సాక్షి, హైదరాబాద్: హైకోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారంటూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికి హైకోర్టు ఆరు నెలల సాధారణ జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది. అయితే అప్పీల్‌కు వీలు గా జైలు శిక్ష అమలును 4 వారాలు సస్పెండ్ చేస్తూ తీర్పు వెలువరించింది. తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మన్నె ముత్యాలమ్మ కుంట గ్రామంలో సర్వే నంబర్లు 536, 537, 657, 658లో ఉన్న ప్లాట్లను నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించి, వాటికి ఎన్‌వోసీ జారీ చేయాలని పలువురు హైకోర్టును ఆశ్రయించారు.
తమ దరఖాస్తులను అధికారులు పరిశీలించకుండా పెండింగ్‌లో ఉంచారని తెలిపారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. సదరు ప్లాట్లను నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించాలన్న వినతిని పరిశీలించాలని ఆదేశించింది. ఒకవేళ అభ్యర్థనను అంగీకరించకపోతే కారణాలను వివరిస్తూ జారీ చేసిన ప్రతులను పిటిషనర్లకు 60 రోజుల్లో అందించాలని స్పష్టం చేసింది. అయితే కలెక్టర్ గడువులోగా ఉత్తర్వులు జారీ చేయకపోవడంతో పిటిషనర్లు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్
కె.లక్ష్మణ్ ధర్మాసనం విచారణ చేపట్టి పైన పేర్కొన్న మేరకు తీర్పునిచ్చారు.


