రాయల్‌గా సంబరాలు | RCB’s Historic IPL 2026 Triumph Sparks Massive Hotel Celebrations As Players Revel In Back To Back Glory | Sakshi
Sakshi News home page

IPL 2026 RCB: రాయల్‌గా సంబరాలు

Jun 2 2026 5:49 AM | Updated on Jun 2 2026 8:32 AM

RCB Players Celebrate IPL 2026 Victory In Hotel

ఆర్‌సీబీ ఆటగాళ్ల విజయోత్సవం 

డ్యాన్స్‌లతో హోరెత్తించిన కోహ్లి 

అహ్మదాబాద్‌: ‘వన్‌ ఫెల్ట్‌ నైస్‌... వి డిడ్‌ ఇట్‌ ట్వైస్‌’... ఒక్క విజయం ఎంతో బాగు... రెండో విజయం బహు బాగు’ అంటూ ప్రత్యేకంగా సిద్ధం చేసిన టీ షర్ట్‌పై వ్యాఖ్య రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) గెలుపు సంబరాలకు చిరునామాగా నిలిచింది. కోహ్లి సిక్సర్‌తో వరుసగా రెండో ఐపీఎల్‌ ట్రోఫీ ఖాయం కాగానే స్టేడియంలో మొదలైన వేడుకలు రాత్రంతా నిర్విరామంగా సాగాయి. 

ముందుగా మైదానంలో విజయోత్సవ వేడుకల్లో ఆటగాళ్లంతా భాగమయ్యారు. ఆ తర్వాత ఈ ఆనందం హోటల్‌ వరకు చేరింది. అక్కడ ఢోల్‌ బాజాలతో జట్టుకు ఘనమైన స్వాగతం లభించింది. ముందుగా కెప్టెన్‌ పాటీదార్‌ తన డ్యాన్స్‌తో ఇన్నింగ్స్‌ మొదలు పెట్టగా... ఆ తర్వాత కోహ్లి, కృనాల్‌ పాండ్యా బల్లే బల్లే అంటూ జత కలిశారు. రసిఖ్‌ సలామ్‌ తదితర కుర్రాళ్ల బృందం చేసిన హంగామాతో ప్రాంగణమంతా మారుమోగిపోయింది. ఆ తర్వాత హోటల్‌లో అసలు పార్టీ మొదలైంది.

 జట్టు విజయోత్సవంలో అంతా పాల్గొని తెల్లవారే వరకు నిర్విరామంగా సంబరాలు చేసుకున్నారు. ముఖ్యంగా కోహ్లి, అనుష్క శర్మ కలిసి చేసిన డ్యాన్స్‌ ఈ మొత్తం ప్రోగ్రామ్‌కే హైలైట్‌గా నిలిచింది. జట్టు మెంటార్‌ దినేశ్‌ కార్తీక్‌ కూడా కోహ్లితో జత కట్టి ‘నాటు నాటు’ స్టెప్పులేశాడు. సోమవారం పుట్టిన రోజు జరుపుకున్న రజత్‌ పాటీదార్, దినేశ్‌ కార్తీక్‌లతో పాటు ఫిల్‌ సాల్ట్‌ ఏడాది బాబుకు కూడా కలిపి ముగ్గురి బర్త్‌డే వేడుకలు కూడా ఇదే వేదికపై నిర్వహించారు. మరోవైపు ఫైనల్లో ఓటమి తర్వాత గుజరాత్‌ టైటాన్స్‌ అనూహ్య ఘటనలో బాధితులయ్యారు. మ్యాచ్‌ ముగిశాక హోటల్‌కు వెళుతుండగా టీమ్‌ బస్సును దారి మధ్యలో నిలిపి వేయాల్సి వచ్చింది. షార్ట్‌ సర్క్యూట్‌తో బస్సు ఆగిపోవడంతో ఆటగాళ్లందరినీ కిందకు దించేశారు. ఆ తర్వాత మరో బస్సు లో గుజరాత్‌  ప్లేయర్లు హోటల్‌కు చేరుకున్నారు.  

విన్నింగ్‌ షాట్‌ కల తీరింది: కోహ్లి  
విరాట్‌ కోహ్లి తన అత్యద్భుత కెరీర్‌లో ఎన్నో గొప్ప విజయాలందించాడు. ఛేదనలో చివరి వరకు నిలిచి మరెన్నో మ్యాచ్‌లలో భారత జట్టును లక్ష్యానికి చేర్చాడు. కానీ ఐపీఎల్‌లో కూడా అలాగే గెలిపించాలని చాలాసార్లు కోరుకున్నాడు. చివరకు ఇప్పుడు అది జరిగిందని కోహ్లి సంతోషాన్ని ప్రదర్శించాడు. 2025లోనే ఆర్‌సీబీ టైటిల్‌ నెగ్గినా... నాడు జట్టు ముందుగా బ్యాటింగ్‌ చేసింది. ఆదివారం కూడా విజయానికి 11 పరుగుల దూరంలో కోహ్లి అవుటైనట్లు కనిపించినా... చివరకు రీప్లేలో నాటౌట్‌గా తేలాడు. ‘ఐపీఎల్‌లో విన్నింగ్‌ షాట్‌ కొట్టాలనేది నా కల. దీని గురించి నిజంగా చాలాసార్లు ఆలోచించాను.

 ఎట్టకేలకు ఈ రోజు సాధ్యమైంది. ఛేదనలో ఏం చేయాలో నాకు సరిగ్గా తెలుసు. ఈతరం కుర్రాళ్ల జోరులో మరింత సాహసంతో ఆడాలనే విధంగా నా ఆలోచనా శైలి మారింది. అందుకే వేగవంతమైన అర్ధసెంచరీ సాధించగలిగా. పవర్‌ప్లేలోనే గెలుపు ఖాయం కావాలని వెంకటేశ్‌ అయ్యర్‌కు చెప్పాను. ఫ్యాన్స్‌కు మాకు అండగా నిలిచిన తీరు చూస్తే 7 కాదు 14 హోం మ్యాచ్‌లు ఆడినట్లుగా అనిపించింది. ఫైనల్లో కూడా వేదిక ప్రత్యర్థి జట్టుదే అయినా 90 శాతం ఫ్యాన్స్‌ మాకు మద్దతిచ్చారు’ అని కోహ్లి వ్యాఖ్యానించాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement