తమిళనాడులో భారీ వర్షాలు.. బస్సుపై విరిగిపడ్డ కొండ చరియలు | Heavy rains rock Tamil Nadu landslide falls onto a bus | Sakshi
Sakshi News home page

తమిళనాడులో భారీ వర్షాలు.. బస్సుపై విరిగిపడ్డ కొండ చరియలు

Oct 24 2026 9:01 PM | Updated on Oct 24 2026 9:27 PM

Heavy rains rock Tamil Nadu landslide falls onto a bus

చెన్నై: తమిళనాడుని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. నీలగిరి, కోయంబత్తూరు జిల్లాల్లో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనల్లో ప్రభుత్వ బస్సు డ్రైవర్‌ మృతి చెందగా, బార్లియర్‌ గ్రామంలో ఓ ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది.

బార్లియర్‌ సమీపంలోని మెట్టుపాళయం–ఊటీ రహదారిపై కొండచరియలు విరిగిపడిన ఘటనలో ప్రభుత్వ బస్సు డ్రైవర్‌ జనకరాజ్‌ ప్రాణాలు కోల్పోయారు. కొండపై నుంచి భారీ రాళ్లు, చెట్లు, మట్టి ఒక్కసారిగా రోడ్డుపైకి దూసుకురావడంతో బస్సుపై పడ్డాయి. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌ అక్కడికక్కడే మృతి చెందారు. బస్సు కండక్టర్‌ కేశవన్‌ తీవ్రంగా గాయపడ్డారు. సుదీర్ఘంగా కొనసాగిన సహాయక చర్యల అనంతరం ఆయనను సురక్షితంగా బయటకు తీసుకొచ్చి, చికిత్స నిమిత్తం మెట్టుపాళయం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తగ్గింది. .

నీలగిరి జిల్లాలో  ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో కూనూర్‌–మెట్టుపాళయం జాతీయ రహదారిపై పది కంటే ఎక్కువ ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రహదారిపై పెద్ద ఎత్తున మట్టి, రాళ్లు, బండరాళ్లు పడటంతో పాటు చెట్లు నేలకొరిగాయి. దీంతో ప్రభావిత ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రహదారిని తిరిగి అందుబాటులోకి తీసుకురావడానికి విపత్తు నిర్వహణ బృందాలు, అగ్నిమాపక, రక్షణ సిబ్బంది, హైవేస్‌ శాఖ అధికారులు ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టారు.

నీలగిరి జిల్లా కలెక్టర్‌ లక్ష్మీ భవ్య తన్నేరు, జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ బృందా కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలను పరిశీలించారు. సహాయక చర్యలు, రహదారుల పునరుద్ధరణ పనులను పర్యవేక్షిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం కురిసిన భారీ వర్షాల కారణంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయని కలెక్టర్‌ తన్నేరు ఏఎన్‌ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ వెల్లడించారు. ముఖ్యంగా కూనూర్‌–మెట్టుపాళయం జాతీయ రహదారిపై అనేక చోట్ల కొండచరియలు విరిగిపడినట్లు తెలిపారు.

ఇదీ చదవండి: శబరిమల యాత్రికులకు అలర్ట్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement