిని చూసి, దీనికి ‘బ్లాక్‌ అక్టోబర్‌’ అని పేరు పెట్టారు. మరికొందరు తాత్కాలిక ప్రళయ దుర్బలత్వం అని అర్థం వచ్చే రీతిలో దీన్ని ‘వల్కోపలిప్స్‌’గా పిలుస్తున్నారు. 

లొసుగులు కనిపెట్టడం తేలిక
సాఫ్ట్‌వేర్‌లో లొసుగులను ఆధారం చేసుకుని హ్యాకర్లు దాడికి పాల్పడతారు. అటువంటి లోపాలను గుర్తించి వాటిని సరిదిద్దడం సెక్యూరిటీ నిపుణుల పని. అయితే, ఈ ప్రక్రియ తేలిక కాదు. దీనిలో ఆపరేటింగ్‌ సిస్టంలు, అప్లికేషన్లు, ఫర్మ్‌వేర్, క్లౌడ్,, డేటాబేస్‌ మేనేజ్‌ మెంట్, నెట్‌వర్కింగ్, ఎంటర్‌ప్రైజ్‌ ప్లానింగ్, సప్లై చైన్‌ వంటి రకరకాల సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రాములు ఇమిడి ఉంటాయి. అవి వివిధ సప్లయర్లు లేదా విక్రేతల నుంచి వచ్చినవై ఉండవచ్చు. అలాగే, ఆ లొసుగులు కూడా అనేక రకాలుగా ఉండవచ్చు. మెమొరీ సేఫ్టీ ఇష్యూలు, ఇంజెక్షన్‌ ఫ్లాలు, బ్రోకెన్‌ అథెంటికేషన్, క్రిప్టోగ్రాఫిక్‌ వైఫల్యాలు, డిపెండెన్సీ కన్‌ఫ్యూజన్‌ వంటివాటిని ఆ కోవకు చెంది నవిగా చెబుతారు. అటువంటి దుర్బలత్వం సిస్టంలో ఏ స్థాయిలో కనిపించినా హ్యాకర్‌ దాన్నివాడుకునే ప్రమాదం ఉంది. 

కానీ, ఏఐ ఇంజిన్లు, ఉపకరణాల రాకతో, హ్యాకింగ్‌ తీరులో మార్పు వచ్చింది. ఇంతకాలం, దుర్బలత్వం ఎక్కడుందో గుర్తించడం జటిలమైన పనిగా ఉండేది. అయితే, ఇపుడు జనరేటివ్‌ ఏఐ టూల్స్‌ సాయంతో ఎక్కడెక్కడ దుర్బలత్వాలున్నదీ తేలిగ్గా కనిపెట్టగలుగుతున్నారు. అక్టోబర్‌ నెలలో వరుసగా ఇన్ని దాడులు ఎలా జరిగాయో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. డైనమిక్‌ వెబ్‌ పీజీల సృష్టిలో ఉపయోగించే ఓపెన్‌–సోర్స్‌ స్క్రిప్టింగ్‌ లాంగ్వేజీని పీహెచ్‌పీ అంటారు. ఈ పీహెచ్‌పీతో ముడిపడిన లొసుగులే ప్రస్తుత దఫా దాడులకు కారణంగా భావిస్తున్నారు.

బగ్‌ల వేటను సునాయాసం చేసుకునేందుకు, హ్యాకింగ్‌కు కొత్త తరహా మాల్‌వేర్‌లను అభివృద్ధి చేసేందుకు హ్యాకర్లు ఏఐ ఇంజిన్లు, లార్జ్‌ లాంగ్వేజ్‌ మోడళ్ళ (ఎల్‌ఎల్‌ఎం)తో పనిచేస్తున్నారు. దాంతో బలహీనతలను గుర్తించేందుకు తోడ్పడే టూల్స్‌ను రూపొందించడంలో ఏఐ కంపెనీలు నిమగ్నమవుతున్నాయి. సైబర్‌ సెక్యూరిటీ మదింపునకు ఓపెన్‌ ఏఐ, ఆంత్రోపిక్‌ సంస్థలు అధునాతన జనరే టివ్‌ ఏఐ ఏజెంట్లను అభివృద్ధి చేస్తున్నాయి. ఏదేమైనా, ఏఐ రెండు వైపులా పదునున్న కత్తి. ఒక లొసుగుని ఏఐ ఏజెంట్‌ కనిపెట్టగలిగితే, సిస్టంను హ్యాక్‌ చేసేందుకు కూడా దాన్ని వినియోగించుకోగల అవకాశం ఉంది. 

