తమిళనాడు సీఎం నిర్ణయానికి ఎయిర్ ఇండియా ఫిదా.. థాంక్యూ విజయ్‌ | Air India thanks Tamil Nadu CM Vijay after state cuts vat on a aviation fuel | Sakshi
Sakshi News home page

తమిళనాడు సీఎం నిర్ణయానికి ఎయిర్ ఇండియా ఫిదా.. థాంక్యూ విజయ్‌

Oct 24 2026 3:29 PM | Updated on Oct 24 2026 3:47 PM

Air India thanks Tamil Nadu CM Vijay after state cuts vat on a aviation fuel

తమిళనాడు సీఎం విజయ్‌కు ఎయిర్‌ఇండియా కృతజ్ఞతలు తెలిపింది. విమాన ఇంధనంపై విలువు ఆధారిత పన్ను వ్యాట్‌ తగ్గించడంతో విమానయాన సంస్థలకు నిర్వహణ ఖర్చులు తగ్గనున్నాయని పేర్కొంది.విమాన ఇంధనంపై పన్ను తగ్గింపు వల్ల విమానయాన సంస్థల నిర్వహణ వ్యయాలు తగ్గడంతో పాటు రాష్ట్రంలో విమాన కనెక్టివిటీ మెరుగుపడుతుందని పేర్కొంది.ఈ నిర్ణయంపై టాటా గ్రూప్‌కు చెందిన ఎయిర్ ఇండియా హర్షం వ్యక్తం చేస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది.

ఎయిర్‌ ఇండియా తన ప్రకటనలో

ఎయిర్ ఇండియా తన ప్రకటనలో “ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్‌ (ఏటీఎఫ్‌)పై వ్యాట్‌ను తగ్గించిన తమిళనాడు గౌరవ ముఖ్యమంత్రి విజయ్‌ (@TVKVijayHQ), రాష్ట్ర ప్రభుత్వానికి ఎయిర్ ఇండియా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తోంది. చెన్నై విమానాశ్రయంలో వ్యాట్‌ను 29 శాతం నుంచి 16 శాతానికి, రాష్ట్రంలోని ఇతర విమానాశ్రయాల్లో 1 శాతానికి తగ్గించడం స్వాగతించదగిన నిర్ణయం. దీనివల్ల నిర్వహణ ఖర్చులు తగ్గి, విమాన కనెక్టివిటీ మెరుగుపడుతుంది” అని ఎయిర్ ఇండియా ఎక్స్‌లో పేర్కొంది.

మా విమాన సర్వీసుల నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేయడంతో పాటు తమిళనాడు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఎదురుచూస్తున్నాం” అని  తెలిపింది. 

విమాన ఇంధనంగా ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్‌ (ఏటీఎఫ్‌)పై తమిళనాడు ప్రభుత్వం ఇప్పటివరకు వసూలు చేస్తున్న 29 శాతం వ్యాట్‌ను చెన్నై విమానాశ్రయంలో 16 శాతానికి తగ్గించింది. రాష్ట్రంలోని ఇతర విమానాశ్రయాల్లో ఈ పన్నును కేవలం 1 శాతానికి తగ్గించింది. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ తాజాగా ఎయిర్‌ఇండియా ధన్యవాదాలు తెలిపింది.

అక్టోబర్ 23న పన్ను తగ్గింపు ప్రకటన

తమిళనాడు ప్రభుత్వం 2026 అక్టోబర్ 23, శుక్రవారం ఈ పన్ను తగ్గింపును ప్రకటించింది. రాష్ట్రంలో విమాన ఇంధనంపై అధిక పన్నులు విధిస్తున్నారంటూ విమానయాన సంస్థలు చాలా కాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విమానయాన రంగానికి గణనీయమైన ఊరటనివ్వనుంది.

తమిళనాడులో ఇప్పటివరకు ఏటీఎఫ్‌పై 29 శాతం వ్యాట్‌ అమల్లో ఉండేది. దేశంలోని అత్యధిక పన్ను రేట్లు ఉన్న రాష్ట్రాల్లో తమిళనాడు కూడా ఒకటిగా నిలిచింది. దీంతో పొరుగు రాష్ట్రాల విమానాశ్రయాలతో పోలిస్తే చెన్నైలో విమాన ఇంధనం నింపుకోవడం విమానయాన సంస్థలకు చాలా ఖరీదైన వ్యవహారంగా ఉండేది. అధిక పన్నుల కారణంగా విమానయాన సంస్థలు చెన్నై విమానాశ్రయంలో ఎక్కువ మొత్తంలో ఇంధనం నింపుకోవడానికి ఆసక్తి చూపేవి కావు. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 

నవంబర్ 1 నుంచి కొత్త పన్ను రేట్లు అమలు

రాష్ట్ర వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, షెడ్యూల్డ్ విమానయాన సంస్థలకు సరఫరా చేసే విమాన ఇంధనంపై సవరించిన పన్ను రేట్లకు గవర్నర్ ఆమోదం తెలిపారు. కొత్త పన్ను రేట్లు 2026 నవంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. ఈ రేట్లు 2027 అక్టోబర్ 31 వరకు కొనసాగుతాయి.

కొత్త విధానం ప్రకారం చెన్నై విమానాశ్రయంలో ఇంధనం నింపుకునే విమానయాన సంస్థలకు 16 శాతం వ్యాట్‌ వర్తిస్తుంది. కోయంబత్తూరు, మదురై, తిరుచ్చిరాపల్లి వంటి ఇతర విమానాశ్రయాల నుంచి కార్యకలాపాలు నిర్వహించే విమానయాన సంస్థలకు 1 శాతం వ్యాట్‌ మాత్రమే వర్తించనుంది.

ఈ కొత్త పన్ను విధానానికి సంబంధించి ఇంధన విక్రయదారులు కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఇంధనం కొనుగోలు చేసే విమానయాన సంస్థలు సంతకం చేసిన డిక్లరేషన్లను సేకరించి, వాటిని తమ నెలవారీ పన్ను రిటర్నులతో పాటు సంబంధిత మదింపు అధికారులకు సమర్పించాలి.

దక్షిణాది రాష్ట్రాలతో సమానంగా తమిళనాడు పన్నురేట్లు

ఈ నిర్ణయంతో విమాన ఇంధనంపై పన్నులను ఇప్పటికే తగ్గించిన ఇతర దక్షిణాది రాష్ట్రాల సరసన తమిళనాడు చేరింది. ప్రస్తుతం కేరళలో ఏటీఎఫ్‌పై 1 శాతం వ్యాట్‌ అమల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు కూడా విమాన ఇంధనంపై పన్ను రేట్లను 1 శాతానికి తగ్గించాయి.

తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం వల్ల చెన్నైతో పాటు రాష్ట్రంలోని ఇతర విమానాశ్రయాల నుంచి విమాన సర్వీసులను విస్తరించేందుకు విమానయాన సంస్థలకు ప్రోత్సాహం లభించవచ్చు. ముఖ్యంగా ప్రాంతీయ విమాన సర్వీసులను పెంచాలనుకునే సంస్థలకు తక్కువ పన్ను రేట్లు ప్రయోజనకరంగా మారనున్నాయి.

ఇదీ చదవండి: రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement