భూమిపై సమస్త జీవరాశి మనుగడకు అత్యవసరమైన నీటి భౌతిక లక్షణాలు ఇతర గ్రహాల్లోనూ ఒకేలా ఉంటాయా? లేకపోతే ఆయా గ్రహాల్లోని పరిస్థితులనుబట్టి నీటిలోని పరమాణువుల స్వభావం మారుతుందా? నీటి బిందువులపై భారీ స్థాయిలో ఒత్తిడిని కలిగిస్తే ఏమవుతుంది?
సాక్షి, హైదరాబాద్: అమెరికాలోని నెవాడా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ఓ కీలక ప్రయోగం నిర్వహించారు. ఒక చిన్న నీటి చుక్కను రెండు వజ్రాల కొనల మధ్య ఉంచి దానిపై భారీ స్థాయిలో పీడనాన్ని ప్రయోగించారు. యురేనస్, నెప్ట్యూన్ గ్రహాలపై ఉండే తరహాలో 222 గిగాపాస్కల్స్ స్థాయిని మించిన ఒత్తిడిని కలిగించారు. అంటే మనం భూమిపై అనుభవిస్తున్న వాతావరణ పీడనం కంటే 22 లక్షల రెట్ల మేర అధిక పీడనాన్ని కలిగించారన్నమాట. దీనివల్ల నీటి చుక్క లోపల ఎలాంటి మార్పులు జరుగుతున్నాయో గమనించడానికి అత్యంత శక్తివంతమైన ఎక్స్–రే డిఫ్రాక్షన్ సాంకేతికతను ఉపయోగించారు. ఈ ప్రయోగంలో శాస్త్రవేత్తలు నీటి అణువుల ప్రాథమిక నిర్మాణంలో ఒక వింతైన మార్పును కనుగొన్నారు.
ఏమి కనుగొన్నారు?: సాధారణంగా ఏదైనా పదార్థంపై తీవ్ర ఒత్తిడి తెరిచినప్పుడు దాని అణువులు ఒకదానికొకటి దగ్గరగా చేరి మరింత స్థిరమైన, సమానమైన ఆకృతిని పొందుతాయని సైన్స్ చెబుతోంది. కానీ ఈ ప్రయోగంలో అందుకు పూర్తి భిన్నంగా జరిగింది. విపరీతమైన పీడనం వల్ల ఆ నీరు ఐస్–ఎక్స్ అనే ఒక ప్రత్యేక స్థితికి చేరుకుంది. ఆ దశలో దాని అణువుల అమరిక మరింత సమరూపంగా మారాల్సింది పోయి లంబంగా సాగిపోయి అసమానంగా తయారైంది. ఇదివరకు ఇలాంటి మార్పును ఏ ల్యాబ్‌లోనూ చూడలేదు. ఇదే తరహా ప్రయోగాల్లో అధిక ఉష్ణోగ్రతలను కూడా జోడించినప్పుడు నీరు సూపర్ అయానిక్ ఐస్‌గా మారుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇందులో ఆక్సిజన్ అణువులు గట్టి స్పటిక రూపంలో ఉండిపోగా హైడ్రోజన్ అణువులు మాత్రం ద్రవంలా స్వేచ్ఛగా కదులుతుంటాయి. ఇది చూడటానికి నల్లగా ఉంటుంది. ఈ పరిశోధన వల్ల విశ్వం గురించి మనకున్న అవగాహన మారుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఈ ప్రయోగం ఎందుకంటే..
మన సౌర కుటుంబంలోని యురేనస్, నెప్ట్యూన్ వంటి మంచు గ్రహాల అంతర్భాగంలో సరిగ్గా ఇలాంటి తీవ్రమైన పీడన పరిస్థితులే ఉంటాయి. అక్కడ నీరు ఏ రూపంలో ఉందో తెలుసుకోవడానికి ఈ ప్రయోగం ఉపయోగపడనుంది.
యురేనస్, నెప్ట్యూన్ గ్రహాలకు ఉండే వింతైన అయస్కాంత క్షేత్రాలకు ఈ అణువుల మార్పే కారణం కావచ్చు. సూపర్‌అయానిక్ స్థితిలో హైడ్రోజన్ అణువులు స్వేచ్ఛగా కదలడం వల్ల అవి విద్యుత్‌ను ప్రసరింపజేస్తాయి. తద్వారా గ్రహాల అయస్కాంత క్షేత్రాలు ప్రభావితమవుతాయి.
విపరీతమైన పీడనంలో నీటి ప్రవర్తన మారడం వల్ల ఆయా గ్రహాలపై భూమిపై లేని సరికొత్త రసాయన చర్యలు లేదా ఖనిజాలు ఏర్పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.


