నడకతో మెదడుకు పదును | Sharpening the brain through walking | Sakshi
Sakshi News home page

నడకతో మెదడుకు పదును

Oct 15 2026 3:06 AM | Updated on Oct 15 2026 3:06 AM

Sharpening the brain through walking

రోజూ నడిచే అలవాటుతో పెరగనున్న మెదడు చురుకుదనం.. శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడి

మతిమరుపు నుంచి రక్షణ లభిస్తుందని గుర్తింపు

సాక్షి, అమరావతి: రోజూ క్రమం తప్పకుండా నడిస్తే బరువు అదుపులో ఉండటమే కాకుండా గుండె ఆరోగ్యానికి మంచిది. ఈ అంశాన్ని ఇప్పటికే అనేక అధ్యయనాలు ధ్రువీకరించాయి. రోజు­వారీ నడక అల­వాటు ఉన్న వారిలో మెదడు కూడా అత్యంత చురుగ్గా పని­చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీరిలో ఏకాగ్రత, పను­లను పక్కాగా చక్కబెట్టే ఆలోచనా శక్తి గణనీయంగా మెరుగుపడుతున్నట్టు గుర్తించారు. 

ప్రఖ్యాత అంతర్జాతీయ సైన్స్‌ జర్నల్‌ ‘సైంటిఫిక్‌ రిపోర్ట్స్‌’ ఈ అంశంపై ఓ అధ్యయనాన్ని ప్రచురించింది. అమె­రికాకు చెందిన పరిశోధకుల బృందం ఆల్‌ ఆఫ్‌ అస్‌ (ఏవోయూ) పరిశోధలో భాగంగా 18 నుంచి 93 ఏళ్ల వయసున్న 3,093 మందిని అధ్యయనం చేశారు. వీరి రోజు­వారీ అడుగుల సంఖ్యను లెక్కించేందుకు ‘ఫిట్‌బిట్‌’ డిజిటల్‌ ట్రాకర్లను అమర్చారు. 2009 నుంచి 2023 వరకూ దాదాపు 14 ఏళ్లపాటు నడక తీరుతెన్నులు, రక్తపోటు హెచ్చుతగ్గులను నిరంతరం పర్యవేక్షించారు. 

అదనపు అడుగులకు ఏకాగ్రత పెరుగుదల
అధ్యయనంలో పాల్గొన్న వ్యక్తుల నడక సరళిని బట్టి మూడు గ్రూపులుగా విభజించారు. గ్రూప్‌–1లో రోజుకు సగటున 5,108 అడుగులు, గ్రూప్‌–2లో 8,875 అడుగులు, గ్రూప్‌–3లో 14,161 అడుగులు వేసేవారి చొప్పున వర్గీకరించారు. ఈ నేపథ్యంలో మొదటి గ్రూప్‌లో కంటే ఎక్కువగా నడిచే రెండు, మూడు గ్రూపుల్లోని వ్యక్తులు మెదడు సంబంధిత పరీక్షల్లో అగ్రస్థానంలో నిలిచారు. ప్రతి వెయ్యి అదనపు అడుగులకు ఏకాగ్రత, నిర్ణయాత్మక శక్తిలో స్పష్టమైన పెరుగుదల నమోదైంది.

మతిమరుపు ముప్పు నుంచి రక్షణ
నడక వంటి వ్యాయామాల వల్ల శరీరంలో వాపు (ఇన్‌ఫ్లమేషన్‌) తగ్గుతుందని పరిశోధకులు నిర్ధారించారు. మెదడు నాడీ కణాల మధ్య సంధానం (న్యూరోప్లాస్టిసిటీ) బలపడటంతో పాటు గ్లూకోజ్‌ మెటబాలిజం మెరుగవుతుంది. ఫలితంగా వయసు పైబడినా మెదడు పనితీరు మందగించదు. వృద్ధాప్యంలో దాపురించే అల్జీమర్స్, మతిమరుపు(డెమెన్షియా) ముప్పు నుంచి రక్షణకు ప్రత్యేకమైన మందుల కన్నా రోజూ ఉదయం, సాయంత్రం చురుగ్గా నడవడమే మేలని సూచించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement