సౌదీ యువరాజు దార్శనికతకు పరీక్ష! | Sakshi Guest Column On Saudi Arabia Crown Prince Mohammed bin Salman | Sakshi
Sakshi News home page

సౌదీ యువరాజు దార్శనికతకు పరీక్ష!

Oct 23 2026 1:50 AM | Updated on Oct 23 2026 1:50 AM

Sakshi Guest Column On Saudi Arabia Crown Prince Mohammed bin Salman

విశ్లేషణ

సౌదీ అరేబియా గత పది సంవత్సరా లుగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘ఫ్యూచర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఇనీషియేటివ్‌’ (‘దావోస్‌ ఇన్‌ ద డెజర్ట్‌’) సదస్సు అక్టోబర్‌ 26–29 తేదీలో జరగాల్సి ఉంది. అయితే, హవుతీ దాడుల నేపథ్యంలో ఆ సదస్సును వచ్చే ఏడాదికి వాయిదా వేయటం సౌదీ అరేబియా సంకట స్థితికి అద్దం పడుతున్నది. సౌదీలో భద్రతను, పెట్టుబడిదారుల విశ్వసనీయతను దెబ్బతీయటంలో హవుతీలు కృత కృత్యులైనట్లుగా కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో సౌదీ యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ గత దశాబ్దం నుండి అమలు పరుస్తున్న ‘విజనరీ ప్లాన్‌’ భవిష్యత్తు ఏమిటనే విషయాన్ని విశ్లేషించటం సందర్భోచితం. 

అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యం
2016 నుండి సౌదీ యువరాజు సల్మాన్‌ చమురు ఆధారిత సౌదీ ఆర్థిక వ్యవస్థను పర్యాటక రంగం, వినోదం, క్రీడలు, భవన నిర్మాణ రంగాల వైపు మళ్లించటానికి బృహత్ప్రణాళికను అమలు పరుస్తు న్నారు. 2017లో 1.5 ట్రిలియన్‌ డాలర్ల పెట్టుబడి అంచనాతో ఎర్ర సముద్ర తీరంలోని తాబుక్‌ ప్రావిన్స్‌లో నిర్మిస్తున్న ‘నియోమ్‌’ ప్రాజెక్టు సౌదీ యువరాజు దార్శనికతకు నిదర్శనం. రాజకీయ కోణంలో కూడా సౌదీ యువరాజు తనదైన వ్యూహాన్ని అమలు పరుస్తున్నారు. భద్రత విషయంలో కేవలం అమెరికా పైనే ఆధార పడకుండా రష్యా, చైనాలతో కూడా సత్సంబంధాలకు దారులు వేయటానికి ప్రయత్నించారు. భౌగోళికంగా, రాజకీయంగా పర్షి యన్‌ సింధు శాఖ, మిడిల్‌ ఈస్ట్‌ ప్రాంతంలో సౌదీ అరేబియాను ప్రాంతీయ శక్తిగా నిలబెట్టటానికి యువరాజు పావులు కదిపారు. 

సౌదీ ఆర్థిక, రాజకీయ వ్యూహాలకు అమెరికా ఆది నుండే కేంద్రంగా ఉన్నది. చౌకగా సౌదీ అందించే చమురుకు ప్రత్యామ్నా యంగా అమెరికా భద్రతా హామీలను అందించింది. సౌదీకి అత్యా ధునిక యుద్ధ విమానాలు, పేట్రియాట్‌ క్షిపణి రక్షణ వ్యవస్థలు, క్షిపణులు, ఆయుధాలు సమకూర్చటంతో పాటుగా, మిలిటరీ బేస్‌ లను నిర్వహిస్తున్నది. సెప్టెంబర్‌ 11 దాడులలో సౌదీ పౌరుల పాత్రతో సౌదీ–అమెరికా సంబంధాలలో మొట్టమొదటి ప్రతిబంధకం ఎదురైంది. 2018లో జమాల్‌ కషోగి హత్య విషయంలో అమెరికా–సౌదీల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సౌదీ అరేబియాను ఉత్తర కొరియా, ఇరాన్‌ వంటి దేశాల మాదిరిగా ‘పరయా’ (వెలివేసిన) రాజ్యంగా ప్రకటించారు. ట్రంప్‌ రెండవసారి అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత మళ్లీ సౌదీ–అమెరికా సంబంధాలు గాడిన పడ్డాయి. సౌదీ అరేబియాకు నాన్‌–నాటో మిత్రుడి హోదా ఇవ్వటానికి కూడా అంగీకారం కుదిరింది. కానీ ఇజ్రాయిల్‌తో సంబంధాల విషయంలో రాజీ పడటానికి సౌదీ యువరాజు ససేమిరా అన్నారు. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్, బెహ్రెయిన్‌ వంటి గల్ఫ్‌ దేశాలు అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయిల్‌తో సంబంధాలను ఏర్పరచుకున్నాయి. కానీ సౌదీ యువరాజు పాలస్తీనా దేశం ఏర్పాటు చేయకుండా ఇజ్రాయిల్‌తో సంబంధాలను అంగీకరించటం లేదు. 

