చంద్రుడి ధూళి, మట్టి నమూనాలతో బంగాళదుంపల సాగు
వర్మీకంపోస్ట్ సాయంతో జాబిల్లిపై సేద్యం సాధ్యమే
భూమిపై పండిన పొటాటోలతో సమానంగా దిగుబడి, పోషకాలు
ఒరెగాన్ స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల అద్భుతం
చంద్రునిపై స్థిర నివాసం దిశగా కీలక ముందడుగు
సాక్షి, స్పెషల్ డెస్క్: హాలీవుడ్‌లో 2015లో వచ్చిన ‘ది మార్షియన్’ సినిమాలో పరిశోధనల కోసం అంగారక గ్రహంపైకి వెళ్లిన వ్యోమగాముల బృందంలో ఒక సైంటిస్ట్ అనుకోని రీతిలో అక్కడే చిక్కుకొని పోతాడు. అక్కడి కఠిన పరిస్థితుల్లో బతకడానికి వీలుగా మార్స్‌లోని మట్టిలో తన వ్యర్థాలను కలిపి కొద్దిపాటి గింజలతో బంగాళదుంపలు సాగు చేస్తాడు.
ఇప్పుడు అది వాస్తవ రూపం దాల్చేందుకు ఎంతో దూరం లేదు. మనకెంతో ఇష్టమైన జాబిల్లిపై మానవ నివాసాలను ఏర్పాటు చేయాలనే అంతరిక్ష పరిశోధనా సంస్థల కల సాకారమయ్యే దిశగా శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు. చంద్రుని ఉపరితలంపై ఉండే మట్టిని పోలిన కృత్రిమ మట్టి (లూనార్ రెగోలిత్ సిమ్యులెంట్)లో బంగాళదుంపలను విజయవంతంగా పండించి ఒరెగాన్ స్టేట్ యూనివర్సిటీ (ఓఎస్‌యూ) పరిశోధకులు అద్భుతం చేశారు. ఈ వివరాలు ‘ఎన్‌పీజే మైక్రోగ్రావిటీ’జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
30% వర్మీకంపోస్ట్‌తో అద్భుత ఫలితాలు
చంద్రుడి ఉపరితలంపై ఉండే ధూళి, రాళ్ల ముక్కల పొరను ‘లూనార్ రెగోలిత్’అంటారు. ఇందులో సేంద్రియ పదార్థాలు దాదాపు ఉండవు. పైగా భార లోహాల శాతం ఎక్కువగా ఉంటుంది. ఇవి మొక్కల పెరుగుదలకు ఆటంకం కలిగిస్తాయి. ఈ సమస్యను అధిగమించేందుకు ఓఎస్‌యూ వృక్షశాస్త్రం, మొక్కల చీడపీడల శాస్త్ర విభాగం సీనియర్ రీసెర్చ్ అసోసియేట్ ప్రొఫెసర్ ఐమెరిక్ గోయర్, పరిశోధకుడు డాక్టర్ డేవిడ్ హ్యాండీల బృందం వినూత్న ప్రయోగం చేపట్టింది.
చంద్రునిపై వివిధ ప్రాంతాల్లో ఉండే ఐదు రకాల కృత్రిమ మట్టి నమూనాలకు, వానపాముల ద్వారా తయారయ్యే వర్మీకంపోస్ట్‌ను వివిధ నిష్పత్తుల్లో కలిపి బంగాళదుంపలను సాగు చేశారు. వర్మీకంపోస్ట్ కలపని మట్టిలో మొక్కల వేర్లు దెబ్బతిని ఎదుగుదల పూర్తిగా కుంటుపడింది. 5–15% కంపోస్ట్ కలిపినప్పుడు మొక్కలు పాక్షికంగా కోలుకున్నాయి.
అయితే 30% వర్మీకంపోస్ట్ కలిపిన కృత్రిమ చంద్రుడి మట్టిలో బంగాళదుంప మొక్కలు చక్కగా పెరిగి మంచి దిగుబడి ఇచ్చాయి. చంద్రుడి మట్టిలో ఉండే భార లోహాలను వర్మీకంపోస్ట్ బంధించి, మొక్కల వేర్లకు హాని కలగకుండా రక్షించిందని డా.డేవిడ్ హ్యాండీ వివరించారు. ఈ పద్ధతిలో పండిన బంగాళదుంపలు తమ సహజ పోషక విలువలను ఏమాత్రం కోల్పోలేదని, ఇవి తినడానికి సురక్షితమని స్పష్టం చేశారు.
బంగాళదుంపలే ఎందుకంటే?
నాసా చేపట్టిన ‘ఆర్టెమిస్’మిషన్ ద్వారా భవిష్యత్తులో వ్యోమగాములు చంద్రుడిపై దీర్ఘకాలం బస చేయనున్నారు. ప్రతిసారీ భూమిపై నుంచి ఆహారాన్ని పంపటం అత్యంత ఖర్చుతో కూడుకున్న పని. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ కేలరీలు, పోషకాలను అందించే పంటగా బంగాళాదుంపలను గుర్తించారు.
ఇదే అంతరిక్ష యాత్రలకు అత్యుత్తమ ప్రధాన ఆహారమని ప్రొఫెసర్ గోయర్ పేర్కొన్నారు. వ్యోమగాములు కొద్దిపాటి వర్మీకంపోస్ట్‌ను వెంట తీసుకెళితే చాలు. చంద్రుడిపైకి వెళ్లిన తర్వాత ఆహార, మొక్కల వ్యర్థాలతో చంద్రునిపైనే వర్మీకంపోస్ట్‌ను తయారు చేసుకుంటూ పంట పండించుకోవచ్చన్నారు. ప్రస్తుతం చంద్రుడి మట్టిలో సాగుకు అత్యంత అనుకూలమైన 10 బంగాళదుంప వంగడాలను గుర్తించే పనిలో ఈ బృందం నిమగ్నమైంది.


