ప్రజా సేవ చేద్దామని చాలామంది యువత ఐఏఎస్, ఐపీఎస్ వంటి కెరీర్‌లను ఎంచుకుంటారు. మరికొందరు పాలిటిక్స్‌ని ఎంచుకుంటారు. కానీ మరికొందరు అలాంటి అత్యున్నత హోదా లేదా పదవి లేకపోయినా..ప్రజలకు గొప్ప గొప్ప సేవలందించి.. జనం మెచ్చిన వ్యక్తులుగా పేరు తెచ్చుకుంటారు. అలాంటి వ్యక్తి ఎం పద్మావతి. కలెక్టర్ అయ్యి ప్రజా సేవ చేయాలనేది ఆమె కల..కానీ ఆ కల చెదిరిపోయింది. అయినా వెనక్కి తగ్గకుండా ఏవిధంగా ప్రజలకు సేవ చేస్తుందో తెలిస్తే అభినందించకుండా ఉండరు. మన లక్ష్యం నిస్వార్థపూరితంగా సేవ అందించడమే అయితే ఏదోరకంగా సాకారం కాగలదని చెబుతోంది ఈమె కథ.
తమిళనాడుకు చెందిన ఎం పద్మావతి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతో కలెక్టర్ అవ్వాలనుకుంది. అది ఆమె ప్రగాఢమైన డ్రీమ్ కూడా. అయితే ఈ 50 ఏళ్ల మహిళ తన కోరుకున్న కోరికను సాకారం చేసుకోలేకపోయింది. అయినా వెనక్కి తగ్గకుండా ప్రజలకు సేవ చేసేందుకు మరో మార్గాన్ని ఎంచుకుంది. అప్పుల్లో కూరుకుపోయే కంసాలీల నుంచి నిరుపేద పిల్లలు, ట్రాన్స్‌జెండర్ పారిశ్రామికవేత్తలకు మద్దతు ఇవ్వడం, విద్య, ఆర్థిక సహాయం, మార్గదర్శకత్వం వంటి ఎన్నో సేవలనందిస్తుంది. అందుకోమే ఆమె కమ్యూనిటీ రెనోవేషన్ అండ్ ఆర్గనైజేషన్ అడ్వాన్స్‌మెంట్ ట్రస్ట్ (COROAT)ను ఏర్పాటు చేసి ప్రజలకు ఆర్థిక భద్రత, స్వాతంత్ర్యం పొందడంలో ఏళ్లుగా సహాయసహకారాలు అందిస్తున్నారు.
ఎవరీమె..
ఆమె కుటుంబ నేపథ్యం కంసాలి. తన కుటుంబంలో ఉన్నత విద్య అనేది అంత సులభమైన విషయం కాదు. అందుకే ఐఏఎస్ అయ్యి..ప్రజా సేవ చేయాలనుకుంది. ఆ డ్రీమ్ కాస్తా..మరోదారిని ఎంచుకునేలా చేసి సుమారు 10 లాభప్రేక్ష లేని సంస్థలతో పనిచేసేందుకు దారితీసింది.
ఆ తర్వాత తిరువారూర్ జిల్లా కలెక్టరేట్‌లోని 'వాఝందు కాట్టువోం' ప్రాజెక్ట్ కింద సహాయ ప్రాజెక్ట్ మేనేజర్‌గా పనిచేశారు. ఆ క్రమంలోనే ఏప్రిల్ 6, 2009న ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న పేద వర్గాలకు సహాయం చేయాలనే లక్ష్యంతో 'కోరోట్' (COROAT)ను స్థాపించి, వివిధ సముహాలుగా సేవలను విభజించారు.
అందించే సేవలు..
తమ జీవనోపాధిని కొనసాగించడానికి కష్టపడుతున్న సాంప్రదాయ కళాకారులు
చదువును భరించలేని కుటుంబాల పిల్లలు
ఆర్థిక స్వాతంత్ర్యం, సామాజిక ఆమోదం కోరుకునే ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు
ప్రతిచోటా అన్ని రూపాల్లో ఉన్న పేదరికాన్ని అంతం చేయడం
మంచి ఆరోగ్యం
నాణ్యమైన విద్య
లింగ సమానత్వాన్ని సాధించడం.
అలాగే మహిళలు, బాలికలందరికీ సాధికారత కల్పించడం
నిరంతర, సమ్మిళిత. సుస్థిర ఆర్థిక వృద్ధిని జరిగేలా అందరికీ గౌరవప్రదమైన పనిని ప్రోత్సహించడం
అప్పుల ఊబిలో కూరుకుపోయిన స్వర్ణకారులకు సహాయం
వెనుకబడిన వర్గాల పిల్లలకు సహాయం
అలాగే ప్రభుత్వ భూ కేటాయింపులను పొందడంలో ఈ సంస్థ 228 మంది ట్రాన్స్‌జెండర్ వ్యక్తులకు సహాయం చేసింది. పద్మావతి ప్రకారం, వీరిలో తిరుచి, పుదుక్కోట్టై జిల్లాల్లోని 98 మంది లబ్ధిదారులు 'కళైజ్ఞర్ కనవు ఇల్లం' పథకం కింద ఇళ్లు నిర్మించుకున్నారు. జూలై 2026లో, కోరోట్ (COROAT) సంస్థ ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల కోసం రూపొందించిన 'మనసు' అనే ద్విభాషా తమిళ-ఆంగ్ల మానసిక ఆరోగ్య అప్లికేషన్‌ను ప్రారంభించింది.
ఇవన్నీ ఆమె ఎలా చేస్తుందంటే..
వ్యక్తులు, శ్రేయోభిలాషుల విరాళాలతో పాటు, సంస్థలు, సంఘాలతో భాగస్వామ్యాల ద్వారా ఈ సేవలందిస్తోంది. అలాగే ఆమె ట్రస్ట్ అందించే ట్రాన్స్‌జెండర్ జీవనోపాధి కార్యక్రమానికి జర్మనీకి చెందిన లెమన్‌ఎయిడ్ ఛారిటీ ఫౌండేషన్ నుంచి కూడా మద్దతు లభించడం విశేషం.
ప్రజా సేవ చేసేందుకు ప్రభుత్వ హోదా లేదా పదవితో సంబంధం లేకుండా కూడా ఆ పని చేయొచ్చని చెబుతోంది ఆమె ప్రస్థానం. ప్రజా సమస్యలు అర్థం చేసుకునే మనసు, చేయూత అందించే విశాల హృదయం ఉంటే చాలని నిరూపించింది ఈ పద్మావతమ్మ.
ఇదీ చదవండి: రోజుకి ఆరుగుడ్లు తింటూ..రెండు నెలల్లోనే ఆరు కేజీలు!


