ఇన్‌స్టాగ్రామ్‌లో ఖరీదైన కార్లతో హంగామా.. తాను పెద్ద బిజినెస్‌మేన్‌నంటూ పోజులు.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి వలలోకి దింపడం.. ఆపై అవసరాల పేరుతో డబ్బులు వసూలు చేయడం.. ఇలా ఒక్కరు కాదు.. ఏకంగా 20 మంది మహిళా పోలీసు కానిస్టేబుళ్లనే టార్గెట్ చేశాడో 23 ఏళ్ల యువకుడు. అద్దె కార్లతో సంపన్నుడిలా నటిస్తూ రూ.24 లక్షలు కొల్లగొట్టిన ఈ ఢిల్లీ ‘రికీ బహల్’ ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది. నిందితుడు విక్రాంత్ తోమర్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా మహిళా కానిస్టేబుళ్లను లక్ష్యంగా చేసుకుని ఈ మోసాలకు పాల్పడినట్లు తేలింది.
పెళ్లి పేరుతో మహిళలను మోసం చేసే కథాంశంతో తెరకెక్కిన బాలీవుడ్ చిత్రం ‘లేడీస్ వర్సెస్ రికీ బహల్’ను తలపించేలా ఈ ఘటన చోటుచేసుకుంది. విక్రాంత్ తోమర్ ఇన్‌స్టాగ్రామ్‌లో తనను తాను సంపన్న వ్యాపారవేత్తగా పరిచయం చేసుకున్నాడు. ఖరీదైన కార్లు, విలాసవంతమైన జీవనశైలికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేసేవాడు. వాటిని చూసి ఆకర్షితులైన మహిళా కానిస్టేబుళ్లతో పరిచయం పెంచుకుని, వారిని పెళ్లి చేసుకుంటానని నమ్మించేవాడు.
ఆ తర్వాత వివిధ అవసరాల పేరుతో వారి నుంచి డబ్బులు వసూలు చేసేవాడని పోలీసులు వెల్లడించారు. ఇలా పలువురు మహిళా కానిస్టేబుళ్ల నుంచి మొత్తం రూ.24 లక్షలు కాజేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. విక్రాంత్ తోమర్ లివ్ ఇన్ పార్ట్‌నర్ కూడా ఢిల్లీ పోలీసు కానిస్టేబులే. ఆమె ద్వారా తన బ్యాచ్‌కు చెందిన ఇతర మహిళా కానిస్టేబుళ్ల వివరాలను సేకరించి.. వారిని లక్ష్యంగా చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ వ్యవహారంలో ఒకే బ్యాచ్‌కు చెందిన మహిళా కానిస్టేబుళ్లు బాధితులై ఉండొచ్చని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. అయితే, వారిలో పలువురు ఇప్పటివరకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. దీంతో బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మహిళా కానిస్టేబుళ్లను ఆకట్టుకునేందుకు విక్రాంత్ ఖరీదైన కార్లను అద్దెకు తీసుకునేవాడు. ఒక్కోసారి ఎనిమిది గంటల పాటు కార్లను అద్దెకు తీసుకుని వారితో బయటకు వెళ్లేవాడని పోలీసులు గుర్తించారు. ఒకే కారును వేర్వేరు మహిళలతో తిరిగేందుకు ఉపయోగిస్తూ.. తాను సంపన్నుడినని నమ్మించేవాడనే ఆరోపణలు ఉన్నాయి.
ఒక మహిళా కానిస్టేబుల్ నుంచి వివిధ కారణాలతో డబ్బులు తీసుకుని.. మరో మహిళతో బయటకు వెళ్లేందుకు అయ్యే ఖర్చులను కూడా చెల్లించేవాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మోసాలకు సంబంధించిన నగదు లావాదేవీల్లో ‘వన్‌ఎక్స్’ బెట్టింగ్ యాప్ ఖాతాను ఉపయోగించినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం.
విక్రాంత్ తోమర్‌పై ఢిల్లీలో ఇప్పటికే ఇలాంటి మోసాలకు సంబంధించి ఐదు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. మయాపురి, హరి నగర్, ఇందర్‌పురి పోలీస్ స్టేషన్లతో పాటు ఈస్ట్ డిస్ట్రిక్ట్ సైబర్ పోలీస్ స్టేషన్‌లోనూ కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసుల్లో జైలుకు వెళ్లిన నిందితుడు జూన్‌లో బెయిల్‌పై విడుదలయ్యాడు. తాజాగా బురారీలో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం సెంట్రల్ డిస్ట్రిక్ట్ సైబర్ పోలీస్ విభాగం అధికారులు అతడిని విచారిస్తున్నారు. ఈ వ్యవహారంలో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: టీవీకే నేతపై లైంగిక దాడి కేసు.. మరుసటి రోజే షాకింగ్ ట్విస్ట్!