తారస్థాయికి హవుతీ దాడులు
మధ్యప్రాచ్యంలో ఇరాన్‌ పెత్తనానికి చెక్‌ పెట్టటానికి 1981లో సౌదీ అరేబియా ‘గల్ఫ్‌ కోపరేషన్‌ కౌన్సిల్‌’ను స్థాపించింది. బెహ్రె యిన్, కువైట్‌లతో సౌదీకి సుస్థిర సంబంధాలున్నాయి. సౌదీ– యు.ఎ.ఇ. లకు మాత్రం అనేక విషయాలలో పొసగటం లేదు. ఆర్థిక, వాణిజ్య, రాజకీయ అంశాలలో ఈ రెండు దేశాలూ పోటీ పడుతున్నాయి. ఇక యెమెన్‌లో యు.ఎ.ఇ. జోక్యాన్ని సౌదీ ఏమాత్రం సహించలేదు. 2016 ఏప్రిల్‌లో యు.ఎ.ఇ. ఒపెక్‌ నుండి వైదొలగింది. యు.ఎ.ఇ. నుండి దిగుమతి అయ్యే వస్తువులపై సౌదీ, సుంకాలను విధించటం మొదలుపెట్టింది. యు.ఎ.ఇ. పై ఆధార పడటం తగ్గించుకోవటానికి సౌదీ ఎర్ర సముద్రపు పోర్టులను అభి వృద్ధి చేసుకుంటున్నది. ఎర్ర సముద్రం, బాబెల్‌ మాండెబ్‌ జలసంధికి ఉన్న 1,300 మైళ్ల భూ సరిహద్దు నేపథ్యంలో సౌదీ అరేబియా యెమెన్‌ను వ్యూహాత్మకంగా తన జాగీరుగా భావిస్తున్నది. తొలి సారిగా 2015లో హవుతీలను పారద్రోలటానికి సౌదీ సైనిక చర్యను ప్రారంభించింది. ఇందులో భాగంగా హవుతీలను దిగ్బంధనం చేసింది. 2022లో ఒమన్‌ మధ్యవర్తిత్వం, యు.ఎన్‌. చొరవతో కాల్పుల విరమణ, దిగ్బంధన సడలింపు ఒప్పందాలు కుదిరాయి. గాజా యుద్ధం నేపథ్యంలో హవుతీలు సౌదీపై దాడులు ఆపివేశారు. యు.ఎ.ఇ. కూడా యెమెన్‌ నుండి దూరంగా జరిగింది. అయితే ఖమేనీ అంత్యక్రియలకు హాజరై ఇరాన్‌ నుండి తిరిగి వస్తున్న హవుతీ నాయకత్వ బృందపు ఇరానియన్‌ విమానాన్ని సనాలో ల్యాండ్‌ అవకుండా సనా ఎయిర్‌పోర్ట్‌ను సౌదీ బాంబింగ్‌ చేయటంతో మొత్తం కథ మొదటికొచ్చింది. సౌదీ యువరాజు తీసుకున్న ఈ నిర్ణయం విశ్లేషకులను విస్మయానికి గురి చేసింది. 2026 జూలైలో సౌదీపై తిరిగి ప్రారంభమైన హవుతీ దాడులు అక్టోబర్‌లో తార స్థాయికి చేరాయి. రియాద్, అభా ఎయిర్‌పోర్టులు, అరామ్‌కో చమురు శుద్ధి కర్మాగారం, యాన్బూ పోర్టులతో సహా సౌదీలోని అన్ని ముఖ్యమైన లక్ష్యాలపై హవుతీలు తీవ్ర దాడులు చేశారు. 

ప్రత్యామ్నాయ మిత్రుల అన్వేషణ
హవుతీ దాడులు సౌదీ ప్రతిష్ట, హోదా, జియోపొలిటికల్‌ వ్యూహానికి అతి పెద్ద సవాలు అనటంలో సందేహం లేదు. అమె రికాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవటానికి మక్కా ఒప్పందం రూపంలో సౌదీ టర్కీ, పాకిస్థాన్‌లతో చేతులు కలిపినా, ఈ వ్యూహం సత్ఫలితాలను ఇచ్చే అవకాశాలు మృగ్యం. అంతర్గత ఘర్షణలు, భారత్‌తో వివాదం నేపథ్యంలో పాకిస్థాన్‌ తన సైనికు లను యెమెన్‌కు పంపించే అవకాశాలు చాలా తక్కువ. టర్కీ ఆయుధ సహాయం చేయగలదు కానీ, సైనికులను పంపలేదు. ఈ వాస్తవాన్ని గ్రహించిన సౌదీ యువరాజు ఈజిప్టు సహాయం కోరారు. ఈజిప్టు పార్లమెంటు వచ్చేవారం దీనిపై నిర్ణయం తీసుకోనున్నది. ఇరాన్‌కు వ్యతిరేకంగా ఇంకో ముస్లిం దేశం యెమెన్‌ యుద్ధంలో సౌదీకి బాసటగా నిలుస్తుందా అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. అలా జరిగితే ముస్లిం దేశాలు నిట్టనిలువుగా రెండు కూటములుగా చీలిపోవచ్చు. ఇది ప్రపంచ ముస్లిం సమాజానికి, ప్రపంచ శాంతికి చెడు వార్త అవుతుంది. అమెరికా నుండి రక్షణ సహాయం అందక పోవటంతో సౌదీ యువరాజు ప్రత్యామ్నాయంగా యు.కె. సహా యాన్ని కూడా అర్థించారు. డిఫెన్సివ్‌ దాడులకు సహాయం చేస్తానని యు.కె. ప్రకటించటం కంటి తుడుపు మాత్రమే. ఇప్పుడు సౌదీ యువరాజు ముందు రెండు మార్గాలున్నాయి. తక్షణం ఇరాన్‌తో సంధి చేసుకోవటం, దీర్ఘకాలంలో తన  సొంత రక్షణ వ్యవస్థలను, సైనిక బలాన్ని పెంపొందించుకోవటం.

గురజాల శ్రీనివాసరావు
వ్యాసకర్త అడిషనల్‌ రిజిస్ట్రార్‌ (రిటైర్డ్‌);
సివిల్స్, గ్రూప్‌–1 పోటీ పరీక్షల నిపుణులు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement