ఉద్యోగం కావాలంటే డిగ్రీ సరిపోదు.. మోదీ కీలక సూచన! | PM Modi Says AI Cannot Take Jobs Of Skilled Workers | Sakshi
Sakshi News home page

ఉద్యోగం కావాలంటే డిగ్రీ సరిపోదు.. మోదీ కీలక సూచన!

Nov 22 2026 9:00 AM | Updated on Nov 22 2026 9:11 AM

PM Modi Says AI Cannot Take Jobs Of Skilled Workers

లక్నోలో జరిగిన 5వ నేషనల్ స్కిల్ కాన్వొకేషన్ వేడుకలకు హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ యువతను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందని, అయితే మంచి నైపుణ్యాలు కలిగిన వ్యక్తుల ఉపాధిని ఎవరూ దూరం చేయలేరని అన్నారు.

కేవలం చదువుకుని సర్టిఫికెట్లు సంపాదించడం కంటే ఒక పనిలో నైపుణ్యం సాధించడం ముఖ్యమని మోదీ చెప్పారు. భవిష్యత్తులో సర్టిఫికెట్లు ఉన్నవారి కంటే నైపుణ్యం, ప్రతిభ ఉన్నవారికే ఎక్కువ గౌరవం, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అభిప్రాయపడ్డారు.

భారతదేశానికి నైపుణ్యాలు, చేతివృత్తులు ఎంతో గొప్ప వారసత్వమని మోదీ గుర్తుచేశారు. గతంలో విదేశీ పాలకులు భారతీయుల సంప్రదాయ వృత్తులను, కళాకారుల నైపుణ్యాలను దెబ్బతీశారని అన్నారు. బ్రిటిష్ పాలకులు కూడా భారతదేశంలోని నైపుణ్య ఆధారిత విద్యావ్యవస్థను బలహీనపరిచి, కేవలం గుమాస్తాలను తయారు చేసే విధంగా విద్యావ్యవస్థను మార్చారని విమర్శించారు.

లక్నో చికన్‌కారీ, బనారస్ పట్టు చీరలు, కాంచీపురం పట్టు, కశ్మీరీ పష్మీనా, కలంకారీ వంటి భారతీయ కళలు.. ప్రపంచవ్యాప్తంగా దేశానికి గుర్తింపు తెచ్చాయని చెప్పారు. నైపుణ్య విద్యకు ప్రాధాన్యత ఇవ్వడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నైపుణ్య అభివృద్ధి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిందని ప్రధాని తెలిపారు.

ఐఐటీ విద్యార్థులకు ఎలాంటి గౌరవం లభిస్తుందో.. ఐటీఐ విద్యార్థులకు కూడా అదే గౌరవం దక్కాలని మోదీ పేర్కొన్నారు. పెద్ద కంపెనీలను నడిపించడానికి కొంతమంది ఉన్నత విద్యావంతులతో పాటు వందలాది మంది నైపుణ్యం కలిగిన ఐటీఐ ఉద్యోగులు అవసరమని వివరించారు. గత పదేళ్లలో దేశంలో దాదాపు 5,000 కొత్త ఐటీఐలు ఏర్పాటు చేశామని, ఐటీఐల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య ఐదు లక్షలకు పైగా పెరిగిందని తెలిపారు. ముఖ్యంగా బాలికల సంఖ్య రెండున్నర రెట్లకు పైగా పెరగడం సంతోషకరమని అన్నారు.

భారతదేశం ప్రపంచానికి నైపుణ్యాల రాజధానిగా మారే దిశగా ముందుకు సాగుతోందని మోదీ చెప్పారు. దేశంలో మొబైల్ ఫోన్ల తయారీ గణనీయంగా పెరిగిందని, ఒకప్పుడు విదేశాల నుంచి మొబైల్ ఫోన్లను దిగుమతి చేసుకున్న భారత్.. ఇప్పుడు దేశీయంగా తయారు చేసిన ఫోన్లను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తోందని పేర్కొన్నారు.

ఉత్తరప్రదేశ్‌లో మొబైల్ తయారీ పరిశ్రమలతో పాటు సెమీకండక్టర్ తయారీ కేంద్రం కూడా ఏర్పాటవుతోందని, బ్రహ్మోస్ క్షిపణుల తయారీ కూడా రాష్ట్రంలో జరుగుతోందని తెలిపారు. అంతేకాకుండా 2027లో గ్రేటర్ నోయిడాలో ప్రపంచ నైపుణ్య పోటీలు (WorldSkills Competition) నిర్వహించనున్నట్లు ప్రకటించారు. యువత పెద్ద కలలు కనాలని, వాటిని నిజం చేసుకోవడానికి అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement