అమెరికాలోని కాల్‌టెక్ (కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) విశ్వవిద్యాలయంలో 2026 బ్యాచ్ పట్టభద్రులను ఉద్దేశించి ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ప్రొఫెసర్ కిప్ థోర్న్ చేసిన స్నాతకోత్సవ ప్రసంగ సంక్షిప్త పాఠం:
విశ్వగురు
అభినందనలు. మీరు సాధించారు! మీలో చాలామంది ఎంతో ఉత్సాహంగా భవిష్యత్తులోకి అడుగు పెడుతున్నారు. కానీ కొందరి ప్రణాళికలు తాత్కాలికంగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. మీ నియంత్రణలో లేని పరిస్థితులు అందుకు కారణం కావచ్చు, ఉద్యోగ మార్కెట్‌లో వచ్చిన మార్పులు, టెక్నా లజీ వంటి పరిస్థితులు కొందరి ఆశలను దెబ్బతీసే ఆస్కారం ఉంది. మీ ఆశలు దెబ్బతిన్నట్లయితే... మీరు ప్రత్యామ్నాయ ప్రణాళికలు రూపొందించుకోవాలి. ఇలాంటి సమయంలో నేను ‘అనుకోని అవకాశాల కోసం పక్క చూపు’ అనే ఆలోచనను మీకు సూచిస్తున్నాను.
‘పెరిఫెరల్ విజన్’ అంటే ఏమిటి?
మీ ప్రస్తుత కెరీర్ మార్గంపై దృష్టి పెట్టండి. అయితే మీ సమయం మొత్తాన్ని దానికే కేటాయించకండి. మీ సమయంలో 10 నుంచి 15 శాతం ఇతర రంగాలను పరిశీలించడానికి కేటాయించండి. మీ ప్రధాన రంగానికి పక్కన ఉన్న ఇతర రంగాలు, కొత్త అవకాశాలు, కొత్త ఆలోచనలను గమనిస్తూ ఉండండి. అలా మీ ‘పక్క చూపు’తో మీరు ఎవరూ ఊహించని కొత్త అవకాశాలను గుర్తించవచ్చు. అదే పెరిఫెరల్ విజన్! అది మీరు ఎప్పుడూ ఊహించని ఒక కొత్త, ఆనందకరమైన కెరీర్ మార్గంలోకి మిమ్మల్ని తీసుకెళ్లవచ్చు. 1969లో స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఇంగ్లిష్‌లో బ్యాచిలర్ డిగ్రీ పొందిన తర్వాత ఫ్రాన్స్ కార్డోవా జర్నలిజం రంగంలోకి వెళ్లారు. లాస్ ఏంజెల్స్ టైమ్స్‌లో జర్నలిస్టుగా పనిచేశారు. అదే ఆమెకు నచ్చిన కెరీర్ మార్గం. కానీ ఆమె ‘పక్క చూపు’లో ఒక రోజు నక్షత్రాల గురించి ఒక డాక్యుమెంటరీ చూసింది. భౌతిక శాస్త్రం, ఖగోళ శాస్త్రంపై ఆసక్తి పెంచుకుంది.
ఆమెకు అప్పటికీ ఫిజిక్స్‌లో ఉన్నత విద్య చదవడానికి అవసరమైన సంసిద్ధత దాదాపు లేదు. అయినా కాల్‌టెక్ కమ్యూనిటీ నుంచి లభించిన సహకారంతో ఇంగ్లిష్ చదివిన విద్యార్థి నుంచి ఫిజిక్స్ గ్రాడ్యుయేట్ విద్యార్థిగా మారే మార్గాన్ని స్వయంగా నిర్మించుకున్నారు. 1979లో కాల్‌టెక్ నుంచి ఫిజిక్స్‌లో పీహెచ్‌డీ పొందారు. ఆ తర్వాత ఒక అనుకోని అవకాశం నుంచి మరొక అవకాశానికి ప్రయాణిస్తూ... ఖగోళ శాస్త్ర విభాగాధిపతిగా, నాసాలో మొదటి మహిళా మరియు అతి పిన్న వయస్కురాలైన చీఫ్ సైంటిస్ట్‌గా, నేషనల్ సైన్స్ ఫౌండేషన్ డైరెక్టర్‌గా ఎదిగారు.
నా జీవితంలో కూడా దాదాపు అలాంటిదే జరిగింది. నాకు లిగో(ఎల్‌ఐజీఓ–లేజర్ ఇంటర్‌ఫెరోమీటర్ గ్రావిటేషనల్–వేవ్ అబ్జర్వేటరీ) ప్రాజెక్ట్ ఒక అనుకోని అవకాశం. విశ్వంలో గురుత్వా కర్షణ తరంగాలను గుర్తించడానికి లిగో ప్రాజెక్ట్‌ను ప్రారంభించి నప్పుడు సాంకేతిక, రాజకీయ, సామాజిక సవాళ్లు ఎన్నో ఉన్నాయి. అయినా మేము విజయం సాధిస్తామని నమ్మాం. అదే సమయంలో ఏ సమస్యలు మన ప్రయాణాన్ని ఆపగలవో ముందుగానే గుర్తించాం. ప్రతి సమస్యను పెద్ద అడ్డంకిగా మారకముందే పరిష్కరించడానికి ప్రయత్నించాం. ఆ విధానం విజయవంతమైంది. దీన్నే నేను ‘అప్రమత్తతతో కూడిన ఆశావాదం’ అంటాను.
‘ఇంటర్‌స్టెల్లార్’ ఎలా వచ్చింది?
1979లో నేను దక్షిణ కాలిఫోర్నియాలో ఒంటరిగా ఉన్నాను. నా ‘పక్క చూపు’ను విస్తరించడానికి హాలీవుడ్‌లో డేటింగ్ కూడా చేశాను! లిండా అబ్బాట్ అనే భవిష్యత్తులో ప్రముఖ సినిమా నిర్మాతతో నాకు పరిచయం ఏర్పడింది. ఆమె ఉత్సాహభరితమైన మహిళ; నేను మాత్రం పుస్తకాల పురుగు లాంటివాడిని. అయినా మేము స్నేహితులుగా కొనసాగాం. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఆమె ఒక సినిమా కోసం నాతో ఆలోచనలు పంచు కోవాలనుకుంది. నేను ఆ అనుకోని అవకాశాన్ని వెంటనే అంది పుచ్చుకున్నాను. తర్వాత దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ చేతుల్లో ఆ ప్రాజెక్ట్ ‘ఇంటర్‌స్టెల్లార్ ’ అనే ప్రసిద్ధ చిత్రంగా మారింది.
ఇంటర్‌స్టెల్లార్ సినిమా నా కెరీర్‌ను పూర్తిగా మార్చింది. దాదాపు అర్ధ శతాబ్దం పాటు కాల్‌టెక్ ప్రొఫె సర్‌గా ఉన్న నేను... ఆ తర్వాత నా జీవితంలోని తదుపరి దశను సైన్స్, కళల కలయికలో పనిచేయడానికి కేటాయించాలని నిర్ణయించుకున్నాను. ఇలాంటి ప్రాజెక్టులు నాకు కొత్త ఆనందాన్ని ఇస్తాయి. ముఖ్యంగా యువతకు సైన్స్‌పై ఆసక్తిని కలిగిస్తాయి. నేను భవిష్యత్తు గురించి ఆశావాదంగా ఉంటాను. నేను 100 సంవత్సరాల వయసు వరకు లేదా అంతకంటే ఎక్కువ కాలం జీవిస్తూ, మానసికంగా బలంగా ఉండి, నా ప్రాజెక్టులను కొనసాగించగలనని ఆశిస్తున్నాను. కానీ రోజువారీ జీవితంలో నేను జాగ్రత్తగా ఉంటాను. నా ఆరోగ్యానికి ఎదురయ్యే ప్రమాదాలను గమనిస్తాను.
ఇప్పుడు మన ముందున్న ‘ఏనుగు’– ఏఐ
ఇప్పుడు మన ముందున్న ఒక పెద్ద విషయంపై మాట్లాడాలి. ఆ ‘ఏనుగు’ పేరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్– ఏఐ. నేను ఏఐ నిపుణుడిని కాదు. కానీ ఏఐ సంక్లిష్టమైన విషయం. కొన్ని రంగాల్లో దాని సామర్థ్యం అద్భుతంగా ఉంది. ఏఐ అభివృద్ధిని ఈరోజే పూర్తిగా ఆపేసి, ప్రస్తుతం ఉన్న రూపంలోనే కొన్ని నెలలు లేదా ఒక సంవత్సరం ఉపయోగిస్తే, మనలో చాలా మంది దాన్ని త్వరగా ఇష్టపడటం ప్రారంభిస్తారు. మనలో అనేక మందిని భయపెడు తున్నది ఏఐ ఉనికి కాదు, ఏఐ వేగంగా మారిపోతుండటమే మనల్ని ఆందోళనకు గురిచేస్తోంది.
మీరు వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ రంగాల్లో కెరీర్ ఎంచుకుంటే.. వేగంగా మారడం నేర్చుకోవాలి. అందుకు ముఖ్య మైన మార్గం... స్వీయ అభ్యాసం. టెక్నాలజీ మారుతున్న కొద్దీ దాన్ని ఉపయోగించడం మనం కూడా నేర్చుకుంటూ ఉండాలి. ఏఐ, క్రిస్పర్, ఎంఆర్‌ఎన్‌ఏ లేదా క్వాంటమ్ కంప్యూటింగ్ భవిష్యత్తు గురించి నాకు కూడా పూర్తిగా తెలియదు. నిపుణులు కూడా ‘మాకు తెలి యదు’ అని చెబుతున్నారు. కొంతమంది భవిష్యత్తు గురించి చాలా నిరాశావాదంగా మాట్లాడుతున్నారు. కానీ నేను నిరాశావాదిని కాదు. ఏఐ, ఇతర వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీల దీర్ఘకాల భవిష్యత్తును చూస్తున్నప్పుడు కూడా నేను ‘జాగ్రత్తతో కూడిన ఆశావాదం’నే పాటిస్తాను.
ఏఐ వల్ల మనుషులు ఒకరికి ఒకరు దూరమవుతారని కొందరు భయపడుతున్నారు. అలా జరగదని ఆశిద్దాం. భవిష్యత్తులో మనం మరింత బలమైన, అభివృద్ధి చెందిన, నైతిక విలువలు కలిగిన మానవ సమాజంగా ఎదుగుతామని ఆశిద్దాం. మన అభిప్రాయాలు వేర్వేరుగా ఉన్నప్పటికీ.. ప్రతి మనిషి, ఇతర మనుషులను గౌరవించే సమాజంగా మనం ఉండాలి. మనిషి–మనిషి సంబంధాలు మన ఆనందానికి, ఆరోగ్యానికి, శ్రేయస్సుకు కేంద్రంగా ఉండాలి. ఆశావాదంతో పాటు జాగ్రత్త కూడా అవసరం. దీర్ఘకాల భవిష్యత్తుపై ఆశావాదంగా ఉండండి. కానీ రోజువారీ జీవితంలో అప్రమత్తంగా ఉండండి. మన ఆశావాద లక్ష్యానికి ఎదురయ్యే ప్రమాదాలను గమనించండి. ఆ ప్రమాదాలు పెద్ద సమస్యలుగా మారకముందే పరిష్కరించండి.


