టైమ్ మిషన్
ఒక కోడిగుడ్డును ఏ వైపు నుంచి పగలగొట్టాలి? ఈ చిన్న ప్రశ్న రెండు రాజ్యాల మధ్య యుద్ధానికి దారితీస్తే? వినడానికి విడ్డూరంగా ఉన్నా, ఆ ఆలోచనలోనే రాజకీయాలపై పదునైన వ్యంగ్యం దాగుంది. సరిగ్గా 300 ఏళ్ల కింద ఆంగ్లో–ఐరిష్ రచయిత జొనాథన్ స్విఫ్ట్ 1726 అక్టోబరు 28న ‘ట్రావెల్స్ ఇంటూ సెవెరల్ రిమోట్ నేషన్స్ ఆఫ్ ద వరల్డ్’ పేరుతో ఓ విస్మయం గొలిపే పుస్తకాన్ని ప్రచురించాడు. అదే తరువాత ‘గలివర్స్ ట్రావెల్స్’ పేరుతో ప్రసిద్ధి చెందింది. సమకాలీన ఇంగ్లండు రాజకీయాలపై చేసిన వ్యంగ్య రచన కాబట్టి ప్రభుత్వం నుంచి శిక్షను ఎదుర్కోవలసి రావచ్చనే ఉద్దేశంతో తన పేరును అజ్ఞాతంగానే ఉంచాడు స్విఫ్ట్. మొదటి ముద్రణకు మంచి ఆదరణ రావడంతో తానే రాశానని ప్రకటించుకున్నాడు.
ఓడ సర్జన్ , కెప్టెన్ అయిన లెమ్యుయెల్ గలివర్ తాను చేసిన నాలుగు ప్రయాణాల గురించి చెప్పే కథ ఇది. మొదటి ప్రయాణంలో లిల్లీపుట్ అనే దీవికి చేరిన గలివర్ అక్కడ ఆరు అంగుళాల ఎత్తున్న మనుషులను చూస్తాడు. చెప్పుల మడమల ఎత్తును బట్టి రాజకీయ వర్గాలు ఏర్పడతాయి. తాడుపై డ్యాన్స్ చేసిన వారికి ప్రభుత్వ పదవులు దక్కుతాయి. కోడిగుడ్డును వెడల్పైన చివర నుంచి పగలగొట్టాలా, చిన్న చివర నుంచి పగలగొట్టాలా అన్న వివాదం పొరుగున ఉన్న బ్లెఫుస్కు రాజ్యంతో యుద్ధానికి దారి తీస్తుంది. ఈ యుద్ధంలో లిల్లీపుట్‌ల శత్రు నౌకలను గలివర్ పట్టుకున్నా, ఆ దేశాన్ని పూర్తిగా లొంగదీసుకోవడానికి నిరాకరిస్తాడు. రాజభవనంలో అగ్ని ప్రమాదాన్ని తన మూత్రంతో ఆర్పినందుకు రాజు అతడిపై ఆగ్రహిస్తాడు.
రెండో ప్రయాణంలో గలివర్ బ్రోబ్డింగ్‌నాగ్ అనే భారీ మనుషుల దేశానికి వెళతాడు. అక్కడ అతడే చిన్న ప్రాణి. ఒక రైతు అతడిని ప్రదర్శన వస్తువుగా చూపించి డబ్బు సంపాదిస్తాడు. తరువాత రాణి గలివర్‌ను కొనుగోలు చేసి రాజప్రాసాదంలో ఉంచుతుంది. ఇంగ్లండ్ పాలన, యుద్ధ విజయాల గురించి గలివర్ గొప్పగా చెప్పుకున్నప్పుడు ఆ దేశపు రాజు విస్తుపోతాడు. మనుషులు భూమిపై పాకే అసహ్యకరమైన చిన్న పురుగుల్లాంటి వారని వ్యాఖ్యానిస్తాడు. విధ్వంసక ఆయుధాల తయారీ గురించి గలివర్ వివరించి తాను వాటిని తయారు చేసి ఇస్తానని చెప్పినప్పుడు... వాటిని ఉపయోగించాలన్న ఆలోచనకే రాజు దిగ్భ్రాంతి చెందుతాడు. తన దేశం గొప్పదనంపై గలివర్‌కు ఉన్న భ్రమలు ఈ ప్రయాణంలో పటాపంచలవుతాయి.
వివేకవంతమైన గుర్రాలు
మూడో ప్రయాణంలో గలివర్ లాపుటా అనే గాలిలో తేలియాడే దీవిని సందర్శిస్తాడు. అక్కడి శాస్త్రవేత్తలు విచిత్రమైన ప్రయోగాల్లో మునిగిపోతారు. దోసకాయల నుంచి సూర్యరశ్మిని వెలికితీయడం వంటి ఆలోచనలతో కాలం గడుపుతారు. ఆచరణకు దూరమైన పరిశోధనలు ప్రజల జీవితాలను మెరుగు పరచలేవని స్విఫ్ట్ ఈ ఘట్టాల ద్వారా చూపిస్తాడు. అమరత్వం పొందినవారికి కూడా వృద్ధాప్య బాధలు తప్పవని మరో సంఘ టన ద్వారా గుర్తుచేస్తాడు.
ఇదీ చదవండి: కలల ప్రపంచాన్ని కూల్చిన బ్లాక్ థర్స్‌డే
నాలుగో ప్రయాణంలో గలివర్‌కు హుయ్నుమ్లు అనే తెలివైన గుర్రాల సమాజం ఎదురవుతుంది. ఆ గుర్రాలు సత్యం, వివేకంతో జీవిస్తుంటే, యాహూలనే మనుషులను పోలిన ప్రాణులు అత్యాశ, క్రూరత్వంతో కనిపిస్తాయి. మానవుల యుద్ధాలు, మోసాల గురించి విన్న గుర్రాలకు మనుషులపై గౌరవం కలగదు. చివరకు గలివర్ కూడా తన మానవ జాతిని అసహ్యించుకునే స్థితికి చేరుకుంటాడు.
ఇదీ చదవండి: ఓ స్త్రీగా బతకడం కోసం..
రాజకీయ కుళ్లు, అధికార దాహం, సామ్రాజ్యవాదం, అహంకారం, ఆచరణలేని విజ్ఞానం... ఇలా సమాజంలోని అనేక లోపాలను స్విఫ్ట్ హాస్యం ముసుగులో ఎండగట్టాడు. ఈ నవల ఆధారంగా అనేక సినిమాలు కూడా వచ్చాయి. ఈ నవలలో వాడిన ‘యాహూ’ వంటి పదాలు ఇంగ్లీషు నిఘంటువుల్లో చేరాయి.
- ఎడిటోరియల్ టీమ్