రెండు కంపెనీలు ప్రయోగాత్మకంగా అభివృద్ధి చేసిన ఏజెంట్లు అదే పని చేశాయి. వాస్తవిక ప్రపంచంలో బాహ్య సిస్టంలపై అవి దాడి చేశాయి. తాను రూపొందించిన ఏజెంట్లలో ఒకటి సున్నితమైన సమాచారాన్ని గ్రహించిందనీ, కార్పొరోట్‌ ఉత్పత్తి డేటాను సేకరించిందనీ ఆంత్రోపిక్‌ ఈ ఏడాది మొదట్లో వెల్లడించింది. తాను ల్యాబొరేటరీలోకాక, లైవ్‌ ఇంటర్‌ నెట్‌లో పని చేస్తున్నట్లు తనకు తెలిసినప్పటికీ, ఆ చౌర్యాన్ని కొనసాగించినట్లు అది కుండబద్దలుకొట్టింది. 

ఇండియా పరిస్థితి సున్నితం
డిజిటల్‌ అసెట్లు, ఆన్‌లైన్‌ పబ్లిక్‌ సర్వీసులు అపారంగా ఉన్న ఇండియా ఈ పరిణామాలను గమనంలోకి తీసుకుని, ముందస్తు నిరోధక చర్యలను తీసుకోవాలి. మన దేశంలో ప్రభుత్వ ఏజెన్సీ ‘ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌’ (సి.ఇ.ఆర్‌.టి –ఇన్‌) సైబర్‌ సెక్యూరిటీని పర్యవేక్షిస్తోంది. పీహెచ్‌పీ దుర్బలత్వా లతో సహా ఇటీవలి పరిణామాలకు సంబంధించి అది పలు అడ్వైజరీలను జారీ చేసింది.

భారతీయ డిజిటల్‌ అసెట్లపై ఏఐ ఏజెంట్ల దాడిని గుర్తించినట్లు అది అంగీకరించడం మరింత ఆందో ళన రేకెత్తిస్తోంది. చిక్కు ఎక్కడ ఉందంటే, ఈ ఏజెంట్లు కుట్రకు అవే ప్రణాళికా రచన చేసుకోగలవనీ, కమాండ్లు జారీ చేయగలవనీ, టూల్స్‌ను నియోగించగలవనీ, వెబ్‌లో పనిచేసే కాలపరిమితులను పొడిగించుకోగలవనీ ఆ ప్రభుత్వ ఏజెన్సీ పేర్కొనడం. ‘పరిశోధన– మదింపు’లో ఉన్న ఏఐ ఏజెంట్లు ప్రమాదవశాత్తు విడుదలై భార తీయ అసెట్లను అనధికారికంగా గ్రహించగలిగాయి. భారతీయ సంస్థల లైవ్‌ వెబ్‌సైట్లపై జరిగిన ఈ దాడులు వ్యాపార రికార్డులు, వ్యక్తిగత డేటా లీకవడానికి కారణమయ్యాయి. వింత ఏమిటంటే, తమవద్దనున్న సమాచారానికి గండిపడినట్లు ఆ సంస్థలు కనిపెట్టలేక పోయాయి. ప్రభుత్వ ఏజెన్సీకి ఏఐ మోడల్‌ డెవలపర్లు ఉప్పందించిన తర్వాతే, అసలు సంగతి బయటపడింది.

చొరబడటానికి, దాడి అంతిమ ఫలితానికి మధ్యనున్న కాల వ్యవధి రోజుల నుంచి కొన్ని గంటలకు కుదించుకుపోయింది. ఏఐని ఆయుధంగా చేసుకున్న దాడుల్లో బహుళ ఏజెంట్ల సామర్థ్యం కూడా ఈ సందర్భంగా విశదమైంది. దాడికి గురైన సంస్థలు లోపాలను సరిదిద్దే చర్యలను తీసుకున్నాయికానీ, అవి అసంపూర్ణంగానే ఉన్నాయి. కొద్ది రోజుల వ్యవధిలోనే మరింత తీవ్రతతో వాటిపై దాడులు జరగడం బట్టి ఆ విరుగుడు చర్యలు ఏమాత్రం సరి పోలేదని తేలుతోంది. ఈ దాడులన్నింటిలోను, పక్కనపెట్టిన లేదా నిద్రాణంగా ఉన్న  అప్లికేషన్‌ ప్రోగ్రామింగ్‌ ఇంటర్‌ ఫేసుల వంటి సంప్రదాయ బలహీనతలనే ఏఐ ఏజెంట్లు లక్ష్యంగా చేసుకున్నాయి. మానవ హ్యాకర్ల కంటే వేగంగా, మరింత క్షుణ్ణంగా అవి తమ పని కానివ్వగలిగాయి. 

సంరక్షక చట్రం అవసరం
దాడికి గురైన సంస్థలు, వెబ్‌సైట్ల పేర్లను ప్రభుత్వ ఏజెన్సీ వెల్లడించకపోయినప్పటికీ, భారతీయ అసెట్లపై జరిగిన ఈ దాడులు తీవ్ర స్వభావం కలిగినవిగా కనిపిస్తున్నాయి. ఏ ఏఐ కంపెనీలకు చెందిన రౌడీ ఏజెంట్లు ఈ నిర్వాకానికి పాల్పడిందీ కూడా ప్రభుత్వ ఏజెన్సీ చెప్పలేదు. ఏఐ ఏజెంట్లను మదింపు చేసే పనిలో ఉన్న ఏఐ మోడల్‌ డెవలపర్లు, రిసెర్చ్‌ ల్యాబొరేటరీలు, ఏజెన్సీలకు సి.ఇ.ఆర్‌.టి–ఇన్‌ కొన్ని సాధారణ మార్గదర్శక సూత్రాలను మాత్రం జారీ చేసి ఊరుకుంది.

ఏజెంట్‌ కార్యకలాపాలను మరింత క్షుణ్ణంగా పరిశీలించవలసిందని, ఏ ఏజెంట్‌ అయినా, రియల్‌ సిస్టంలోకి చొర బడితే, చొరబాటుకు గురైన ఆ సంస్థలకు వెంటనే తెలియజేయ వలసిందని చెప్పింది. ప్రభుత్వం ఈ దాడులను తీవ్రమైనవిగానే పరిగణించాలి. జనరేటివ్‌ ఏఐ మోడళ్ళను పరీక్షిస్తున్న, వాటిని అభివృద్ధి చేస్తున్న కంపెనీలు ఒక సంరక్షక చట్రాన్ని కూడా రూపొందించేటట్లు చేయాలి. తమ పనుల కోసం ఏఐ ఏజెంట్లను వాడుకుంటున్న సంస్థలు ముఖ్యంగా, ఫినాన్షియల్‌ రంగంలోని కంపెనీలు ఆ రకమైన చట్రాన్ని రూపొందించాల్సిన అవసరం ఉంది. 

నిపుణులు హెచ్చరిస్తున్నట్లుగా బ్లాక్‌ అక్టోబర్‌ ఆరంభం మాత్రమే. రానున్న నెలల్లో ప్రపంచం మరిన్ని సైబర్‌ దాడులను చూడవలసి రావచ్చు. సైబర్‌ సెక్యూరిటీ పట్ల భారతీయ కంపెనీల, ప్రభుత్వ ప్రజోపయోగ సంస్థల సాధారణ ఉపేక్షా వైఖరిని దృష్టిలో పెట్టుకుని చూసినపుడు ప్రభుత్వ ఏజెన్సీ బయటపెట్టిన దాడుల
సంగతి మచ్చుకు మాత్రమే అనిపిస్తోంది. 
 

వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత
విశ్లేషణ: దినేశ్‌ సి. శర్మ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement