కష్టాల కావడి మోస్తున్న కౌలురైతు | Sakshi Guest Column On Tenant farmers Issues | Sakshi
Sakshi News home page

కష్టాల కావడి మోస్తున్న కౌలురైతు

Aug 26 2026 12:34 AM | Updated on Aug 26 2026 12:34 AM

Sakshi Guest Column On Tenant farmers Issues

అభిప్రాయం

రెండు తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయాన్ని బతికిస్తున్న కౌలురైతుల బతుకులు దుర్భరమవుతున్నాయి. సొంతగా భూమి సాగుచేసే రైతు కన్నా ఇతరుల భూమి కౌలుకు తీసుకొని సాగుచేస్తున్న రైతు మరిన్ని కష్టాల్లో కూరుకుపోతున్నాడు. ప్రభుత్వ పథకాలు, విత్తన–ఎరువుల సబ్సిడీలు, బ్యాంకు రుణాలు, నష్టపరిహారాలు, రుణమాఫీలు, మద్దతు ధర, బోనస్‌.... ఇటువంటివేవీ నేరుగా కౌలురైతులకు అందటం లేదు. ఎన్నికల హామీలతో ఊదరగొట్టి గద్దెనెక్కిన పార్టీలు, కౌలు రైతాంగానికిచ్చిన మాట తప్పిన ఫలితమే ఈ దుఃస్థితి!

పెద్ద ఎత్తున ప్రజాధనం వెచ్చించి వ్యవసాయానికి మద్దతుగా నిర్వహిస్తున్న ప్రభుత్వ వివిధ పథకాల లబ్ధి కౌలురైతులకు అందడం లేదు. నిజానికి క్షేత్రంలో ఉండి, పెట్టుబడి పెట్టి, పరి స్థితుల్ని ఎదుర్కొని సాగుచేసేది కౌలు రైతు. కానీ, వారిని గుర్తించి, ఆ మేరకు ప్రయోజనాలు కల్పించడానికి ప్రభుత్వాలు జంకుతున్నాయి. తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి! 

అన్ని బాధలూ వారివే! 
సర్కారు లెక్కల ప్రకారం తెలంగాణలో కోటిన్నర ఎకరాల వ్యవసాయ భూమి సాగులో ఉంది. చిన్న, మధ్యతరహా, పెద్ద...అంతా కలిపి సుమారు 70 లక్షల మంది రైతులుగా నమోదై పట్టాదారు పాస్‌ పుస్తకాలు పొంది ఉన్నారు. వారంతా రైతు భరోసా (ఇదివరకటి రైతుబంధు) లబ్ధిదారులు. అందులోనే కొందరు, తమ భూమికి తోడు ఇతరుల భూమి తీసుకొని కౌలు చేస్తున్నారు. మరికొందరు, సొంత భూమే లేకున్నా ఇతరుల భూమి కౌలుకు చేస్తున్నారు. తెలంగాణలో 36 శాతం మంది కౌలురైతులున్నట్టు 2022లో ‘రైతు స్వరాజ్య వేదిక’ (ఆరెస్వీ) జరిపిన సర్వే లెక్కలు చెబుతున్నాయి. సబ్సిడీ విత్తనాలు, సబ్సిడీ ఎరువులు, పంట రుణాలు, రుణమాఫీ లబ్ధి, రైతు భరోసా, పంట బీమా/పంట నష్ట పరిహారం, మద్దతు ధర, అదనపు బోనస్‌... ఇటువంటి ప్రయో జనం ఏదీ నేరుగా కౌలురైతుకు అందటం లేదు. ప్రభుత్వం, అనుబంధ విభాగాలు వ్యవసాయ రంగంలో ఆధు నిక సాంకేతికతను వినియోగించడం మొదలెట్టాక ‘యాప్‌’లతో భూయజమానుల మొబైల్, పాస్‌పుస్తకాలు లింక్‌ చేయడం, ‘ఓటీపీ’లు వారికే రావడం, ఎరువుల సమాచారమైనా, ధాన్యం విక్రయ వివరాలైనా నేరుగా వారి మొబైల్‌కు, బ్యాంకు ఖాతాలకే చేరుతోంది. కౌలు డబ్బు, పెట్టుబడి వ్యయం పెరిగి, మద్దతు ధర కూడా లభించక కౌలురైతు రెండింతలు నష్టపోతున్నాడు. ప్రభుత్వ సహాయమూ అందక మూడు రకాల భారం మోయాల్సివస్తోంది.

కష్టాన్ని కళ్లకు కడుతున్న సర్వేలు
తెలంగాణ గ్రామీణ జనాభాలో దాదాపు సగం మందికి సెంటు భూమి కూడా లేదు. ముఖ్యంగా వెనుకబడిన, దళిత, మైనారిటీ, గిరిజన వర్గాలవారిలో అత్యధికులకు భూమి లేదు, ఉన్నా ఒకటీ, అర ఎకరాలు మాత్రమే! ఇటీవల ‘కౌలురైతుల గుర్తింపు సాధన కమిటి’ వారు కూడా తెలంగాణలో సర్వే నిర్వహించారు. 22 జిల్లాలు, 47 మండలాలు, 57 గ్రామాల్లోని 1,836 మంది కౌలు రైతులను ‘ప్రాతినిధ్య నమూనా’లుగా ఎంపిక చేశారు. ప్రధానంగా వ్యక్తి గత ఇంటర్వ్యూ పద్ధతిలో సమాచారం రాబట్టారు. ఏపీలో ‘ఆంధ్రప్రదేశ్‌ కౌలురైతుల సంఘం’తో కలిసి ‘పీపుల్స్‌ పల్స్‌’ సర్వే నిర్వహించింది. మొత్తం 26 జిల్లాల్లో జిల్లాకు సగటున 100 నుంచి 125 ‘నమూనా’ల చొప్పున మొత్తం 3000 శాంపిల్స్‌తో నెల రోజుల పాటు ఈ సర్వే జరిగింది. కౌలురైతులకు ఏపీలో అరకొరగా గుర్తింపుకార్డు లిచ్చారు. 12.3 శాతం మంది తమకు లభించాయని చెబితే, కార్డు లేవీ అందలేదని 87.7 శాతం మంది వెల్లడించారు. 70 శాతం మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గాల వారే ఏపీలో కౌలురైతులు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, కూలీరేట్లు, యంత్రాల అద్దెలు అసాధారణంగా పెరిగాయని 67.2 శాతం రైతులు చెబితే, కౌలు డబ్బు/ధాన్యం పెరగటం వల్ల ఇబ్బందులని 12.5 శాతం మంది, గిట్టుబాటు ధరలు లేక కష్టాలు పెరిగాయిని 10.8 శాతం మంది, అధిక వడ్డీల ప్రయి వేటు అప్పుల భారమనీ, మార్కెట్‌ సమస్యలనీ మరో పది శాతం మంది చెప్పారు. కొన్ని చోట్ల కౌలు రేట్లు యేటా ఎకరాకు 53 వేల రూపాయల వరకు చేరాయని, సగటున 14,936గా చెల్లిస్తున్నామని తెలంగాణ కౌలురైతులు చెప్పారు. చిన్న కమతాల్లో కౌలు గిట్టుబాటు కాక ఎక్కువ ఎకరాల్లో కౌలు చేయాల్సి వస్తోందని, ఇదివరకు సగటున రైతుకు 5 ఎకరాలున్న కౌలుసాగు ఇప్పుడు 6.7 ఎకరాలకు పెరిగిందని వారంటున్నారు. 5కు పైగా ఎకరాలు కౌలుసాగు చేస్తున్న రైతుల సంఖ్య 31 నుంచి 42 శాతానికి పెరిగింది. 

మాట తప్పిన ‘రాజకీయాలు’
కౌలురైతులకు గుర్తింపు కార్డులిచ్చి, అన్ని సంక్షేమ పథకాలతో పాటు బీమాను వారికే వర్తింపజేస్తామని ఏపీలో తెలుగుదేశం నేతృత్వంలోని కూటమి ‘ప్రజాగళం’ పేరిట ప్రకటించిన ఎన్నికల మాని ఫెస్టోలో చెప్పింది. అధికారంలోకి వచ్చాక ఏడాదిలోపు కౌలు రైతు లకు ప్రత్యేకచట్టం తెస్తామన్న మాట కూడా గాలికిపోయింది. కూటమి భాగస్వామి, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ (జనసేన) ఎన్నికల ముందు ఉత్తర కోస్తా, మధ్య కోస్తా, రాయలసీమ... ఎక్కడి కక్కడ కౌలురైతుల సమావేశాలు పెట్టి, వారికి ఆర్థిక సహాయం అందించి నానా హడావుడి చేశారు. ఇప్పుడు కిమ్మనటం లేదు. తెలంగాణ ఏర్పడ్డాక పదేళ్లు పాలించిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కౌలురైతుల పట్ల కక్ష కట్టినట్టే వ్యవహరించింది. 2016 వరకు తెలంగాణలోని రెవెన్యూ రికార్డుల్లో ప్రతిసీజన్‌ భూయజమానితో పాటు వాస్తవ సాగులో ఉన్న (కౌలు రైతు) పేరు విడిగా నమోదు చేసే అవకాశం ఉండేది. అలా నమోదు కోసం ఉన్న సాగు కాలమ్‌ను 2017లో ఒక చట్ట సవరణ ద్వారా తొలగించింది. కౌలురైతుల్ని గుర్తించడానికి, వారికి గుర్తింపు కార్డుల ద్వారా ఎంతోకొంత ప్రయో జనం కల్పించడానికి వీలు కల్పించే ‘భూ అధీకృత సాగుదారుల చట్టం–2011’ అమలును 2015 నుంచి దాదాపు నిలిపివేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు, నాటి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ‘2023 సెప్టెంబర్‌’లో కౌలురైతు లకు బహిరంగ లేఖ రాస్తూ, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో కౌలు రైతులకు అన్యాయం జరిగిందనీ, తాము అధికారంలోకి రాగానే 2011 చట్టాన్ని అమలు చేయడమే కాకుండా అన్ని ప్రభుత్వ పథ కాలు వారికి వర్తించేలా చర్యలు తీసుకుంటామనీ పేర్కొన్నారు. గద్దెనెక్కి రెండున్నరేళ్లు దాటినా నేటికి అతీగతీ లేదు. ఏ రకంగా చూసినా కౌలురైతు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నష్టపోతున్నాడు. రెండింతల కష్టాల కావడి మోస్తున్నాడు.


దిలీప్‌ రెడ్డి
వ్యాసకర్త పొలిటికల్‌ ఎనలిస్ట్,
పీపుల్స్‌ పల్స్‌ రిసెర్చి సంస్థ డైరెక్టర్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement