పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు డిమాండ్
న్యూఢిల్లీ: దేశ ప్రయోజనాలు కాపాడే విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ రాజీ పడ్డారంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన విమర్శలపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అభ్యంతరం వ్యక్తంచేశారు. నాలుగు ప్రశ్నలకు కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
‘‘1962లో నా గ్రామాన్ని చైనా ఆక్రమించుకుంది. ఆనాటి అవమానకర పరిస్థితికి కాంగ్రెస్ క్షమాపణ చెబుతుందా?
2.కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో భారతదేశం పేద దేశంగానే ఉండిపోయింది. అందుకు కారణం ఏమిటో చెప్పాలి.
3.భారతదేశాన్ని పాములను ఆడించేవారి దేశం అని విదేశీయులు ఎందుకు పిలిచేవారు?
4.భారత ఆర్థిక వృద్ధిని హిందూ వృద్ధి రేటు అని ఎందుకు అవమానించారు?’’ అని ‘ఎక్స్’లో కిరణ్ రిజిజు ప్రశ్నలు సంధించారు.
1962లో ఎదురైన అవమానాన్ని దేశం ఎప్పటికీ మర్చిపోదని మరో పోస్టులో పేర్కొన్నారు. 1962 నాటి భారత్–చైనా యుద్ధ సమయంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సాయుధ దళాలను, అరుణాచల్ ప్రదేశ్ ప్రజలను గాలికొదిలేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ తమ ప్రజలను పేదరికంలో ఉంచిందని, తమ రాష్ట్రాన్ని అభివృద్ధికి దూరం చేసిందని ఆరోపించారు. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో పరిస్థితులు మారాయని, అరుణాచల్ ప్రదేశ్ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని రిజిజు తేల్చిచెప్పారు.


