అతడు సముద్రాలను కొలిచేశాడు! | Time Machine: captain james cook voyages | Sakshi
Sakshi News home page

అతడు సముద్రాలను కొలిచేశాడు!

Aug 26 2026 7:27 PM | Updated on Aug 26 2026 7:53 PM

Time Machine: captain james cook voyages

1768లో కెప్టెన్‌ జేమ్స్‌ కుక్‌ బయలుదేరిన ఎండీవర్‌ నౌక

టైమ్‌ మిషన్‌

1768 ఆగస్టులో ఇంగ్లాండ్‌ నుంచి ఎండీవర్‌ అనే చిన్న నౌక సముద్రంలోకి బయలుదేరింది. దానికి నాయకత్వం వహించిన కెప్టెన్‌ జేమ్స్‌ కుక్‌కు సముద్రాలను కొలవాలి, తెలియని భూభాగా లను పటాల్లో నమోదు చేయాలి.  

కుక్‌ 1728లో వ్యవసాయ కూలీ కుటుంబంలో జన్మించాడు. చిన్న వయసులోనే వ్యాపార నౌకల్లో పనిచేస్తూ సముద్ర ప్రయాణం నేర్చుకున్నాడు. బ్రిటిష్‌ నౌకాదళంలో చేరి కెనడాలోని సెయింట్‌ లారెన్స్‌ నది, న్యూఫౌండ్‌లాండ్‌ తీరాన్ని సర్వే చేయడం ద్వారా మ్యాపుల తయారీలో నైపుణ్యాన్ని చాటాడు. 18వ శతాబ్దంలో భూమి నుంచి సూర్యుడి దూరం ఎంత అనే ప్రశ్న ఖగోళ శాస్త్రవేత్తలను వేధించేది. 1769లో జరిగే వీనస్‌ ట్రాన్సిట్‌ను ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి పరిశీలించడం ద్వారా ఈ దూరాన్ని అంచనా వేయాలని భావించారు. అందుకే ఎండీవర్‌లో శాస్త్రీయ పరికరాలతో ఖగోళ శాస్త్రవేత్తలూ బయలుదేరారు. యువ ప్రకృతి శాస్త్రవేత్త జోసెఫ్‌ బ్యాంక్స్, స్వీడిష్‌ వృక్షశాస్త్రవేత్త డానియల్‌ సోలాండర్‌ కూడా ఈ యాత్రలో భాగం అయ్యారు.

ఎండీవర్‌ యాత్ర అధికారికంగా తాహితీలో శుక్రగ్రహం సూర్యుడి ముందు నుంచి దాటుతున్నట్లు కనిపించే వీనస్‌ ట్రాన్సిట్‌ను పరిశీలించడానికి బయలుదేరింది. కానీ కుక్‌కు మరో రహస్య ఆదేశం కూడా ఉంది: తెలియని దక్షిణ భూభాగం– టెర్రా ఆస్ట్రాలిస్ ఇన్‌ కాగ్నిటా– ఉందా లేదా పరిశీలించాలి; కనిపిస్తే బ్రిటన్‌ తరఫున దానిపై హక్కు ప్రకటించే అవకాశాన్ని పరిశీలించాలి. ఫలితంగా రాయల్‌ సొసైటీ పరిశోధన, బ్రిటిష్‌ అడ్మిరాల్టీ వ్యూహం ఒకే నౌకలో ప్రయాణించాయి.

1769 జూన్‌ 3న తాహితీలో అంతరిక్షంలో వీనస్‌ ట్రాన్సిట్‌ను పరిశీలించారు. తరువాత కుక్‌ న్యూజిలాండ్‌కు చేరుకుని దాని తీరప్రాంతాన్ని శాస్త్రీయంగా సర్వే చేశాడు. న్యూజిలాండ్‌ ఒక భారీ దక్షిణ ఖండంలో భాగం కాదని స్పష్టం చేయడంలో అతని మ్యాపులు కీలకమయ్యాయి. 1770 నాటికి కుక్‌ ఆస్ట్రేలియా తూర్పు తీరానికి చేరుకుని దానిని మ్యాపుల్లో నమోదు చేశాడు. బోటనీ బేలో బ్యాంక్స్, సోలాండర్‌ వివిధ మొక్కల నమూనాలను సేకరించారు. గ్రేట్‌ బ్యారియర్‌ రీఫ్‌ వద్ద ఎండీవర్‌ ప్రమాదంలో పడినా నౌకను మరమ్మతు చేసి ప్రయాణాన్ని కొనసాగించారు. తుదకు 1771లో ఇంగ్లాండ్‌కు తిరిగి చేరుకున్నారు.

కుక్‌ ఆస్ట్రేలియాను కనిపెట్టలేదు!
అయితే కుక్‌ ఆస్ట్రేలియాను ‘కనుగొన్నాడు’ అని చెప్పడం తప్పుదారి పట్టించే మాట. ఆ ఖండంలో వేల సంవత్సరాలుగా ఆదివాసీ సమాజాలు నివసిస్తున్నాయి. కుక్‌ చేసింది కేవలం ఆస్ట్రేలియా తూర్పు తీరాన్ని... యూరోపియన్‌  నౌకాయానాన్ని సులభతరం చేస్తూ ఓ పద్ధతి ప్రకారం మ్యాప్‌ చేయడం, బ్రిటిష్‌ సింహాసనం తరఫున హక్కు ప్రకటించడం మాత్రమే.

ఇదీ చ‌ద‌వండి: జ‌పాన్ అణ్వ‌స్త్ర డైల‌మా

బ్యాంక్స్, సోలాండర్‌ సేకరించిన మొక్కల నమూనాలు యూరోపియన్‌  శాస్త్ర ప్రపంచానికి కొత్త ప్రకృతి వైవిధ్యాన్ని పరిచయం చేశాయి. ఆ కాలంలో సముద్రంపై పయనించే యాత్రికులు స్కర్వీ వ్యాధితో చనిపోతూ ఉండేవారు. కుక్‌ యాత్రలో స్కర్వీ నివారణకు తగిన చర్యలు తీసుకున్నారు. ఆహారంపై శ్రద్ధ పెట్టారు. అతడి సముద్రయానం సముద్ర నావిగేషన్‌ను మరింత కచ్చితంగా చేసింది. అదే సమయంలో సైన్స్, మ్యాపింగ్, అన్వేషణలు సామ్రాజ్య విస్తరణకు కూడా ఉపయోగపడ్డాయి.

అందుకే కుక్‌ను దేవుడిలా పొగడటం సరైంది కాదు, అలాగే  అతడిని కేవలం వలసవాద ప్రతినిధిగా కొట్టిపారేయడం కూడా సరికాదు. అతను తన కాలంలోని సైన్స్, నౌకాయానం, సామ్రాజ్యవాద రాజకీయాలు కలిసిన ప్రపంచానికి ప్రతినిధి. శాస్త్రం, సాంకేతికత, పరిశీలన, పటాల తయారీ, వివిధ రంగాల నిపుణుల సహకారం కలిసినప్పుడే ఒక యాత్ర విజ్ఞానయుతంగా మారుతుంది అని కుక్‌ ప్రయాణం నిరూపించింది. ఆనాడు కుక్‌ తన బృందంలో వివిధ రంగాల నిపుణులను చేర్చుకున్న పద్ధతినే ఇప్పుడు అంతరిక్ష యాత్రలకు వెళ్లే బృందాల్లోనూ అనుసరించడం గమనార్హం. 

ఎడిటోరియల్ టీమ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement